ఏదైనా…కాలపరీక్షకు నిలిస్తేనే..!!

తెలంగాణ భవిష్యత్‌ రాజకీయాలకు సంబంధించిన కీలక పరిణామాలు… ఈ వారం రెండు రాజకీయ శిబిరాల్లో శీతాకాలంలోనూ వేడి పుట్టించాయి. మొదటిది, ఢల్లీిలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ‘మిషన్‌ తెలంగాణ’ కేంద్రకంగా జరిగిన నిర్ణయాలైతే, రెండోది బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ తొలి రాజకీయ సభ! ఉద్యమం నుంచి రాజకీయాలకు మళ్లిన టీఆర్‌ఎస్‌ తన 23 ఏళ్ల ప్రస్తానంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గా మారింది. ఆ క్రమంలో… పెద్ద సభావేదిక నుంచి, కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు గట్టి స్వరంతో సంకేతాలిచ్చింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఒక కార్యాచరణ నిర్దేశిస్తూనే బీజేపీ కేంద్ర నాయకత్వం, కేంద్రంలో లాగానే తెలంగాణలోనూ ఎన్నికల వరకు పార్టీ నాయకత్వ మార్పేమీ ఉండబోదన్న పరోక్ష సంకేతాలిచ్చింది. ‘బండి సంజయ్‌ను మారుస్తారేమో!’ అన్న ప్రచారాలకు తెరదించుతూ, ఆయనే ఆదర్శంగా ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను అధ్యయనం చేసి, అనుసరించండని ఇతర రాష్ట్రాల నాయకులకు పార్టీ అగ్రనాయకత్వం సూచించినట్టు సమాచారం!

శుభారంభాలకు పట్టు ‘ఖమ్మం మెట్టు’గా పెరొందిన ఖమ్మం నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలకు తొడకొట్టారు. ఫ్రంట్‌, కూటమి వంటి పదాలు లేకుండానే… కేంద్ర బీజేపీ సర్కారుపై కాంగ్రేసేతర రాజకీయశక్తిగా కలిసి పోరాడుతామని నలుగురు సీఎంలు, ఓ మాజీ సీఎం, ఓ పార్టీ జాతీయనేత అంతా చేతులు కలిపి యుద్దం ప్రకటించారు. పోరుకు తమ అస్త్ర`శస్త్రాలేమిటో సూచాయగా వెల్లడిరచారు. ఎప్పట్లాగే కేసీఆర్‌ అన్నీ తానై ఈ‘షో’ నిర్వహించారు. మంత్రి హరీష్‌రావును ప్రశంసించారు. బీఆర్‌ఎస్‌ కు పట్టం కడితే ‘తెలంగాణ విజయ నమూనా’ను దేశవ్యాప్తం చేస్తామన్న కేసీఆం,్‌ జాతీయస్థాయిలో గెలుపునకు ముందు ఇంటగెలవాలి. అభివృద్ది`సంక్షేమంలో తాను చెబుతున్న తెలంగాణ నమూనా కాలపరీక్షకు నిలవాలంటే, దానిపై వచ్చే విమర్శలకు సమాధానాల్ని సంసిద్దం చేసుకున్నాకే తెలంగాణ బయటకు అడుగువేయాల్సి ఉంటుంది. అందుకేనేమో, సభలో పాల్గన్న ఇతర నేతలు బీఆర్‌ఎస్‌ గురించి పెద్దగా మాట్లాడకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు పైన, దాని నిర్వాకాలపైన ఎక్కువ మాట్లాడారు. సర్కారు మారాల్సిన అవసరం ఉందని, ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ఉమ్మడిపోరు జరగాలనే అంశానికే ప్రాధాన్యత ఇచ్చారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌, బీజేపీ పాలనా వైఫల్యాలను ఎండగట్టిన కేసీఆర్‌, తెలంగాణలో తాము సాధించిన ప్రగతి, సంక్షేమం దేశ వ్యాప్తంగా ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించడంపై దృష్టి నిలిపారు. ఆ చైతన్యవ్యాప్తి, ప్రశ్నించడమే బీఆర్‌ఎస్‌ పని అని చెప్పారు.

ఒకటే కాదు లక్ష్యం!

ఖమ్మం సభతో ఇల్లలికిన బీఆర్‌ఎస్‌ పండుగకు నిరీక్షించే ముందు, ఇంకొన్ని గట్టి అడుగులు వేయాలి. బీజేపీ`కాంగ్రేసేతర రాజకీయ ప్రత్యామ్నాయం కోసం దేశంలో ఇదేం తొలి యత్నం కాదు. ఇదివరకటి యత్నాలు తక్కువ వ్యవధిలోనే బెడిసికొట్టాయి. మళ్లీ కాంగ్రెస్‌ను కేంద్రకం చేసుకుంటే తప్ప విపక్ష ఐక్యత మనలేకపోయింది. ఇప్పుడిరదరు నాయకులు ఒకే వేదిక నుంచి బిగ్గరగా మాట్లాడినా… బీజేపీపై వ్యతిరేకత తప్ప ఇంకా ఉమ్మడి విధానం ఏదీ చెప్పలేదు. కేసీఆర్‌ ఇదివరకే కలిసిన వాళ్లలో కాంగ్రెస్‌ పట్ల వీరవ్యతిరేకత లేని మమతా బెనర్జీ, స్టాలిన్‌, శరద్‌ పవార్‌, సోరెన్‌, కుమారస్వామి, ఉద్దవ్‌ ఠాక్రే, నితీష్‌, తేజస్వీ యాదవ్‌ వంటి నాయకులు ప్రారంభ సభకు రాలేదు. వారిని పిలువలేదా? వారే రాలేదా? తెలియదు. కలిసి వెళదామని సుముఖత వ్యక్తం చేసీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఏకపక్షంగా అభ్యర్థుల (తొలి) జాబితా విడుదల చేశారనే కోపంతో కుమారస్వామిని ఈ సభకు కేసీఆరే పిలవలేదనే ప్రచారమూ ఉంది. ఈ నాయకులంతా ‘తెలంగాణ అభివృద్ది నమూనా’ను వారి వారి రాష్ట్రాల్లో స్వాగతిస్తారా? వారితో కలిసి బీఆర్‌ఎస్‌, సీట్లు పంచుకొని పొత్తులతో పోటీ చేస్తుందా? తనంత తాను విస్తరిస్తుందా? అన్నవి కేసీఆర్‌ చెప్పినట్టు త్వరలో వెల్లడయ్యే పార్టీ విధానంతో తేలచ్చు. ఉత్తరాది హిందీ ప్రాంతాల వైఖరిని బట్టి, జాతీయ రాజకీయాలు అంత తేలికేం కాదు. 2014 ఎన్నికల్లోనే 4 లోక్‌సభ స్థానాలు గెలిచిన ఆప్‌, ఎనిమిదేళ్లకు పంజాబ్‌ అసెంబ్లీలో క్లిక్‌ అయినా, గుజరాత్‌లో చతికిల పడిరది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఖాతా తెరవలేకపోయింది. టెలిస్కోపిక్‌ పద్దతిలో కేసీఆర్‌ లక్ష్యాలు కూడా ఒకటి వెనుక ఒకటుంటాయి. తెలంగాణ సెంటిమెంట్‌ ఇపుడు మందగించింది. ముందు, 2023 స్వరాష్ట్ర ఎన్నికల్లో నెగ్గాలి. దేశం కోసం కష్టపడుతున్నట్టు ఒక దృశ్యం ఆవిష్కరిస్తే తప్ప దానికీ గడ్డుకాలమే! అటుపై.. భావసారూప్య నేతల సహకారంతో ఆయా రాష్ట్రాల్లో కాలూన్చి, మొదట 6శాతం ఓట్లు` కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాతినిధ్యంతో ‘జాతీయ హోదా’ దక్కించుకోవాలి. అదృష్టం కలిసొస్తే, బీజేపీ పై వ్యతిరేకత బలమైన గాలిగా మారి, కాంగ్రెస్‌ ఇప్పుడున్నట్టే చతికిలపడి, తామాశించినట్టు ఇతర విపక్షాలకు తగినన్ని సీట్లస్తే… అప్పుడు ‘కేంద్ర రాజకీయాల్లో’ చక్రం తిప్పొచ్చన్నది కేసీఆర్‌ దీర్ఘకాలక వ్యూహం! ఆ సెంటిమెంట్‌ మీది ఆశే జైతెలంగాణ నుంచి ‘జై భారత్‌’ కి స్వరం మారింది. ‘కంటి వెలుగు’ జనానికి చక్కని చూపునిస్తుంది, నిజమే! బీఆర్‌ఎస్‌ కూడా దృష్టిని విస్తృతపరచుకోవాలి. లేకుంటే కోదండరామ్‌ అన్నట్టు కేసీఆర్‌ మాటలు ‘అద్దాల వెనుక మిఠాయిలే’ అవుతాయి!

విమర్శ తేలిక, తిప్పికొట్టడమే కష్టం..

