Music: బిందుమాలిని – ఓ సంగీత దర్శకురాలి ప్రస్థానం..!

సాయి వంశీ ( విశీ) : 

2016లో తమిళంలో ‘అరువి’ అనే సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. టైటిల్ పాత్ర పోషించిన అదితి బాలన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. రజనీకాంత్ అంతటి నటుడు ఆమెకు ఫోన్ చేసి చాలా బాగా చేశావంటూ మెచ్చుకున్నారు. తమిళం తెలియనివారు సైతం ఆ సినిమా వెతుక్కుని మరీ చూశారు.

2018లో కన్నడలో ‘నాతిచరామి’ సినిమా విడుదలైంది. శ్రుతి హరిహరన్, సంచారి విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా గురించీ దక్షిణాదిన చాలా చర్చ జరిగింది. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అధిక అవార్డులు(5) అందుకున్న తొలి కన్నడ సినిమా ఇదే కావడం విశేషం.

ఈ రెండు సినిమాలకూ సంగీతం అందించింది ఒకే వ్యక్తి అన్న విషయం తెలుసా? అవును! ఆమె పేరు బిందుమాలిని నారాయణస్వామి. దక్షిణాదిన ఉన్న అతి తక్కువ మంది సంగీత దర్శకురాళ్లలో ఆమె ఒకరు. ఆమె పుట్టి పెరిగింది చెన్నై. ఆమెది సంగీతకారుల కుటుంబం. తల్లి విశాలాక్షి ఆకాశవాణిలో ‘ఏ’ గ్రేడ్ కర్ణాటక సంగీత విద్వాంసురాలు. అమ్మమ్మ సీతాదొరైస్వామి జల్‌తరంగ్(నీటి పాత్రలతో సంగీతం సృష్టించే ప్రక్రియ) విద్వాంసురాలు. అక్క జయామాధవన్ వరుసకు అక్క. అహ్మదాబాద్‌లోని National Institute of Design నుంచి Graphic Designingలో డిగ్రీ పొందిన బిందుమాలినికి చిన్ననాటి నుంచి హిందుస్థానీ సంగీతం మీద విపరీతమైన ఆసక్తి. 2007లో అహ్మదాబాద్‌లో ఉన్న సమయంలో 99 ఏళ్ల ఉస్తాద్ అబ్దుల్ రషీద్ ఖాన్ దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. అదే తన జీవితంలో మేలిమలుపు అంటారామె.

ఆ సమయంలో ఆమె వేదాంత్ భరద్వాజ్‌ని కలిశారు. వారిద్దరూ కలిసి సొంతంగా సంగీత ప్రదర్శనలు ఇవ్వాలని అనుకుంటున్న సమయంలో పండిత్ కుమార్ గంధర్వ పాడిన కబీర్ గీతాల క్యాసెట్ వారి చేతికొచ్చింది. అక్కడ నుంచి బిందుమాలినికి కబీర్ పాటలు ప్రపంచమయ్యాయి. కబీర్ పాటల్లో లోతైన తాత్వికత కనిపించిందని అంటారామె. అప్పట్నుంచి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత పురందరదాసు, అమీర్ ఖుస్రో, మీరా లాంటి వాళ్ల పాటలూ పాడటం మొదలు పెట్టారు. వేదాంత్ భరద్వాజ్‌‌తో కలిసి ‘సునో భాయ్’ పేరిట కబీర్ గీతాల ఆల్బమ్‌ని విడుదల చేశారు. అందులోని పాటలు విన్నాక 2016లో ‘అరువి’ సినిమాకు సంగీతం అందించే అవకాశం వచ్చింది. ఆ సినిమాకు వారిద్దరూ కలిసి సంగీతం అందించారు. ఆ సినిమాలో ప్రతి పాటలోనూ వినిపించే నేపథ్య గాయని బిందుమాలినీయే! ఆ పాటలన్నీ ఆమే పాడారు.

అనన్య కాసరవెల్లి దర్శకత్వంలో 2017లో వచ్చిన కన్నడ సినిమా ‘హరికథా ప్రసంగ’కు బిందుమాలిని సంగీతం అందించారు. 2018లో మంజునాథ సోమశేఖర రెడ్డి (Mansore) దర్శకత్వంలో కన్నడ సినిమా ‘నాతిచరామి’కి సంగీతం అందించారు. ఆ చిత్రంలోని ఐదు పాటలూ ఆమే పాడారు. ‘మాయావి మనవే’ అనే పాటకుగానూ జాతీయ ఉత్తమ నేపథ్య గాయని పురస్కారం అందుకున్నారు. కన్నడ సినిమా రంగంలో ఈ అవార్డు అందుకున్న తొలి గాయని ఆమే కావడం విశేషం. అదే పాటకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నారు. 2022లో తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ కథ ఆధారంగా తెరకెక్కిన ‘సేతుమాన్’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఆ చిత్రానికి పా.రంజిత్ నిర్మాతగా వ్యవహరించారు.

ఇళయరాజా, ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అమితంగా ఇష్టపడే బిందుమాలిని మరిన్ని చిత్రాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆమె భర్త వాసు దీక్షిత్ గాయకుడు. స్వరాత్మ అనే Folk-Fusion Band నిర్వహిస్తున్నారు.