పంజాబ్ పీఠం పై కమలనాధుల గురి!

పంజాబ్ పీఠం పై కమలనాధుల గురి!

పంజాబ్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈనేపథ్యంలో పంజాబ్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆపార్టీ ట్రబుల్‌ షూటర్‌ అమిత్​షా ట్రయాంగిల్​ స్కెచ్ వేశారు. కాంగ్రెస్‌ను వీడి వేరు కుంపటి పెట్టిన మాజీ సీఎం అమరిందర్‌సింగ్‌, శిరోమణి అకాలీదళ్‌తో పొత్తుకు తాము సిద్ధమని ప్రకటించారు. కూటమి ఏర్పాటు కోసం ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన కీలక నేతలతో కమలనాథులు చర్చించినట్లు తెలిసింది. ఈపరిణామం ప్రతిపక్ష పార్టీలు పెద్ద దెబ్బగా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక పంజాబ్‌ల కూటమి విషయంపై.. హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో పాల్గొన్న అమిత్ షా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తులకి సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. తాము కెప్టెన్ సాబ్ అమరిందర్ సింగ్, దిండ్సా సాబ్‌తో ఎన్నికల్లో పొత్తులపై చర్చలు జరుపుతున్నట్లు చెప్పకనే చెప్పారు.
కాగా పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్​ఎన్నికలపై రైతుల ఆందోళనలు ప్రభావం చూపిస్తాయనే వాదనలను అమిత్‌ షా తోసిపుచ్చారు. యూపీలో మంచి మెజారిటీతో బీజేపీ మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేయడం చూస్తుంటే కమలనాథుల విజయం ఖాయంగా కనిపిస్తోంది.
అటు బీజేపీ కూటమిలోని పలు పార్టీలు సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై అమిత్ షా తనదైన శైలిలో స్పందించారు. ఓట్ల లెక్కలతో పొత్తులు కుదుర్చుకోవటం ఎన్నికలను అంచనా వేసేందుకు సరైనమార్గం కాదన్నారు. గతంలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్​చేతులు కలిపినా.. బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఆర్టికల్​370 రద్దుతో జమ్ముకశ్మీర్‌లో శాంతి, అభివృద్ధి నెలకొందన్న అమిత్ షా.. ఓటు బ్యాంకు ఆధారంగా ఏర్పడే కూటములు ప్రజలకు దిశానిర్దేశం చేయవని ఆరోపించారు. మొత్తానికి పంజాబ్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది.