‘జయ జయ జయ జయహే’ రివ్యూ..

Shanthi ishaan : 

===========

ఆడదానికి కావల్సిందేంటి అని ఓ లేడీ జడ్జ్ కోర్టులో అడుగుతుంది. ఒకడు వినయం, విధేయత అంటాడు. ఇంకొకడు శాంతి, కరుణ, అదృష్టం అంటాడు. మరొకడు వంట బాగా చేయాలంటాడు. ఇంకో పెద్దాయన పిల్లల్ని కనడమంటాడు. అవేవీ కావు స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం అని చెప్పి ఆ జడ్జ్ అందరికీ అక్షింతలేస్తుంది. ఇంత పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదు గానీ ఆడదానికి తనదైన ఉనికి, తన ఊపిరి మీద తనకే హక్కుందని చెప్పుకోగలిగే కాసింత స్వేచ్ఛ ఉంటే చాలేమో! ఇంతకీ ఈ సీన్ ఏ సినిమాలోదో వేరే చెప్పాలా?

“జయ జయ జయ జయహే ఒక కామెడీ సినిమా. చాలా సరదాగా సాగింది”- భార్యలు భర్తలను కొట్టే కుళ్ళు జోకులను వాట్సప్ లో ఫార్వర్డ్ చేసుకుంటూ కాలక్షేపం చేసుకునే బ్యాచ్ తేల్చిన విషయమిది! “సంసారమన్నాక సర్దుకుపోవాలి గానీ రచ్చకెక్కితే ఇదిగో ఇలాగే ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది” – మనువాదాన్ని మహ బాగా ఒంటపట్టించుకున్న మగానుభావుల ఉవాచ ఇది! ఈ రెండో మాట సంగతేమో గానీ మొదటి మాట కొంతవరకు నిజమే. సినిమా చూస్తున్నంతసేపు చాలా చోట్ల నవ్వొచ్చేస్తుంది. అలా అని ఇది కామెడీ సినిమానా? చిన్నప్పుడు మా అమ్మ వేప ముద్దను మందుగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు చక్కెరలో దొర్లించి ఇచ్చేది. అప్పుడు వేప చేదు కాస్త తగ్గినట్లు అనిపించేది. ఇదీ అంతే! చేదు నిజాలను కొడితే మైండ్ లోకి దిగిపోవాలన్నంత గాఢంగా చెప్పాలంటే చక్కెర లాంటి కామెడీని అద్దాలనుకున్నాడు దర్శకుడు విపిన్ దాస్. అందుకే ఒక సీరియస్ సబ్జెక్టుకు కామెడీ కోణం జోడించారు. కానీ తను చూపించిన పరిష్కారమే అందరి పరిష్కారమూ కానక్కరలేదు. అసలిది పరిష్కారం చూపించేసి చేతులు దులుపుకునే సినిమా కూడా కాదు. ఆడపిల్ల భూమ్మీద పడ్డది మొదలు ఎన్ని రకాల వివక్షలు ఎదుర్కొంటుందో చూపే ప్రయత్నం ప్రతి ఫ్రేములోనూ కొట్టొచ్చినట్లు కనబడుతుంది. అసలిలా ఎండగట్టడమే సినిమా అసలు ఉద్దేశం కూడా.
అలాగని ఇదేదో పాత స్టైల్ బోరింగ్ సినిమా అనుకునేరు. నా దృష్టిలో ఇది one of the intelligently woven screenplays. డైరెక్టర్ తను చెప్పాలనుకుంటున్నది చక్కటి narrative styleలో చెప్పాడు. Satirical messageని suspense & wow factorతో బాగా balance చేశాడు. సినిమాలో హీరోయిన్ ఇంట్రొడక్షన్ సీన్ ని రెండు వర్షన్స్ కింద బాగా ప్లాన్ చేశాడు. ఆహా అనిపించే మొదటి వర్షన్ కి పూర్తి విరుద్ధంగా ఉంటుంది రెండో వర్షన్. మామూలుగా చెప్పే కంటే ఇలా చెప్తే దాని impact ఎక్కువ. అందుకే ఈ తరహా screenplay బాగా నచ్చింది నాకు. ఆ పోర్షన్ కనీసం నాలుగైదు సార్లయినా చూసుంటా. ఆడ కూలీలను హేళనగా మాట్లాడే ఓ supervisorకి అబ్బాయి తర్వాత అమ్మాయి పుడుతుంది. టైం వేస్ట్ అనుకున్నారో ఏమో ఆ పిల్ల పేరు కోసం కూడా పెద్దగా ఆలోచించరు. అన్నయ్య పేరులో సగం పేరు తీసి పెట్టేస్తారు. ఏ కళనున్నాడో ఆ పిల్లని ఇందిరా గాంధీలాగా పెంచుతానంటాడు తండ్రి. అలా అయితే పెళ్ళి చేయడం కష్టమే నీ ఇంట్లోనే ఉండిపోతుంది అంటాడు పక్కనే ఉన్న మేనమామ. పిల్లకి చెవులు కుట్టిస్తారు. ఆ పసిది ఏడుస్తుంటే ఏం మగపిల్లాడిలా చెవులు కుట్టించుకోకుండా తప్పించుకుందామనుకున్నావా అంటుంది కన్నతల్లి. ఆ పిల్ల కాస్త పెద్దవగానే మగపిల్లలతో కలిసి చెట్లెక్కి ఆడుతుంటుంది. మేనమామ వచ్చి దింపేసి మగాడిలాగా చెట్టెక్కి ఆడతావా అని వెనక నుంచి ఎద్దేవా చేస్తాడు. పాప టెడ్డీ బేర్ కావాలంటే కొడుకు ఆడుకుంటున్న కారు ఇచ్చి దాంతో కాసేపు ఆడుకోమంటాడు తండ్రి. అన్నయ్య చొక్కాలను రీసైజ్ చేసి అవే ఆ పిల్లకి వేసుకోమని ఇస్తారు. తనకంటూ పుస్తకాలు కొనరు. అన్నయ్య పుస్తకాలతోనే చదువుకోవాలి. ట్యూషన్ కి పోతా అంటే కుదరదంటారు. తనకి నచ్చిన కాలేజ్ లో చదువుతా అంటే వాళ్ళకు వీలైన కాలేజ్ లోనే చేర్పిస్తారు. బీఎస్సీ చదువుతా అంటే BA తెలుగు (BA మలయాళం) చదివిస్తారు. ఎవరినో ఇష్టపడిందని తెలియగానే చదువు మధ్యలోనే మాన్పించి ఒక దారినబోయే దానయ్యను తీసుకొచ్చి తాళి కట్టిస్తారు.
ఈ పైన చెప్పిన సంఘటనల్లో కొన్నైనా- అమ్మాయిలైతే మీ జీవితాల్లోనో, అబ్బాయిలైతే మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల అమ్మాయిల జీవితాల్లోనో ఏదో ఒక దశలో జరిగే ఉంటాయి. చాలా మందికి అవసలు సమస్యలుగానే అనిపించవు. కానీ వివక్ష ఎదుర్కొంటున్నవాళ్ళకు అవే జీవితమంత పెద్ద సమస్యలు.

