కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది అనుకునేలోపే మరో ఉపద్రవం నిఫా వైరస్ రూపంలో ముంచుకొస్తోంది. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఈ వైరస్ ఆనవాళ్లను మహారాష్ట్రలో శాస్త్రవేత్తలు గుర్తించారు. పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ వైరస్ వివరాలను బయటపెట్టింది.
మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ గుహలో నిఫా వైరస్ వ్యాధి సోకిన గబ్బిలాల నుంచి సేకరించిన శాంపిల్స్ పరీక్షించగా.. వాటిల్లో వైరస్ వ్యాపించినట్లు తేలింది. రాష్ట్రంలో ఇంతకుమునుపెన్నడూ ఈ వైరస్ను గుర్తించలేదని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. కరోనా వైరస్ కన్నా నిఫా వైరస్ ఎంతో ప్రమాదకరమైనది. డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) గుర్తించిన ప్రమాదకర వైరస్ల జాబితాలో మొదటి పది స్థానాల్లో ఈ వైరస్ ఉంది. దీనిని మొదటిసారిగా మలేషియాలో 1998-99లో పందుల్లో దీనిని గుర్తించారు. ఈ వైరస్కు టీకా కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తే ప్రాణ నష్టం అపారంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ రూపంలో ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో.. నిఫా వైరస్ తో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు ఈ వైరస్కు తిక్క తయారు చేసే పనులను పరిశోధకులు ముమ్మరం చేశారు. ప్రభుత్వాలు సైతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.