తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక మీదనే కేంద్రీకృతమైంది. ప్రధాన పార్టీలన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. గత నాలుగు నెలలుగా జోరుగా ప్రచారం చేసుకున్న పార్టీలు చివరి రెండు రోజుల పోల్ మేనేజ్మెంట్పై తలమునకలై ఉన్నాయి. అత్యంత కీలకమైన ఆ రెండు రోజులపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.
హుజూరాబాద్ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలని ఓ ప్రధాన పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. అందుకనుగుణంగానే గత నాలుగు నెలలుగా.. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించడం చూస్తుంటే అతని వ్యాఖ్యలు కొట్టిపారేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎన్నికల పోలింగ్ కి గడువు రెండు రోజులు ఉండటంతో ప్రధాన పార్టీ నాయకులు పోల్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టారు. ఉప ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం పట్ల ప్రజలు నమ్మకంతో ఉన్నారని అధికార పార్టీ భావిస్తుండగా .. ఇక్కడ గెలిచి అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకోవాలని బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ కనీసం డిపాజిట్ అయిన తెచ్చుకుని పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలని చూస్తోంది.
మొత్తం మీద హుజురాబాద్ ఉప ఎన్నికలను 2024 అసెంబ్లీ ఎన్నికలకు సెమిఫైనల్ గా పార్టీలు భావిస్తున్నాయి. ఇక్కడ గెలిచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నదే వ్యూహంగా ప్రధాన పార్టీల ఆలోచనగా తెలుస్తో్ంది.