అయితే సినిమాలో ఇది పావు వంతు మాత్రమే. అసలు కథ ఆ తర్వాత మొదలవుతుంది. జయ (మనం ఇంతదాకా మాట్లాడుకున్న అమ్మాయి పేరు – ఆ అమ్మాయి అన్నయ్య పేరు జయన్) ప్రేమ వ్యవహారం బయటికొస్తే పిల్లకసలు పెళ్ళే కాదని మేనమామ బెదిరించగానే జయ తల్లిదండ్రులు భయపడిపోయి కోళ్ళ ఫారం బిజినెస్ చేసుకునే రాజేశ్ కిచ్చి పెళ్ళి చేసేస్తారు. పెళ్ళయ్యాక చదివించాలనే షరతుపెడతారు. కానీ ఇంట్లోకి అడుగు పెట్టీ పెట్టగానే జయ మనసు ఏదో కీడు శంకిస్తుంది. భర్త గారి హీరోయిజం తాలూకు చిహ్నాలు ఆ ఇంట్లో చాలానే కనపడతాయి. ఆ హీరోయిజం ఏంటో అర్థమయ్యే రోజు తొందరలోనే వచ్చేస్తుంది. ఆ రోజు భర్త కోపంతో కూరను నేలకేసి కొడతాడు. అదేమని ప్రశ్నిస్తుంది. అంతే మరుక్షణమే ఆ అమ్మాయి చెంప పగిలిపోతుంది. ఆ తర్వాత అతగాడు చాలా తాపీగా సారీ చెప్పి తనకి నచ్చిన సినిమాకి తీసుకెళ్తాడు. హోటల్ కి తీసుకెళ్ళి తనకి కావల్సిన తిండే ఆర్డర్ చేస్తాడు. ఈ తంతులో ఎక్కడా పశ్చాత్తాపం కనపడదు. ఏదో పొరపాటున చేయి లేచిందే తప్ప తను చాలా మంచోణ్ణని నిరూపించుకునే ప్రయత్నమే కనపడుతుంది. చాలా మంది ఇళ్ళల్లో ఇలాంటివి చాలా కామన్ గా జరిగిపోతుంటాయి. కానీ irony ఏంటంటే ఈ తంతు ఒక్కసారితో ఆగదు. అదో అలవాటుగా మారిపోతుంది- బాధితులకు, బాధించేవాళ్ళకు.

