విజయవాడ: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఎనిమిదిన్నరేళ్లుగా టిడిపి, వైసీపీ ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ లను ఓటు బ్యాంకు గా వాడుకొని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలు..మైనార్టీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పధకాలన్నీ వర్తింపచేయాలని రుద్రరాజు డిమాండ్ చేశారు.
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పక్షాన యాక్షన్ ప్లాన్ త్వరలోనే అమలు చేయబోతున్నట్లు రుద్రరాజు వెల్లడించారు.జనవరి 26 నుంచి మార్చి 26 వరకు అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చార్జ్ షీట్ నమోదు చేస్తామన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యంలో సభలు నిర్వహించుకోవడం హక్కని.. ప్రభుత్వాలకు పాలించే హక్కు ఎలా ఉంటుందో.. ప్రతిపక్షాల కు వాయిస్ వినిపించుకునే హక్కు అలా ఉంటుందన్నారు. ఎక్కడో రెండు చోట్ల ఘటనలు జరిగాయని.. హక్కులను కాలరాయాలని చూడడం సిగ్గుచేటని రుద్రరాజు ఆగ్రహాం వ్యక్తం చేశారు.