SuryaPeta: ప్రభుత్వ పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట మండలం ఇమాంపేట (KGVB) కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో తరగతి గదుల నిర్వహణ, తాగునీటి సౌకర్యం,విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత గురించి సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. విద్యార్దినిలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు, ఉపాధ్యాయులకు రమేష్ రెడ్డి వివరించారు.
విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలని. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ అభివృద్ధి బాటలో పయనింప చేస్తుందని రమేష్ రెడ్డి అన్నారు. ఇమాంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGVB), తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను దత్తత తీసుకొని కొద్ది రోజుల క్రితం రూ. 10 లక్షల విలువ చేసే పరుపులను పంపిణీ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని సమాజం అభివృద్ధి చెందితే దేశం బాగుంటుందన్నారు.పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
KGVB బాలికల పాఠశాలకు స్ప్రెడ్ ఇండియా,సువేన్ ఫార్మాసిటికల్ గ్రూప్స్.. యువ అన్ స్టాపబుల్ ఆర్గనైజేషన్ వారి ఆర్థిక సహకారంతో రూ॥ 7 లక్షలతో ప్రహరీ గోడ,ఆటస్థలం,ఆట వస్తువులు,కాంపౌండ్ వాల్ గేట్,పాఠశాల లైటింగ్ బోర్డు మొదలగు పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా అదనపు తరగతి గదుల నిర్మాణం కొరకు ఎస్టిమేషన్ వేయించడం జరిగిందని.. సుమారు కోటి 20 లక్షల రూపాయలు సంబంధిత శాఖ ద్వారా మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటిస్తూ రమేష్ రెడ్డి భోజనం చేశారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహ ఆకస్మిక తనిఖీలో రమేష్ రెడ్డితో పాటు విద్యా కమీషన్ మెంబర్ చారకొండ వెంకటేష్, DEO అశోక్, ఉన్నతాధికారులతో పాటు తదితరులు ఉన్నారు.