పాపం జయ తల్లికి తన గోడు చెప్పుకుంటుంది. ఇలాంటివన్నీ మామూలే అంటుందావిడ. తండ్రి, అన్నకి చెప్పినా పట్టించుకోరు. అత్త, ఆడపడుచు మౌన ప్రేక్షకులు మాత్రమే! మరేం చేయాలి తను? జయ స్వతహాగా తెలివైన పిల్ల. కాబట్టి చాలా తెలివిగా ఆలోచించి భర్తకు దిమ్మదిరిగే షాక్ ఇస్తుంది. అది అతగాడికే కాదు. అతని చుట్టూ అస్తిత్వాన్ని అల్లుకున్న పితృస్వామ్య సమాజానికి కూడా పెద్ద షాకే. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి (Of course మీలో చాలా మంది ఈపాటికే చూసి ఉంటారు). ఎదుటివాడు తప్పు చేస్తే ఆ తప్పే మనమూ చేయాలా అంటే ఒక్కోసారి తప్పదు. మనం చాలాసార్లు తెలిసో తెలియకో ఎదుటివాళ్ళను బాధపెడతాం. అదే బాధ మనదాకా వస్తేగానీ వాళ్ళు ఎంతగా బాధపడిందీ మనకు అర్థం కాదు. అవడానికి ఈ సినిమా ఇతివృత్తం గృహ హింసే అయినా ఇదిగో ఈ కాన్సప్టే అంతర్లీనంగా కనిపిస్తుంది. భర్త తనకు ఇచ్చిందంతా జయ అతనికి తిరిగిచ్చేస్తుంది (పెళ్ళి చూపులప్పుడు అతను మాట్లాడిన మాటలనే క్లైమాక్స్ లో అప్పచెప్పడంతో సహా). కానీ సమాజం ఈ ధోరణిని తట్టుకోలేకపోతుంది. పొగరుబోతు అని ముద్ర వేస్తుంది. అంతదాకా కోడలిపై సానుభూతి కురిపిస్తూ అపరాధ భావంతో కొడుకును సమర్థించుకుంటూ వచ్చిన అత్తగారు ఉన్నట్టుండి సూర్యకాంతంలా మారిపోతుంది. జయ తన కొడుకును రాచి రంపాన పెడుతున్నట్లు మాట్లాడుతుంది. జయ అమ్మానాన్న కూడా కూతురినే మందలిస్తారు. నచ్చినా నచ్చకపోయినా తను అత్తవారింట ఉండి తీరాల్సిందేనని తీర్మానించేస్తారు.

ఆడది అణచివేతను భరించినంత కాలం సమాజం సానుభూతి కురిపిస్తుంది. త్యాగాల ముళ్ళ కిరీటాలు తగిలిస్తుంది. అదే ఎదురుతిరిగితే రకరకాల ట్యాగ్స్ వేసి వెనక్కి లాగాలని చూస్తుంది. కుదరకపోతే సెంటిమెంటుతో కొడుతుంది. జయ విషయంలోనూ అదే జరిగింది. జయను తల్లిని చేస్తే చాలు కుక్కిన పేనులా పడి ఉంటుందని, చదువు, ఉద్యోగం మాటే ఎత్తదని రాజేశ్ అన్న సలహా ఇస్తాడు. ఈ అన్న, అలాగే జయ మేనమామ పితృస్వామ్య భావజాలం నుంచి పుట్టిన gender stereotypesని ఉద్ధరించడానికే అవతరించినట్లుగా కనిపిస్తారు. మన చుట్టుపక్కల ఇలాంటివాళ్ళు చాలా మందే ఉంటారు. కాస్తో కూస్తో ఆలోచించేవాళ్ళు కూడా వీళ్ళ వల్ల చెడిపోతుంటారు. ఇక ఇగోయిస్ట్ అయిన రాజేశ్ చెడిపోవడంలో ఆశ్చర్యమేముంది? అతను అన్న చెప్పినట్లే చేస్తాడు. కానీ అదృష్టమో దురదృష్టమో జయ ఆ ఉచ్చు నుంచి బయటపడుతుంది. తన కోసం తను నిలబడుతుంది. ఎందరికో దారి చూపిస్తుంది. ఇప్పుడు చెప్పండి ఈ సినిమాను కామెడీ సినిమా అని కొట్టిపారేయొచ్చా?