Social media: సోషల్ మీడియా యూజర్స్ అలెర్ట్.. మీరు తప్పక చదవాల్సిన టాపిక్..!

Social media: సోషల్ మీడియా యూజర్స్ అలెర్ట్.. మీరు తప్పక చదవాల్సిన టాపిక్..!

సాయి వంశీ ( విశీ) :

” మనం భిన్నాభిప్రాయాల వల్లే నేర్చుకుంటాం”

(NOTE: ఇది Important Topic. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్నవారికి చాలా అవసరం. పూర్తిగా చదవండి.)

చాలా మంది ఫేస్‌బుక్‌లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవి నాకు నచ్చనప్పుడు వాటికిందకు వెళ్లి కామెంట్ చేస్తూంటాను. మరికొందరు కూడా నాకు నచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేసినా వాళ్ల దగ్గర సైలెంట్‌గా ఉంటాను. I need my freedom to object. అలా నా అభ్యంతరాన్ని చెప్పగలిగే స్వేచ్ఛ, చెప్తే తీసుకునే సహనం అన్నిసార్లూ అందరి దగ్గరా ఉండదు. అందుకే నేను చాలా తక్కువ కామెంట్లు చేస్తూ ఉంటాను.

చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవారు, Democracy means ‘of the people, by the people, for the people’ అని‌. అంటే ప్రజల కోసం, ప్రజల చేత ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వం. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు, ఓట్లు, ఎమ్మెల్యేలు, రాష్ట్రపతి, ప్రధాని అని ఊదరగొట్టవారు. అసలు డెమోక్రసీ అంటే ఎన్నెన్ని గొప్పతనాలు ఉన్నాయి! అవన్నీ కట్టగట్టి, పక్కనపెట్టి ఎన్నికలు, ఓట్లు అనే ఒక్క అంశం చుట్టే ప్రజాస్వామ్య పాఠాన్ని తిప్పేవారు. డెమోక్రసీలో అతి ముఖ్యమైనది స్వేచ్ఛ. మనకు నచ్చిన భావాలు కలిగి ఉండటం, ఎదుటివారు ఆ భావాలతో విభేదించినా మన భావాల మీద మనం నిలబడగలగడం, ఒకవేళ మన ఆలోచన తప్పని అనిపిస్తే, దాన్ని మార్చుకోవడం.. ఇన్ని ఉన్నాయి ప్రజాస్వామ్యంలో.

ఆ మధ్య ఓ హీరో తనకు రాచరికం అంటే చాలా ఇష్టమని చెప్పాడు. చదువుకున్నవారికే ఓటు హక్కు కల్పించాలని అన్నాడు. ఆయన అన్న ప్రకారమే చేస్తే, రాజు కాకిని చూపించి చిలక అంటే మనం తలూపాలి. పందిని చూపించి పులి అంటే ఊకొట్టాలి. రాజును ఎదురిస్తే శిరచ్ఛేదమే! రాజు మాట కాదంటే దేశ బహిష్కరణే! ప్రజాస్వామ్యంలో మనకు ఆ దుస్థితి లేదు.(అఫ్‌కోర్స్, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎదురిస్తే కేసులు పెడుతున్నారనుకోండి).

 

మన నిత్య జీవితంలో కూడా అటువంటి ప్రజాస్వామ్య పద్ధతిని పాటించవచ్చు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటూనే, ఎదుటివారి అభిప్రాయాల పట్ల ఒక అవగాహనతో ఉండొచ్చు. అది తప్పు అనిపిస్తే చెప్పవచ్చు. సహేతుకమైన కారణాలను వివరించవచ్చు. వారిలో మార్పు తేవచ్చు, లేదా మనమే మారవచ్చు. ఇదంతా సరైన ప్రజాస్వామ్య పద్ధతి. ఒకరు ఒక అభిప్రాయం చెప్పగానే అందరూ దానికి తానా తందానా అంటే ఇంక ఎదుగుదల ఉండదు. శైలజ నాట్యానికి కమల్‌హాసన్ తందానా అని ఉంటే ‘సాగరసంగమం’ కథే ఉండదు. మనతో ఎవరైనా విభేదించినప్పుడే మన నమ్మకాలు, అభిప్రాయాల మీద మనకెంత అవగాహన, స్పష్టత ఉందో అర్థమవుతుంది. లేకపోతే గుడ్డెద్దు చేలో పడ్డట్టు మనవి మూఢనమ్మకాలుగా మారిపోతాయి.

