9.5 C
London
Wednesday, January 15, 2025
HomeAndhra PradeshAPpolitics : ఏపీలో కూటమిది గాలా?.... తుఫానా..?

APpolitics : ఏపీలో కూటమిది గాలా?…. తుఫానా..?

Date:

Related stories

literature: కులం అనే ఆలోచనకు ప్రేమే పరిష్కారం..!

విశి: కుట్టి రేవతి తమిళ కవయిత్రి & సినీ గీతరచయిత్రి. అసలు పేరు...

sankranti2025: 3 డీ టైప్స్ ముగ్గులు..ప్రత్యేకం..!

సాహితీ, ప్రసిద్ధ, మౌక్తిక: ...

literature: ఎరుకే జ్ఞానం నీవే దైవం..!

Teluguliterature: ఆ.వె : శిలను ప్రతిమ చేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మముండుట...

BJP: బిజెపి మునక మునుగోడుతో మొదలైందా..?

BJP: బీజేపీ మాతృక ‘భారతీయ జనసంఘ్’ కార్యవర్గ సమావేశం, నేటికి యాభైయేడు ఏళ్ల...

vaikuntaekadashi: వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత..!

Vaikunta ekadashi: హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేక సౌరమాన ప్రకారం...
spot_imgspot_img

APpolitics:

‘వీచింది గాలా? వచ్చింది తుఫానా?’ తనను కలిసిన ఆంధ్రప్రదేశ్‌ నాయకులతో ప్రధానమంత్రి, బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ ఆరా తీసిన తీరు ఇది! ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అనుకూలంగా గాలి వీచిందని… అది తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని వారు ఆయనకు చెప్పినట్టు తెలిసింది. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ‘‘గాలా..? తుఫానా..?’’ అని అడిగారంటే, ఆయనకు విశ్వసనీయ వ్యక్తులు, సంస్థల నుంచి ముందే అందిన సమాచారాన్ని సరిపోల్చుకోవడానికేనని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో రాజకీయ గాలీ ఎటువైపు వీస్తుందో అంచనా వేయడానికి పీపుల్స్‌ పల్స్‌ సంస్థ గత నాలుగేళ్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఫోకస్డ్‌ గ్రూప్‌ డిస్కషన్స్‌, వివిధ రకాల శాస్త్రీయ సర్వేలతో ప్రజల అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ, వాటిని వ్యాసాల రూపంలో ప్రచురిస్తూనే ఉంది. అధికార వైఎస్సార్సీపీ ఈ ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతుందనేది ఈ నాలుగేళ్ల స్టడీ సారాంశం!!


ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ ముఖచిత్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు గతంలో ఆయా పార్టీలకు మద్దతిచ్చిన సామాజికవర్గాలు, వివిధ ప్రజా సమూహాలు మళ్లీ ఆ పార్టీకే మద్దతు ఇస్తున్నాయా? లేక ప్రత్యర్థి శిబిరానికి మళ్లాయా? అని పరిశీలిస్తే రాజకీయ విశ్లేషణ చేయడం సులభమవుతుందని ప్రముఖ సెఫలజిస్ట్‌, సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్‌ యోగేంద్ర యాదవ్‌ అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. ఈ కోణంలో చూసినప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు, శాస్త్రీయ సర్వేల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం 2019లో వైఎస్సార్సీపీకి మద్దతిచ్చిన వర్గాల్లో ఇప్పుడు ‘మార్పు’ స్పష్టంగా కనపడుతోంది.