‘తెలంగాణ నమూనా దేశవ్యాప్తం చేస్తాం’ అన్నపుడు కొన్ని విమర్శలు సహజం. నినాదం ‘అబ్‌ కీ బార్‌, కిసాన్‌ సర్కార్‌’ అయితే, రాష్ట్రంలో రైతాంగం సంతృప్తి స్థాయి ఎంత అనే చర్చ వస్తుంది. ఎనిమిదేళ్లలో దాదాపు 8000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఒక్క రైతుబంధు ఇస్తుంటే,. విత్తనాలు, ఎరువుల సబ్సిడీలు, పంట నష్టపరిహారాలు, భీమా వంటివెందుకు రావట్లేదు? అనే ప్రశ్నలకు జవాబు కావాలి. ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు ప్రయివేటు పరమైనా మళ్లీ ప్రభుత్వ రంగంలోకి తెచ్చేట్టయితే, నిజాం షుగర్స్‌ ఎందుకు వెనక్కి రాలేదనే ప్రశ్నా వస్తుంది. ధరణి సమస్యలు, కాళేశ్వరం వైఫల్యాలు, ఉద్యోగ నియామకాల్లో జాప్యం, దళితబంధులో అవినీతి`వివక్ష, మిషన్‌ భగీరథ లోపాలు, దళితులకు జరగని భూపంపిణి, పోడు భూముల పంచాయతీ, ఇంకా అందని డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు వంటి అంశాల్లో వచ్చే విమర్శలకు సమాధానాలు సిద్దం చేసుకోవాలి. వైఎస్‌ఆర్‌ సమయంలో తెచ్చిర ఆరోగ్యశ్రీ, వ్యవసాయ ఉచితవిద్యుత్తు లాగా సందేహాలకు తావులేని పథకాలేం కావివి. ఒక్క రైతుస్వరాజ్యవేదిక లోగొంతు ప్రశ్నలకే జవాబు చెప్పలేక, తరిమి తరిమి కొడతామన్నవాళ్లు జాతియస్థాయిలో ఎవరెవరో అడిగే ప్రశ్నలకు, విసిరే విమర్శలకు తట్టుకొని నిలుస్తారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. అంతర్రాష్ట్ర నదీజలవివాదాలు ఒక్క జాతీయవిధానంతో పరిష్కారమయ్యే పరిస్థితులు లేవు. పేర్లు వేరయినా… పేదలకు నేరుగా డబ్బు అందించే వివిధ సంక్షేమ కార్యక్రమాలు కొంచెం అటిటు, అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. మరి ‘తెలంగాణ ప్రత్యేకత ఏంటి?’ అనే ప్రశ్న వస్తుంది. ముస్లీం ఓట్ల సఖ్యతకు పనికొచ్చే అసదుద్దీన్‌ ఒవైసీ, వేదికలపైకి పనికిరారా… వంటి ప్రశ్నలకీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
కొత్త ఎజెండా రాష్ట్ర బీజేపీకి సవాల్‌
బీఆర్‌ఎస్‌ రూపమెత్తి కేసీఆర్‌, ప్రధాని మోదీని ఇంటికి పంపుతామంటున్నట్టే, ఈ సారి కేసీఆర్‌నే ఇంటికి పంపుతామంటున్న బీజేపీకి కేంద్ర నాయకత్వం గట్టి టాస్క్‌నే ఇచ్చింది. ‘మిషన్‌ తెలంగాణ’ నెరవేరాలంటే, కేవలం ప్రసార మధ్యమాల్లో మనుగడ సాగించడం కాకుండా జనపక్షం వహించి, ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం గుర్తుచేసింది. బూత్‌స్థాయి వరకు పార్టీని విస్తరించి, బలోపేతం చేయాలంది. అన్ని కోణాల్లో కేసీఆర్‌ను ఎండగట్టాలంది. తొలిసారి, ముస్లీంలనూ మచ్ఛికచేసుకోమని పురమాయించింది. జాతీయ స్థాయిలో పార్టీ అధినేత జేపీ నడ్డాను మార్చేదిలేదని పేర్కొన్న నాయకత్వం, రాష్ట్రంలో సంజయ్‌ని కూడా మార్చబోమన్న సంకేతం ఇచ్చింది. నెలకొకసారి సగటున అమిత్‌షా రాష్ట్రానికి వచ్చే అవకాశమున్నట్టు తెలిపింది. శీతాకాలంలో వేడి బాగానే ఉంటుంది, కానీ, వచ్చే ఎన్నికలలోపు వేసవికాలం వేడిని రెండు పార్టీలూ తట్టుకోవాల్సి ఉంది.

===================
-ఆర్‌.దిలీప్‌రెడ్డి,
పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,