జాతీయ పాలసీ లేని పార్టీకి.. ఆహా..ఓహో..

గత వారం రోజులుగా ప్రధాన తెలుగు ప్రతికలు, టెలివిజన్ ఛానళ్లలో  బిఆర్ఎస్ ఆవిర్భావ సభ పై ఒకటే ఊదరగొట్టే వార్తలు. ఆహా.. ఓహో..బ్రహ్మాండం బద్దలై పోతుంది.. ప్రధాని మోదీని పడగొట్టేందుకు.. మొనగాడు.. దేశ్ కీ నేత’..కేసిఆర్ సమర శంఖం పూరించబోతున్నాడు..అంటూ కారు పార్టీ నేతలు చేసినా హంగామా అంతా ఇంతా కాదు. ఇదంతా ఎందుకంటారా.. బిఆర్ఎస్ ఆవిర్భావ సభ కార్యక్రమం ఎలా సాగిందో చెప్పడానికి ఈ సోదంతా చెప్పాల్సి వచ్చింది.  అంతన్నాడు ఇంతన్నాడో గంగారాజు.. తరహాలో.. జాతీయ పార్టీ పేరిట కెసిఆర్ చేసిన హంగామా..హడావుడి చూసి.. పార్టీ విధివిధానాలు… పాలసీ వంటి విషయాలతో..  దేశం ఆశ్చర్యపోయేలా ప్రసంగం ఉంటుందని అందరూ ఊహించారు.కానీ తీరా చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా షాకిచ్చాడు. పాత చింతకాయ పచ్చడి లాంటి పసలేని స్పీచ్ తో  దంచేశాడు. ముఖ్యంగా జాతీయ పాలసీ విధానం ఇప్పుడు ప్రస్తావించాల్సిన  అవసరం లేదంటూ చెప్పిన తీరుతో పార్టీ శ్రేణులు నిరాశా నిస్పృహలో మునిగిపోయారు. ఇదే అదనుగా ప్రతిపక్ష నేతలు.. పుండు మీద కారం చల్లిన మాదిరి  ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు.

కాగా ఎన్నడూ లేనివిధంగా బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలో కేసిఆర్ ప్రసంగం సాగింది. రాజకీయాలు శాశ్వతం కాదని ఒక లక్ష్యంతో పాలించిన వాళ్లే భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని..  గెలుపోటములు సహజమని.. ఓడినంతా మాత్రాన మునిగిపోయేది ఏమి లేదంటూ కెసీఆర్ చెప్పిన తీరు రాజకీయ విశ్లేషకులను విస్మయపరిచిందనే భావించవచ్చు. గతంలో ఎన్నడుకూడా కేసిఆర్ లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందోని వారు ఊహించి ఉండరు. ఎందుకంటే ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని సాగదీయకుండా సూటిగా.. నిక్కచ్చిగా చెప్పేస్తారు.కానీ ఈ ప్రసంగం మాత్రం అనేక అనుమానాలకు తావిచ్చిందని చెప్పకనే చెప్పవచ్చు.

మరోవైపు ఢిల్లీ సారా స్కాంలో కవిత పేరు చేర్చిన నాటినుంచి కెసీఆర్ మాట.. నడవడికలో తేడా వచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.పైకి జాతీయ పార్టీ పేరుతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న.. ప్రధాని మోదీని  ఢీ కొట్టడం సాధ్యమేనా మీమాంసతో  కేసిఆర్ సతమతమవుతున్నారని వారి నుంచి వినిపిస్తున్న మాట. 

మొత్తంగా బిఆర్ఎస్ ఆవిర్భావ సభతో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పవచ్చు.

 

 

Optimized by Optimole