ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్!

ప్రపంచం థర్డ్‌ వేవ్‌ అంచున ఉందా..? మళ్లీ మరో ముప్పు తప్పదా అంటే… అవుననే సంకేతాలే వస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌… ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్… దడపుట్టిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కేసులు నమోదు కావడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా సౌత్‌ ఆఫ్రీకా నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు వెళ్లిన విమానంలో 61 మందికి ఈ కొత్త వేరియంట్‌ నిర్ధారణ కావడంతో… విదేశీ ప్రయాణికులపై అన్ని దేశాలు ప్రత్యేక నిఘా పెడుతున్నాయి.

కాగా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బి.1.1.529 వేరియంట్ అని కూడా పిలుస్తున్నారు. సౌతాఫ్రికా పొరుగుదేశం బోట్స్‌వానాలోనూ ఈ మహమ్మారి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆసియాతో పాటు యూరప్‌కు కూడా ఈ వేరియంట్ విస్తరించింది. హంకాంగ్‌లో ఒక కేసుతో పాటు బెల్జియంలోనూ ఈ వేరియంట్‌ను గుర్తించారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి కూడా సోకుతుండడంతో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇక ఒమిక్రాన్‌ వ్యాప్తితో ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమవుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. సౌతాఫ్రికా సహా దాని పొరుగుదేశాల నుంచి వచ్చే విమానాలను రద్దు చేస్తున్నాయి. సౌతాఫ్రికా నుంచి విమానాలను రద్దు చేసిన దేశాల జాబితాలో యునైటెడ్ స్టేట్స్, యూకే, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, సింగపూర్‌,ఇజ్రాయిల్‌, ఆస్ట్రేలియా ఉన్నాయి. థాయ్‌లాండ్‌ కూడా దక్షిణ ఆఫ్రికా 8 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది. న్యూయార్క్‌లో కోవిడ్‌ ఎమర్జెన్సి ప్రకటించారు. పారిస్‌లో బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి చేశారు. హలెండ్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు విధించారు.

అటు ఒమిక్రాన్‌ వేరియంట్‌ అత్యంత ప్రమాదకరమని ప్రకటించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌. కొత్త వేరియంట్‌కు వేగంగా వ్యాపించే లక్షణాలున్నాయని ప్రకటించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించింది. దాదాపు 50 రకాలుగా మ్యూటేషన్‌ చెందుతుందని..స్పైక్‌ ప్రోటిన్‌లో దాదాపు 30కి పైగా మ్యూటేషన్లు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. డెల్టా వేరియంట్‌తో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు అని చెప్తున్నారు. మరోవైపు ఆగ్నేయాసియా దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది WHO. నిఘా పెంచాలని, వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేయాలని సూచించింది.