చెల్లి ప్రియాంకకు పెట్టిన ముద్దుకు విపరీత ప్రచారం ఇచ్చుకున్న ‘రాహుల్ భయ్యా’!
ఎదురొచ్చిన మహిళలందరికీ ‘జగనన్న’ ముద్దులు పెట్టుకుంటూ పోతే…
నెహ్రూ–గాంధీ ‘రాజకుటుంబం’ కాలంతో పాటు మారదంటే మారబోదు అని మరోసారి మొన్న రుజువైంది. రాజధాని దిల్లీకి సమీపంలోని ఉత్తర్ ప్రదేశ్ నగరం బాగపత్ లో భారత్ జోడో యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై రాహుల్ తన వెంట ఉన్న చెల్లెలు ప్రియాంకా గాంధీ వాడ్రా భుజంపై ఎక్కడ లేని ప్రేమతో చేయి వేసి ఆమె బుగ్గను ముద్దాడారు. కాస్త ఇబ్బందిపడిన ప్రియాంక తొలి భారత కుటుంబంలోని అన్నా చెల్లెళ్ల అనురాగానికి మంచి పబ్లిసిటీ కల్పించారు. ఇతర రాజకీయ కుటుంబాల్లోని తోబుట్టువుల మధ్య అసూయాద్వేషాలు కనిపిస్తాయి. కాని, ప్రియాంక, రాహుల్ మధ్య ప్రేమానురాగాలే ఉప్పొంగుతాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో పోల్చినప్పుడు ఈ 52 ఏళ్ల ‘జాతీయ యువరాజు’ రాహుల్ ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందనిపిస్తుంది. ఇటాలియన్ రోమన్ కేథలిక్ తల్లిసోనియా మైనోకు, కశ్మీరీ బ్రాహ్మణ–గుజరాతీ జొరాష్ట్రియన్ తండ్రి రాజీవ్ గాంధీకి పుట్టిన రాహుల్ ఇంగ్లండ్, అమెరికాలో ఉన్నత చదువులు చదువుకున్నా–ఎందుకనో విశాల దృక్పథం అలవర్చుకోలేదు. కన్యాకుమారిలో మొదలైన భా–జో–యాలో ఎందరో స్త్రీలు, బాలలు, వృద్ధులను ఆప్యాయంగా దగ్గరకు ఆయన తీసుకున్నారు. ప్రేమతో కావిలించుకున్నారు. అయితే, తమ ‘సొంత రాష్ట్రం’, ‘ఖర్మ భూమి’గా చెప్పుకునే యూపీలోకి యాత్ర ప్రవేశించగానే తన ఒక్కగానొక్క చెల్లి ప్రియాంకు ఇచ్చిన ముద్దుకే ప్రపంచవ్యాప్త పబ్లిసిటీ వచ్చేలా చేసుకున్నారు రాహుల్.
జగన్ లోని ‘విశాల భావన’ రాహుల్ ప్రవర్తనలో కనపడదు ఎందుకో!
…………………………………………………………………………..
రాహుల్ మాదిరిగా పాశ్చాత్య యూనివర్సిటీల్లో చదువుకోని జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఎదురుపడుతూ తన దగ్గరకు వచ్చిన స్త్రీలందరినీ సాధ్యమైనంత వరకు ముద్దాడారు. ఈ మహిళల తలలపై చేతులు పెట్టి కుదిరితే వారి నుదుళ్లపై ముద్దులు కురిపించారు. రాహుల్ మాదిరిగా తన చెల్లెలు షర్మిలమ్మను రప్పించి పాదయాత్రలో ప్రత్యేకించి ఆమె నుదుటిపై ముద్దుపెట్టి పెద్ద ప్రచారం చేసుకోలేదు. జగన్ అంతర్జాతీయ మతం క్రైస్తవం ఆచరించే తెలుగు రాయలసీమ రెడ్డి కుటుంబంలో పుట్టినాగాని ఎందుకనో మరి ‘విశాల మానవ దృక్పథం’తో తన ముందుకొచ్చిన ఆడపడుచులందరికీ ‘ప్రేమానురాగాలు’ పంచిపెట్టారు. మరి, రాహుల్! ఆయనకు తన తల్లి, చెల్లెలే ముఖ్యం. ఇతర మహిళలు అందరూ బయటోళ్లే. అందుకే, వరుసగా రెండు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. పాదయాత్రలో ఎదురొచ్చిన లేదా కలిసి నడిచిన స్త్రీలందరినీ తన చెల్లెలితో, తల్లితో సమానంగా చూడాలని రాహుల్ పాదయాత్రకు దర్శకత్వం వహిస్తున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, తమిళ బ్రాహ్మణ నేత జైరామ్ రమేష్ ఎలాగూ సలహా ఇచ్చే అవకాశం లేదు. హరియాణాకు చెందిన ప్రఖ్యాత ఎన్నికల, రాజకీయ విశ్లేషకుడు, మాజీ సెఫాలజిస్టు, లోహియావాది యోగేంద్ర యాదవ్ అయినా తన వ్యాసం ద్వారా కాంగ్రెస్ యువరాజుకు ఈ సలహా ఇస్తే మంచిదేమో. ఈ లెక్కన భారతదేశంలో జాతీయపార్టీల ‘యువనేతలు’ ప్రాంతీయపక్షాల యువ నాయకుల నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది. దేశంలో ద్వేషభావాన్ని లేకుండా చేసి భారతీయులందరికీ ప్రేమను పంపిణీ చేయడానికి చేస్తున్న భారత జోడో యాత్ర అసలు లక్ష్యం సాధిస్తుందో లేదో తెలియదు కాని జాతీయ అన్నాచెల్లెళ్ల మధ్య బంధం మాత్రం బలపడింది.
======================
Nancharaiah merugumala,
senior editor