కరీంనగర్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గత నెలరోజులుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వంలో చలనంలేదని మండిపడ్డారు. వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం రేవంత్ స్పందిచకపోవడం విడ్డురంగా ఉందన్నారు. తక్షణమే ఘటనలపై విచారణకు కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు గురుకుల పాఠశాలల్లో పర్యటించి విద్యార్థులకు భరోస కల్పించాల్సిన అవసరం ఉందని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడంపై ప్రవీణ్ కుమార్ వ్యగ్యంస్త్రాలు సంధించారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావొస్తున్నా విద్యాశాఖమంత్రి లేకపోవడం కాంగ్రెస్ పాలన అసమర్ధతకు అద్దంపడుతుందని నిప్పులు చెరిగారు. విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా అని నిలదీశారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని విద్యాశాఖమంత్రిని నియమిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు.