VidyaBalan: జనాన్ని తప్పుదారిపట్టించేది సినిమా కాదా..?

Nancharaiah merugumala senior journalist:

సినిమాలను చెడగొట్టేది సమాజమేగాని జనాన్ని తప్పుదారిపట్టించేది సినిమా కాదా?

వాస్తవానికి సినిమాలను చెడగొట్టేది సమాజమేగాని సమాజాన్ని తప్పుదారి పట్టించేది సినిమాలు కాదని ప్రసిద్ధ హిందీ కవి, స్క్రీన్‌రైటర్‌ జావేద్‌ అఖ్తర్‌ చెప్పారని మంగళవారం సినీ నటి విద్యా బాలన్‌ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. కేరళలోని పాలక్కాడు తమిళ బ్రాహ్మణ అయ్యర్‌ కుటుంబంలో పుట్టిన విద్యా బాలన్‌కు సమాజానికి దిశానిర్దేశం చేసే బరువుబాధ్యతలను కొందరు అన్యాయంగా సినిమాపై పడేశారని ఎప్పటి నుంచో నిష్టూరంగా మాట్లాడడం అలవాటు. అందుకే, ‘ నిజానికి సమాజానికి ఏది మంచి ఏది చెడో చెప్పి సన్మార్గంలో నడిపించే పని సినిమాలది కాదు. అది కుదిరే పని కూడా కాదు. అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సినిమాలను సైతం జనంలో అతి కొద్ది మంది మాత్రమే చూస్తారు. సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి సినిమాలకు లేదని జావేద్‌ సర్‌ ఎప్పుడో చెప్పారు,’ అని విద్య గుర్తు చేశారు.

తూర్పు ఉత్తర్‌ ప్రదేశ్‌ ఆజంగఢ్‌లో పుట్టిపెరిగిన కమ్యూనిస్టు హిందీ, ఉర్దూ కవి జాన్‌ నిస్సార్‌ అఖ్తర్‌ కొడుకైన జావేద్‌ మాత్రమే కాదు వివాదాస్పద ఫిల్మ్‌మేకర్‌ రామ్‌గోపాల్‌ వర్మ కూడా ప్రజలను అదే ప్రేక్షకులను ప్రభావితం చేసే సత్తువ సినిమాలకు లేదని పదేపదే చెబుతుంటాడు. కొన్నేళ్ల క్రితం విడుదలకు ముందే ఎప్పటిలా వివాదం సృష్టించిన ఒక వర్మ సినిమాపై తెలుగు టీవీ చానల్‌లో జరిగిన చర్చలో ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) నాయకురాలు వి.సంధ్య పాల్గొన్నారు. ‘ మీ సినిమాలు జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. మంచి సందేశం ఇవ్వాల్సిన బాధ్యత సినీ దర్శకులపై ఉంది,’ అంటూ ఆమె తీవ్ర ఆవేశంతో ఊగిపోయారు.

ఇక రామూ జీ మాత్రం ఆమె మాటలకు బెదిరిపోకుండా, ‘ సందేశం ఇవ్వడం నా సినిమాల బాధ్యత కాదమ్మా. నా సినిమాలు చెప్పేది మంచోచెడో నిర్ణయించేది ప్రేక్షకులే. వారికి ఆమాత్రం తెలుసమ్మా. అయినా, ఇది మంచి ఇది చెడూ అని చెప్పే శక్తిసామర్ధ్యాలుగాని, ఓపిక గాని నాకు లేవమ్మా,’ అనే విధంగా తేల్చిచెప్పారు.