2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి రెడ్డి, దళితుల్లో మాలలు, ముస్లింలు, క్రిస్టియన్‌ సామాజికవర్గాలతో పాటు ఉద్యోగస్తులు సంపూర్ణ మద్దతిచ్చారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి వీరు 2019లోలాగా ఉత్సాహంగా పని చేయలేదు. ముఖ్యంగా దళితుల్లో విద్యావంతులు తమ నిధులు దారి మళ్లించారనే కోపంతో ఉన్నారు. ముస్లిం, క్రిస్టియన్‌ సామాజికవర్గాలకు నరేంద్రమోదీపై, బీజేపీపై కోపం ఉన్నా వైసీపీ కూడా లోపాయికారిగా పలు అంశాల్లో బీజేపీకి మద్దతివ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా మూకుమ్మడిగా ఆ సామాజికవర్గాలు వైఎస్సార్సీపీకి మద్దతివ్వలేదు. 2019లో ఆయనకు అండగా ఉన్న సమూహాలు, ఉద్యోగులతో పాటు సొంత తల్లి, చెల్లి కూడా ఈ సారి జగన్‌కి దూరమయ్యారు.
వైఎస్సార్సీపీపై వ్యతిరేకత ఏర్పడింద‌నేది ఈ రోజు చెప్తున్న విషయం కాదు. అది పెరుగతూ వచ్చిన క్రమం వివిధ సమయాలు-దశల్లో కనబడుతూనే ఉంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకే సాధారణంగా అధికార పార్టీపై వ్యతిరేకత మొద‌లైంది. కానీ జగన్‌ విషయంలో అలా కాదు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆలస్యమైనా జగన్‌ అమలు చేశారు. అయితే బటన్‌ నొక్కి ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడం తప్ప రాష్ర్టాభివృద్ధిని, ప్రజల ఆకాంక్షల్ని పట్టించుకోవడం లేదని జగన్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ప్రజల్లో అసంతృప్తి ప్రారంభమైంది. ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయమే ఇందుకు ఉదాహరణ. ఈ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ‘‘పట్టభద్రులు మా ఓటర్లు కాద’’ని వైఎస్‌ఆర్‌సీపీ చెప్పుకుంది. అప్పుడే జాగ్రత్త పడి ఉంటే వైఎస్సార్సీపికి ఈ గడ్డు పరిస్థితి వచ్చేది కాదేమో!


అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో, పార్టీ కార్యకర్తలతో జగన్‌కి ప్రత్యక్ష సంబంధాలు తెగిపోయాయి. అధికారం లేనప్పుడు ఓదార్పు యాత్ర, పాదయాత్ర అంటూ నిత్యం ప్రజల్లో ఉన్న నాయకుడు అధికారం రాగానే పూర్తిగా అధికార నివాసానికే పరిమితమయ్యారు. ఆఖరికి సొంత నియోజకవర్గం పులివెందులలో సైతం పరదాలు కట్టుకుని తిరగడాన్ని ప్రజలు హర్షించలేదు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న పార్టీ కార్యాలయానికి ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఒక్కసారి కూడా వెళ్లలేదు. పార్టీ అధినేతలు కనీసం తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడైనా పార్టీ కార్యాలయానికి వెళ్తారు. కానీ, జగన్‌ సీఎం అయ్యాక ఆ పనే చేయలేదు. మొక్కుబడిగా అట్టహాసంగా ప్లీనరిని నిర్వహించారు. కానీ, ఒక్కసారి కూడా పార్టీ విస్తృత‌ స్థాయి సమావేశం నిర్వహించలేదు. క్షేత్రస్థాయి నాయకుల ఫీడ్‌ బ్యాక్‌ తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. వన్‌ సైడ్‌ కమ్యూనికేషన్‌తో తమ అభిప్రాయాలను వారిపై రుద్దడం తప్ప పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు స్వీకరించడం ఆపేశారు.
పార్టీని, పార్టీ యంత్రాంగాన్ని నిర్లక్ష్యం చేసిన జగన్‌ వాలంటీర్ల మీద, ఐ ప్యాక్‌ సిబ్బంది మీద పూర్తిగా ఆధారపడి పార్టీని ఒక కార్పోరేట్‌ సంస్థలాగ నడిపారు. ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షుడి స్థాయిలో పార్టీ కార్యాలయానికి వెళ్లి నాయకులకు, కార్యకర్తలకు కృత‌జ్ఞతలు తెలపాలి. ఆయన ఇందుకు భిన్నంగా ఐ ప్యాక్‌ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందికి కృత‌జ్ఞతలు తెలిపారు. ఇవన్నీ గమనిస్తే కార్యకర్తలు పార్టీకి పునాదులనే మూలసూత్రాన్నే జగన్‌ మర్చిపోయినట్టున్నారనిపిస్తుంది ! దీని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఈ ఎన్నికల తర్వాత జగన్‌కి తెలిసొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


