Headlines

రామ దీక్ష చేపట్టనున్న బండి సంజయ్‌ కుమార్‌?

BJPTELANGANA:
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపి బండి సంజయ్‌ కుమార్‌ రామ దీక్ష చేపట్టనున్నారు. అయోధ్య రామ మందిరం ట్రస్ట్‌, విశ్వహిందూ పరిషత్‌ హిందూధార్మిక సంఘాలు ఇచ్చిన సలహా మేరకు బండి సంజయ్‌ దీక్ష చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు కాషాయం పార్టీలో చర్చ జరుగుతోంది. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో పార్టీ ముఖ్య నేతలు కూడా బండి సంజయ్‌తోపాటు రామ దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే దీక్షకు సంబంధించిన సన్నాహాలు సైతం పూర్తయినట్లు సమాచారం.


జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా జనవరి 1 నుంచి 7వ తేదీ వరకు ప్రతి ఇంటికి రామ మందిర చిత్రం, ఆహ్వాన పత్రం, అక్షింతల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని రామ మందిరం కమిటీ పిలుపునిచ్చింది. బండి సంజయ్‌ రామ మందిర నిర్మాణం ఉద్యమంలో భాగంగా గతంలో అయోధ్యలో నిర్వహించిన కరసేవలో పాల్గొన్నారు. చిరకాల కల నెరవేరుతుండటంతో రామ భక్తితో సంకల్ప దీక్ష చేపట్టేందుకు బండి సంజయ్‌ సిద్దమవుతున్నారు.

అయోధ్యలో రామాలయం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కరీంనగర్‌ జిల్లాలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమం చేపట్టాలని, ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

Optimized by Optimole