దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్:
‘ఇంతమంది మంచివాళ్లు …. ఒక చోట, ఒకే రోజు ఎలా కలిశారు?’ అని ఆశ్చర్యపోతూ అడిగారు ప్రొ.పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ (ఆదివారం) మమ్మల్ని అభినందిస్తూ! అది ఆయన మంచితనం. అయితే, అలా అని మేమేం మంచివాళ్లం కాదని కాదు సుమా! మేమంతా మంచోళ్లమే, మాదొక మేల్ కలయిక! ఆయన ప్రశ్నకు మా దగ్గర నిర్దుష్టంగా సమాధానం కూడా వుంది! అదేమంటే, రామోజీరావు గారి వల్ల అది సాధ్యమైంది. ప్రధాన స్రవంతి బడా పేపర్లు, జిల్లా అనుబంధాలంటూ పిల్ల పేపర్ల (టాబ్లాయిడ్) ను మార్కెట్లోకి తెచ్చిన మాయారోజులవి! సాంకేతికంగా ఎవరు ముందు తెచ్చారు? అనే విషయంలో తర్జన-భర్జన, మీమాంస, తర్కం, చర్చ…. లాంటివి చాలానే వున్నా, ప్రభావవంతంగా మొదట టాబ్లాయిడ్ తెచ్చింది మాత్రం ‘ఈనాడు’ దినపత్రిక. జనవరి 26, 1989 లో పిల్లపేపర్ బయటకు వచ్చింది. అప్పట్నుంచి ప్రాసెస్ చేస్తే…. ఏప్రిల్ 17, 1989 లో పది మంది పిల్ల జర్నలిస్టులు లోనికి వచ్చారు.
జిల్లా టాబ్లాయిడ్లతో ఒక్కపెట్టున పెక్కుమంది జర్నలిస్ట్ ల తక్షణ అవసరం వారికి ఏర్పడింది. దాని యజమాని రామోజీరావు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టారు. ఓ పేద్ద వడపోతలో మేమొక పది (10) మందిమి కడకు మిగిలాము. అందరమూ… 17.4.1989 న, అంటే, దాదాపు మూడున్నర దశాబ్దాల కిందట, ఈనాడు లో ‘ట్రైనీ జర్నలిస్ట్’లుగా చేరినం.
అలా మొదలైన జర్నలిస్టు జీవన ప్రయాణం బుడిబుడి నడకల నుంచి వడివడిగా, పరుగులుగా, పెను గాలిలా, తుఫానులా …. పలు రకాలుగా సాగింది, ఇంకా కొందరికి సాగుతూనే వుంది. కొంతమంది వేర్వేరు కాలాల్లో రూట్ మార్చి, వేరే వృత్తులు, ప్రవృత్తుల్లోకి మళ్లారు. జీవితపు విభిన్న పార్శ్వాలను తడుముతూ సాగుతున్న అనుభవం. మరి, అందరం కలుద్దాం ఓసారి అనుకున్న మాలో కొందరి ఆలోచన పర్యవసానమే…. రావిర్యాల లోని, ఓ మామిడి తోటలో ఇదుగో, మా ఈ భేటీ! ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ముందరి నుంచి మొదలై, మధ్యలో లంచ్ దంచి, సాయంత్రం స్నాక్స్-టీ కానిచ్చి ఇళ్లకు మళ్లాం. ఈ మధ్యలో ఎన్నో.. ఎన్నెన్నో… ముచ్చట్లు, ఇకఇకలు-పకపకలు.
మేమెవరా….? ఇదుగో..
బాలకిషన్ : పాలమూరి మేలి రత్నం. ఈనాడు తర్వాత వార్త, జీ-టీవీ, RK Tv తదితర మీడియాల్లో పని చేశారు. ఇప్పటికీ వివిధ పత్రికలకు తరచూ వ్యాసాలు రాస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తనను ఆధునికీకరించుకుంటూ, ఇష్టమైన పనుల్లో తలమునక’Love’తూ ఉంటారు. స్పురద్రూపి, స్నేహశీలి.
రావికంటి శ్రీనివాస్ : కరీంనగర్ కవి పుత్రుడు. చేరిన నుంచి నిరవధికంగా 34 సంవత్సరాలు ఈనాడు వేదిక నుంచే జర్నలిజాన్ని సేద్యం చేసి ఫలాలు జనాలకు పంచి, ఇటీవలే అక్కడ రిటైరయ్యారు. జాబ్ కు మాత్రమే అది వర్తిస్తుంది, తను మాత్రం ఇప్పటికీ పలు వ్యాసంగాల్లో క్రియాశీలమే!