పీపుల్స్‌ పల్స్‌ బృందం రాష్ట్రంలో పర్యటిస్తూ, వైఎస్సార్సీపీ ప్రముఖుడొకరిని కలిసినప్పుడు ‘‘ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి?’’ అన్న ప్రస్తావన వచ్చింది. ‘‘ఈ సారి మేము చొక్కా నలక్కుండా ఎన్నికలు చేస్తాం’’ అన్నారు. దీన్ని బట్టి తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఏ నాయకుడూ, ఏ కార్యకర్తా మనస్ఫూర్తిగా పార్టీ కోసం పని చేయలేదని చెప్పడానికి ఇలాంటి ఉదంతాలు ఎన్నో మా బృందానికి క్షేత్ర స్థాయిలో కనిపించాయి. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గౌరవం లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఎస్సార్సీపీ పూర్తిగా విఫలమైంది.
అసలు 2019లో ప్రజలు అందించిన చారిత్రాత్మక విజయాన్ని అర్థం చేసుకోవడంలోనే వైఎస్సార్సీపీ నాయకత్వం విఫలమైంది. ‘‘ఒక్క చాన్స్‌ అడుగుతున్నాడు కాబట్టి అవకాశం ఇద్దాం. వైఎస్‌. రాజశేఖరరెడ్డి బాటలో నడిచి రాజన్న పరిపాలన అందిస్తాడు’’ అనే ఉద్దేశంతో ప్రజలు ఓట్లేశారు. అయితే వైఎస్‌ఆర్‌ బలం ఏంటో వైఎస్సార్సీపీ నాయకత్వానికి నేటికీ తెలిసి రాలేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండటం వైఎస్సార్‌ బలం. కక్ష సాధింపు చర్యలకు దూరంగా ఉంటూ సంక్షోభమైనా, సహాయమైనా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలబడటం ఆయన నైజం. వైఎస్సార్‌ తీరుకు 180 డిగ్రీలు వ్యతిరేక మార్గాన్ని అవలంభిస్తున్న జగన్‌ని చూశాక, ప్రజలకున్న భ్రమలన్నీ తొలగిపోయాయి.


కేసీఆర్‌ని తిడితే తెలంగాణను తిట్టినట్టుగా, జగన్‌ని తిడితే వైఎస్సార్‌ని తిట్టినట్టుగా లోగడ భావించినట్టుగానే ఇప్పుడు పవన్‌ని తిడితే తమనే తిట్టినట్టు కాపులు భావిస్తున్నారు. ఈ విషయంలో జగన్‌ తప్పటడుగులు వేశారు. జనసేనను పట్టించుకోకుండా వదిలిస్తే, వాళ్లు విడిగా పోటీ చేసేవాళ్లు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది వైఎస్సార్సీపీకి సానుకూలంగా మారేది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మొదటిసారి చేసిన ప్రకటనను వైస్సార్సీపీ తక్కువ అంచనా వేసింది. అతివిశ్వాసంతో వ్యవహరిస్తూ జనసేనకు, టీడీపీకి పొత్తు కుదరదని, కాపు`కమ్మ సామాజిక వర్గాలకు పడదనే అంచనాతో తనకు అనుకూలంగా గాల్లో మేడలు కట్టింది. ఈ అంచనాలను పటాపంచలు చేస్తూ పొత్తు కుదిరింది. కూటమి పక్షాల మధ్య సజావుగా ఓట్ల బదిలీ జరిగింది!
రాష్ట్ర రాజకీయాల్లో సెప్టెంబర్‌ 14, 2023 ఒక మలుపు. పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిశాక ‘‘మేం కలిసి పోటి చేస్తున్నాం’’ అని ప్రకటించారు. చంద్రబాబు అరెస్టుతో నిరాశలో ఉన్న టీడీపీకి ఊపిరి పోసినట్టయింది. జగన్‌ ప్రత్యామ్నాయంపై ప్రజలకొక కొత్త నమ్మకం కుదిరింది. వాస్తవానికి జనసేన, టీడీపీ కలిసి పని చేయడం స్థానిక సంస్థల ఎన్నికల నుంచే మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ బంధం బలపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసి, మొత్తం వైఎస్సార్సీపీ నాయకులే ఏకపక్షంగా సీట్లను కైవసం చేసుకోవడం వల్ల గ్రామ స్థాయిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద ఉన్న వ్యతిరేకత కూడా పాలకపక్షానికే తగిలింది. స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇవ్వాల్సిన నిధులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వారు అనేక సార్లు నిరసనలు చేసిన సందర్భాలు సైతం అధికార వైసీపీకి కీడే చేశాయి.
వైస్సార్సీపీ అభ్యర్థులను ఒక నియోజకర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్చడం ఇటు పార్టీ శ్రేణులే కాదు అటు ప్రజలు కూడా అంగీకరించలేకపోయారు. జగన్‌ తన ప్రచారంలో బాబాయ్‌ వివేకానంద రెడ్డి హత్య గురించి, చెల్లి బట్టల గురించి మాట్లాడటం ప్రజలకు నచ్చలేదు. చివరికి గులక రాయి అంశం కూడా రక్తి కట్టలేదు. ఇలా తప్పు మీద తప్పు చేయడమే కాకుండా… ఎన్నికలకు ఏడాది ముందు ‘వై నాట్‌ 175’ అన్నవాళ్లు, తీరా ఎన్నికల సమయంలో ఒక్కసారైనా ఆ నినాదాన్నే ఎత్తులేదు. దీన్ని బట్టే వాళ్లలో ఆత్మవిశ్వాసం ఎంత సడలిపోయిందో అంచనాకు రావొచ్చు. పందెం రాయిళ్లు కూడా కూటమిపైనే పందేలు కాయడం, ఎన్నికలు ముగిసినప్పటి నుంచి వైఎస్సార్సీపీ అగ్రనేతలు, కార్యకర్తల వ్యవహారశైలీలో మార్పు రావడాన్ని గమనిస్తే ఆ పార్టీ ఓడిపోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నట్టే!


ధరల పెరుగుదల, ఉపాధి లేకపోవడం, వలసలు ఉదృతి వంటి సమస్యలతో వైఎస్సార్సీపీపై ప్రజల్లో అసంతృప్తి ప్రారంభమైంది. ధరల పెరుగుదలలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పాక్షికమే అయినా సంక్షేమం ద్వారా లభించాల్సిన సానుకూలతను అది గండికొట్టింది. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారనే అభిప్రాయం ప్రజల్లో బలపడింది. బియ్యం, పప్పు, నూనె, పెట్రోల్‌ ధరలతోపాటు బస్‌ చార్జీలు, కరెంటు చార్జీల పెరుగుదలతో సంక్షేమ పథకాలు దిగదుడుపు అయ్యాయి. ఐదు సంవత్సరాలుగా బటన్‌ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నానని జగన్‌ చెప్పుకుంటున్నా….. పెరిగిన ధరలు, అభివఅద్ధిని పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ఒక్క బటన్‌ నొక్కి ప్రభుత్వాన్నే ఇంటికి పంపించే పరిస్థితి తెచ్చుకున్నారు.


టీడీపీ, బీజేపీ, జనసేన ప్రస్తుత పొత్తుల దృష్ట్యా, వాటికి 2019లో విడివిడిగా వచ్చిన ఓట్ల శాతం కలిపితే, దాదాపు 47 శాతానికి చేరుతుంది. ఇంకా, ఆ పార్టీలకు మద్దతు ఈసారి మరింత పెరిగింది. దీనికి తోడు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చారు. మరోవైపు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా వైఎస్సార్సీపీ ఓట్లు 43 శాతం దగ్గర ఆగిపోయే ఆస్కారం ఉంది. పీపుల్స్‌ పల్స్‌ సంస్థ గత నాలుగు సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో శాస్త్రీయంగా నిర్వహించిన వివిధ సర్వేలు, అధ్యయనాల ప్రకారం ప్రస్తుతం కూటమికి 115 నుంచి 130 సీట్లు, వైఎస్సార్సీపీకి 45 నుంచి 55 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అన్నట్లు జనసేనకు 80 శాతం స్ట్రయిక్‌ రేట్‌ ఉండొచ్చు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో దాదాపు 17 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. దీంతో పాటు రెండు పార్లమెంట్‌ సీట్లు కూడా గెలిచే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న సైలెంట్‌ వేవ్‌ని చూస్తే కూటమి సీట్లు మరింత పెరిగినా అశ్చర్యపోనక్కర్లేదు! ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం 6 నుంచి 8 శాతం ఉండొచ్చు.
రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవంటారు. ఏపీలో ఇది మరోసారి నిజం కాబోతోంది. దీనికి కారణం, వైఎస్సార్సీపీ అహంకార ధోరణితో వ్యవహరించడం తప్ప టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల కోసం పోరాడి, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడం వల్ల మాత్రం కాదు. జగన్‌ మీద కోపం వల్లే, ప్రజలు కూటమి వైపు చూశారు గానీ, ఇందులో ప్రత్యేకంగా కూటమి గొప్పదనం ఏమీ లేదు. జగన్‌ ఐ ప్యాక్‌ సిబ్బందితో మాట్లాడుతూ ‘‘ఈసారి నివ్వెరపోయే ఫలితాలు వస్తాయి’’ అని చెప్పారు. నిజమే. ఈసారి నివ్వరబోయే ఫలితాలే వస్తాయి. కాకపోతే, ఆ ఫలితాలు చూసి ఎవరు నివ్వెరపోతారు? అన్నదే ప్రశ్న!

==================

ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

Optimized by Optimole