Nancharaiah merugumala senior journalist:
1946లో పుట్టిన క్లింటన్, జూ.బుష్‌కు రెండుసార్లు అవకాశమిచ్చిన అమెరికన్లు అదే ఏడాది జన్మించిన కొద్ది నెలల పెద్దోడు ట్రంప్‌కు రెండో చాన్స్ ఇవ్వరా?
గత 32 ఏళ్ల నుంచీ..అంటే 1992 నవంబర్ నుంచీ వరుసగా జరిగిన 8 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెజ్ జోసెఫ్ బైడన్ సహా ఐదుగురు నాయకులు ఈ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. వారిలో ముగ్గురు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్ (జూనియర్ బుష్), బరాక్ ఎచ్ ఒబామా రెండేసి సార్లు వరుసగా ఎన్నికల్లో గెలిచారు. ఒక్కొక్కసారి గెలిచిన ఇద్దరు– డొనాల్డ్ ట్రంప్ (78), జో బైడన్ (82). ఈ ఇద్దరిలో ట్రంప్ రెండో ప్రయత్నంలో ఓడిపోగా ఇప్పుడు మూడోసారి పోటీలో ఉన్నారు. వయసు భారం తెలుసుకున్న బైడన్ రెండోసారి పోటీ నుంచి కొన్ని మాసాల క్రితం వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ ఐదుగురికి సంబంధించి ఆసక్తికరంగా కొట్టొచ్చినట్టు కనిపించే విషయం ఏమంటే–వారిలో ఒక్క ఒబామా (1961లో పుట్టి 63 నిండిన యువనేత) తప్ప మిగిలిన నలుగురు శ్వేత జాతి నేతలూ 1940ల్లో పుట్టినవారే. ఈ నలుగురిలో ముగ్గురు: బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, డొనాల్డ్ ట్రంప్– ఒకే సంవత్సరంలో…అదే 1946లో జన్మించారు. మరో అంశం ఏమంటే ఒకే ఏడాది పుట్టిన ముగ్గురు నేతల్లో చిన్నవాడు బిల్ క్లింటన్, ఆయన కంటే కొద్ది మాసాలు పెద్దవాడు జార్జి డబ్ల్యూ బుష్ వరుసగా 1992, 1996, 2000, 2004 ఎన్నికల్లో రెండేసిసార్లు గెలిచారు. ముగ్గురిలో అందరి కన్నా కొన్ని మాసాల పెద్దవాడైన డొనాల్డ్ ట్రంప్ (ఇప్పుడు 78) చాలా ఆలస్యంగా 2016 ఎన్నికల్లో విజయం సాధించి నాలుగేళ్లు పదవిలో కొనసాగారు. వయసులో మిగతా ఇద్దరి కన్నా ముందు పుట్టాడేగాని మద్యం, సిగరెట్లు తాగే అలవాటు లేని ట్రంప్ ఇప్పటికి ఒక్కసారే ప్రెసిడెంట్ అయితే క్లింటన్, బుష్ వరుసగా రెండేసిసార్లు అమెరికా అధ్యక్షులుగా గెలిచి 8 సంవత్సరాల చొప్పున అధికారంలో ఉన్నారు. మరి ట్రంప్‌కు కూడా 4 ఏళ్ల విరామం తర్వాత రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశం ఉన్నదీ లేనిదీ బుధవారం సాయంత్రానికి తేలిపోతుంది.
ఇక్కడ మరో కీలక విషయం ఏమంటే 1940ల్లో పుట్టిన నలుగరురు క్లింటన్, బుష్, ట్రంప్, బైడన్ (బైడన్ ఒక్కరే 1942లో పుట్టారు) అధ్యక్షులయ్యారుగాని 1950ల్లో జన్మించిన అమెరికా నేత ఎవరూ ఇప్పటి దాకా అధ్యక్షుడిగా పోటీచేసి గెలవ లేదు. కాని, 1961లో జన్మించిన తొలి ఆఫ్రికన్–అమెరికన్ (నల్లజాతి) బరాక్ ఒబామా రెండుసార్లు ఎన్నికల్లో గెలిచారు. 2024 నవంబర్ 5న జరిగిన అమెరికా 60వ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అభ్యర్ధి ఒకవేళ కమలా హ్యారిస్ అయితే ఆమె వ్యక్తిగా 47వ ప్రెసిడెంట్ అవుతారు. అంటే, ఇప్పటికి 46 మంది నేతలు 59 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుత రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే 45వ అమెరికా అధ్యక్షుడిగా చరిత్రలో నమోదయి ఉన్నారు. ప్రెజ్ నంబర్ పెరగకుండా ఉండాలంటే న్యూయార్కర్ ట్రంప్ గెలవాల్సి ఉంటుంది. సంఖ్య 47కు ఎగబాకాలంటే కాలిపోర్నియా లాయర్ నుంచి ఎదిగిన కమలా హారిస్ విజయం సాధించాల్సి ఉంటుంది. తమిళ బ్రాహ్మణ స్త్రీకి, ఆఫ్రికా–జమైకాలో మూలాలున్న ప్రొఫెసర్‌కు పుట్టిన కమల 1963లో జన్మించిన కారణంగా ఆమె 1960ల్లో పుట్టిన అధ్యక్షుల జాబితాలో బరాక్ ఒబామా సరసన రెండో స్థానంలోకి వెళతారు.
(ప్రముఖుల పుట్టిన సంవత్సరాలు గమనిస్తూ వాటిని గుర్తుపెట్టుకునే బలహీనత ఫలితంగా తెల్లవారు జామున కాఫీ కూడా తాగకుండా అమెరికా అధ్యక్షులు కొందరికి సంబంధించిన ఈ పోస్టు రాశానే గాని… 60వ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్ధుల్లో నాకు ఫేవరిట్ ఎవరూ లేరు)