యడవిల్లి రామస్వామి : గోదావరీ తీర సహృ’దయుడు’. ఈనాడులో పలు హోదాల్లో తన వృత్తి నిబద్దత-నైపుణ్యం చాటి… సరైన సమయంలో బయటపడ్డారు. విషయ జ్ఞానం వున్నవాడు. విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపకంలోకి దిగినా కొన్నాళ్లు Ntv కి పనిచేశారు. ప్రశాంత మనస్కుడు.
కె. హరీందర్ పిళ్లై : కేరళ మూలాలున్న తెలివరి కావడంతో కొందరం ‘మళయాల మాంత్రికుడు’ అనేవాళ్లం సరదాగా. ఈనాడు తర్వాత జీ-టీవీ, సాక్షి, Tv9 లలో పనిచేశారు. పరిశీలనా తత్వంతో అపార అనుభవం గడించిన a practical man అవడంతో మేము ఈతని సూచనలు-సలహాలకై చూసేది.
దిలీప్ రెడ్డి : అనే నేను…… శాసనము ద్వారా నిర్మితమైన ‘సమాచార హక్కు చట్టం-RTIA’ కమిషనర్ గా 5 ఏళ్లు పనిచేయడానికి ముందు, వెనక…. 35 ఏళ్లుగా జర్నలిజం (ఈనాడు, సాక్షి, వెలుగు, పొలిటికోస్ ) లోనే, రుచి ఇంకా ఆస్వాదిస్తూ వున్నా!
మెకం మహేశ్వర్ : హైదరాబాద్ పాతబస్తీ జంగంమెట్ గల్లీ నుంచి ఎదిగి వచ్చిన స్వయంకృషి రుషి! పలు డిగ్రీలతో జ్ఞాన వృద్ది చేసుకుంటూ… ఈనాడు నుంచి ఇండియన్ రైల్వేస్ మారాడు, ప్రస్తుతం NIN జాతీయ సంస్థలో సీనియర్ సైంటిస్ట్ గా సేవలందిస్తున్నాడు. సౌమ్యుడు, నిగర్వి.
చెన్ను వెంకట శివప్రసాద్ రావు : ఒకప్పుడు భూభాగం కలిసున్న ప్రకాశం-కర్నూలు సంయుక్త ప్రాంతం నుంచి ఎదిగి వచ్చిన సంస్కారి. ఈనాడు తర్వాత ఉదయం, వార్త లలో పనిచేశారు. కొన్నాళ్లు ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ చేసి, ప్రస్తుతం న్యాయవాద వృత్తిలో బిజీ అయిన, స్పందనా హృదయంగల సమాజజీవి!
సమ్మేళనానికి హాజరైన ఈ ఏడుగురమే కాకుండా..
ఇందిరా ప్రియదర్శిని : ఈనాడు తర్వాత ప్రభుత్వ సర్వీసులకు వెళ్లి, ప్రస్తుతం ఏపీ లో రాష్ట్రస్థాయి ఉద్యోగ హోదాలో వున్నారు. A cool, calm & matured mind. స్నేహశీలి.
కృష్ణప్రసాద్ : ఈనాడుతో మొదలెట్టి… తర్వాత ఇంగ్లీష్ (DC, Times, Pioneer) మీడియా వైపు సాగి, ప్రస్తుతం ‘స్వతంత్ర’ అని సొంత టీవీ చానల్ నడుపుకుంటున్న’ ప్రతిభావంతుడు’
టి. శ్రీనివాస రావు : ఆధునిక శాస్త్ర-సాంకేతికత ఎంత పెరిగినా… దానికీ కొన్ని పరిమితులున్నాయనే సత్యాన్ని దృవపరుస్తూ…… మేము ఈయన జాడ పట్టుకోలేకపోయాం. అందుకు చింతిస్తున్నాం. (ఈనాడులో చేరి, స్వల్పకాలానికే జర్నలిజం వృత్తి వదిలి వెళ్లినట్టయితే గుర్తుంది. తర్వాతి జాడ… లేదు.)
వీరు కూడా మాతో పాటే ఒకే రోజ్న ఈనాడులో చేరారు. వారు వ్యక్తిగత అనివార్య కారణాల వల్ల ఇవాళ్టి భేటీకి రాలేకపోయారు. వార్ని మేము, మమ్మల్ని వారు మిస్సయినట్టే!
మా సరదా భేటీకి విచ్చేసి, మమ్మల్ని ఆశీర్వదించిన ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొ. పురుషోత్తమ్ రెడ్డి గారికి, CGR నెలకొల్పి సమాజసేవలో మమేకమైన ఆదర్శ లీలా-లక్ష్మారెడ్డి దంపతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు.