Nancharaiah merugumala senior journalist:
‘గాంధీ’ సినిమాతో మోహన్ దాస్ గాంధీకి ‘అంతర్జాతీయ గుర్తింపు’ వచ్చిన మాట ఎంత వరకు నిజమోగాని–బాబాసాహబ్ అంబేడ్కర్ ఎంతటి గొప్ప నాయకుడో మండల్ వ్యతిరేక ఉద్యమం వల్లే బీసీలకు తెలిసింది!
ప్రధాని నరేంద్రమోదీ ఏబీపీ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్టు –మహాత్మా మోహన్ దాస్ గాంధీకి ‘ప్రపంచవ్యాప్త గుర్తింపు’ 1982లో ‘గాంధీ’ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన మాట ఎంత వరకు నిజమో గాంధీ ఇంటి పేరున్న రాహుల్ గాంధీకి బాగా తెలుసు. అయితే, భారత రాజ్యాంగ శిల్పి బాబాసాహబ్ డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ కు మాత్రం గాంధీకి ఉన్నంతగా అంతర్జాతీయ ఖ్యాతి 1980 నాటికే వచ్చేసింది (అంబేడ్కర్ పై సినిమాలు నిర్మించక ముందే). భారతదేశంలో బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో (మండల్ కమిషన్ సిఫార్సు మేరకు) 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 1990 చివర్లో నాటి ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వెనుకబడిన వర్గాలు లేదా కులాల జనానికి అంబేడ్కర్ వ్యక్తిత్వం, ఆయన జ్ఞానం, వివేకం ఎంతటి గొప్పవో తెలిశాయి. దేశంలో అగ్రవర్ణాలు లేదా అగ్రకులాల యువత మండల్ వ్యతిరేక ఉద్యమం ఆరు నెలలకు పైగా ఉధృతంగా, అత్యంత జుగుప్సాకరమైన రీతిలో నడిపిన కారణంగా హిందూ ఓబీసీలకు అంబేడ్కర్ విశిష్ఠ వ్యక్తిత్వం, ముందుచూపు, విజన్ అర్ధమయ్యాయి. అంబేడ్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఇకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎలెస్యీ) అనే యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో అంతర్భాగమైన గొప్ప విద్యాసంస్థలో చదువుకున్నాడనీ, ఇంకా ప్రపంచ ప్రఖ్యాత అమెరికా విశ్వవిద్యాలయం కొలంబియా యూనివర్సిటీ–న్యూయార్క్‌లోనే కులం, మతం, జాతి వంటి కీలకాంశాలపై ఆయన గొప్ప అవగాహనతో అధ్యయనం చేశారనే విషయాలు కూడా భారత ఓబీసీలకు 1990ల వరకూ తెలియకపోవడం కూడా ఎందరికో దిగ్భాంతి కలిగించే వాస్తవం.