Nancharaiah merugumala senior journalist:
” 12 ఏళ్లనాటి జగన్ అరెస్టును గుండెలు పిండేసేలా గుర్తుచేసినందుకు వేమూరి రాధాకృష్ణకు జేజేలు పలుకుతున్న వైసీపీ అభిమానులు.. ”
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్కర కాలం క్రితం 2012 మే 12న అరెస్టయ్యారనే విషయం సోమారం మధ్యాహ్నం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అనే తెలుగు టెలివిజన్ న్యూజ్ ఛానల్ గుర్తుచేసింది. పాత కతలు చాలా వరకు విసుగుపుట్టించే స్థాయిలో రాసే అలవాటున్న నాకు జగన్ ను సీబీఐ అరెస్టు చేసి ఇన్నేళ్ళయిందనే సంగతి అప్పటి దాకా గురుతుకే రాలేదు. మండు వేసవి రోహిణి కార్తెలో అది కూడా అవిభక్త ఆంధ్రప్రదేశ్లో జరిగిందనే వాస్తవం కూడా నాకు జ్ఞాపకం లేదు. ఒక పక్క తెలుగుదేశం పార్టీని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించే పని పెట్టుకుని కూడా మరో పక్క జగన్ ను పోలీసులు అరెస్టు చేసిన రాత్రి ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలమ్మ ఎలా రోడ్డు పక్కన కూర్చున్నదీ చక్కగా చూపించింది ఈ ఛానల్. ఈ తల్లీకూతుళ్లు ఇద్దరూ జగన్ అరెస్టుతో ఎంతగా బాధపడింది పాత విజువల్స్ ను ఎనక నుంచి ఒక యాంకర్ మాటలు లేదా వ్యాఖ్యలతో ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ చూపించిన తీరు వైఎస్సార్ కాంగ్రెస్ వీరాభిమానులకే గాక కృష్ణా గుంటూరు జిల్లాల టీడీపీ మద్దతుదారులకు కూడా కన్నీళ్లు తెప్పించింది. ఇలాంటి చారిత్రక సందర్భాలను గుర్తుచేయడంలో వయసులో తన కన్నా 20 సంవత్సరాలు చిన్నోడైన వేమూరి రాధాకృష్ణతో 87 ఏళ్ల చెరుకూరి రామోజీరావు గారు ఏమాత్రం పోటీపడలేరని కొవిడ్ లాక్ డౌన్ లో రిటైర్ అయిన మా తరం జర్నలిస్టులకు ఈ రోహిణిలో అర్థమైంది.