 

కాబట్టి ఎవరైనా మీ అభిప్రాయంతో విభేదిస్తే ఫీలవ్వద్దు. వాళ్లని ఎలా ఎదుర్కోవాలా అని తలకొట్టుకోవద్దు. వాళ్లు చెప్పిన దాంట్లో విషయం ఉంటే ఆలోచించండి. అదేం నిజం అనిపిస్తే ఒప్పేసుకోండి. అందులో చిన్నతనమేమీ లేదు. ఒకవేళ వాళ్లదే‌ తప్పు అని మీకు కచ్చితంగా తెలిస్తే ఆ వివరాలు చెప్పండి. మీ వాదన వినిపించండి‌. వినకపోతే వదిలేయండి. మనకు నష్టమేమీ లేదు. మన అభిప్రాయం మనదే! ప్రతి అభిప్రాయాన్నీ మనం తప్పక పాటించాలన్న అవసరం లేదు. కానీ మన వాదన విన్న మరో పదిమంది ఆలోచిస్తారు. అతను మారకపోయినా ఆ పదిమంది ఆలోచనలో పడతారు. అయితే గుడ్డిగా, మొండితనంగా కాకుండా నిజంగా అభ్యంతరాలు అనిపించినప్పుడే చెప్పాలి‌.

విభేదాలు అభిప్రాయాల మధ్యే కానీ, వ్యక్తుల మధ్య కాదు. అందులో వ్యక్తిగత దూషణలు, తిట్లు, బూతులు, శాపాల వంటి వాటికి తావు లేదు. ఈ ఫేస్‌బుక్‌లో భయంకరంగా వాదించుకుని, విభేదించుకున్న కొందరు బయట కలిసినప్పుడు చాలా ఆప్యాయంగా మెలగడం నాకు తెలుసు. అది హుందాతనం. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నంతమాత్రాన ఎవరూ ఎవరికీ శాశ్వత శత్రువులు అయిపోరు. విభేదాలు వేరు, గొడవలు, ఘర్షణలు వేరు. నేను భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు అంటున్నాను కానీ, గొడవలు ఉండాలని అనడం లేదు. రెండింటినీ కలిపి చూస్తూ భిన్నాభిప్రాయాన్ని గొడవగా చూసే ప్రయత్నం చేయవద్దు. అలాగే వాదనల్లో కోపతాపాలు చూపి, బూతులు తిడుతూ, వాటిని అలాగే కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. అలా ఎవరైనా చేస్తే, ఉండనే ఉంది BLOCK ఆప్షన్. వాళ్లని తొలగించడమే మేలు. చెత్త ఎంత విలువైనదైనా పారేయడమే ఉత్తమం.

ఒకరి అభిప్రాయాలు మరొకరు సమర్థించడం ఎంత ఆనందమో, అదే అభిప్రాయంలో తప్పు ఉందని అనిపించినప్పుడు విభేదించడమూ అవసరం. దాని వల్లే మనం ఎక్కువగా నేర్చుకుంటాం. ఆ అభ్యంతరంలో నిజం ఎంత, ఎంతమేరకు తీసుకోవాలి, మనలో ఏ మార్పు రావాలి అనేది ఆలోచించడం ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటాం. ఎవరికివారు భిన్నాభిప్రాయాలతో ఉండటమే ప్రజాస్వామ్య లక్షణం. కాబట్టి మీ వద్ద ఎవరైనా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పేలా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. There Intelligence Starts. It creates Intellectuals.