BJP : ‘ మానసిక యుద్ధం’ తోనే బీజేపీ లక్ష్యం సాధ్యం..!

BJP: రాజకీయ యుద్ధంలో పట్టు సాధించాలంటే ప్రత్యర్థులను మానసికంగా బలహీనపర్చాలి… వైరి వర్గంలో విభేదాలు సృష్టించాలి… అని రాజనీతిజ్ఞుడు చాణక్యుడు చెబుతారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇవే సూత్రాలను అనుసరిస్తోంది. సొంతంగా 370కు పైగా, ఎన్‌డీఏ కూటమి 400కు పైగా స్థానాలు సాధిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వారు చెబుతున్నట్టు ఇన్ని స్థానాలు సాధించడం సాధ్యమా అని అధ్యయనం చేస్తే ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బెతీయడమే బీజేపీ లక్ష్యంగా కనబడుతోంది.

ఆర్టికల్‌ 370 రద్దును విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన బీజేపీ అదే 370 సంఖ్యను ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. దేశం వెలిగిపోతుందని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ముందంజలో ఉందని ఆ పార్టీ పాజిటివ్‌ ప్రచారం చేసుకుంటోంది. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని ఆ పార్టీ ఇప్పటివరకు ఆరు విడతలుగా ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల జాబితానే తేటతెల్లం చేస్తోంది. ఈ జాబితాలలో 405 మంది అభ్యర్థులను ప్రకటించగా, ఇందులో 209 సిట్టింగ్‌ ఎంపీలలో 103 మందికి వివిధ కారణాలతో తిరిగి టికెట్లు ఇవ్వలేదు. అంటే 34 శాతం మందికి మొండిచేయి చూపింది. మరోవైపు 2019లో లక్ష నుండి ఆరు లక్షల వరకు మెజార్టీ సాధించిన 39 మందిని పోటీకి దూరం చేసింది. ఇప్పటికే బలమైన రాష్ట్రాల్లో లక్ష్యసాధన పూర్తి చేసుకున్న బీజేపీ తన టార్గెట్‌ను విజయవంతంగా పూర్తిచేయాలంటే బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించాలి. 

బీజేపీ ప్రచారం చేస్తున్నట్టు ఆ పార్టీకి దేశవ్యాప్తంగా సానుకూల పరిస్థితులే ఉంటే వంద మందికిపైగా టికెట్లను ఎందుకు నిరాకరించింది..? ప్రభుత్వ వ్యతిరేకతను అభ్యర్థుల వ్యతిరేకతగా మార్చివేసిందా…? నిజంగా అభ్యర్థులపై వ్యతిరేకతనే సాకుగా చూపితే అంత భారీగా మార్పులుంటాయా..? అయోధ్య రామాలయం నిర్మాణం, కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, త్రిబుల్‌ తలాక్‌, సీఏఏ చట్టం వంటి భావోద్వేగ అంశాలు  కొంత వరకు ప్రయోజనాలు చేకూరుస్తున్నా నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల వంటి అంశాలు ప్రతికూలంగా  ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మంగా అభ్యర్థుల మార్పులు చేస్తోంది. 2019 ఎన్నికల్లో కూడా 282 సిట్టింగ్‌ ఎంపీలలో 119 అభ్యర్థులను  అంటే 42 శాతం మందిని మార్చి విజయవంతం అయ్యింది. మళ్లీ ఇప్పుడు అదే ప్రయోగాన్ని చేస్తోంది.

దేశంలోని ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో సున్నితమైన అంశాలు బీజేపీకి  మేలు చేకూరుస్తున్నా, దక్షిణాది రాష్ట్రాల్లో అజెండా ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్షిణాదిలో కీలకంగా మారనున్నాయి. ఉత్తరాదితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ, తమిళనాడులో డీఎంకే, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు బీజేపీకి  సవాలు విసురుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కంటే దక్షిణాది రాష్ట్రాల్లో  రైతులకు  పథకాలు, మహిళలకు, వృద్దులకు పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, ఉచిత విద్యుత్‌, గ్యాస్‌ పథకాలతో ప్రజలు భారీగా ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ‘డబుల్‌ ఇంజిన్‌’  నినాదం కంటే ప్రభుత్వ పథకాలు అమలు ప్రధానంగా పేదలకు, మధ్య తరగతి కుటుంబాలకు చేరువయ్యాయి. 

బీజేపీ 2019 ఎన్నికల్లో  సొంతంగా 303, ఎన్‌డీఏ కూటమిగా 353 స్థానాలతో గరిష్ట ఫలితాలను సాధించిందని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్‌ (64 స్థానాలు), బీహార్‌ (39), గుజరాత్‌ (26), రాజస్థాన్‌ (25), హర్యానా (10), ఢిల్లీ (7), ఉత్తరాఖండ్‌ (5), హిమాచల్‌ప్రదేశ్‌ (4), మధ్యప్రదేశ్‌ (28), జార్ఖండ్‌ (12), అస్సాం (9), మహారాష్ట్ర (41), ఛత్తీస్‌గఢ్‌,  కర్ణాటక (26) రాష్ట్రాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందింది. పశ్చిమబెంగాల్‌ (18), ఒడిస్సా (8) రాష్ట్రాల్లో కూడా మెరుగైన స్థానాల్లో గెలిచింది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ గరిష్ట ఫలితాలను సాధించడంతో తన లక్ష్య సాధనకు ఇతర ప్రాంతాలలో ప్రధానంగా దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

 

దక్షిణాది 2019లో ఆశించిన ఫలితాలు పొందలేకపోయిన బీజేపీ 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలకు వ్యూహాలను రచిస్తోంది. కర్ణాటకలో గత ఎన్నికల్లో 25 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి జేడీ(ఎస్‌)తో జతకట్టింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అనేక ప్రజాకర్షణ పథకాలతో అధిక స్థానాలు గెలవడానికి ప్రయత్నిస్తుండగా మోదీ చరిష్మాతోపాటు జేడీ(ఎస్‌) కూడా జతకట్టడంతో అన్ని సీట్లు గెలవాలని బీజేపీ చూస్తోంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ గతానికి భిన్నంగా బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. 

గత ఎన్నికల్లో దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే బీజేపీ (4) సీట్లు సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ నుండి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండడంతో పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది. ఈ పరిణామాలతో రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్‌ బీజేపీ మధ్యనే ఉండే అవకాశాలున్నాయి. మోదీ చరిష్మాతో 2024లో పది సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలపై ఆశలు పెట్టుకుంది. కవిత అరెస్టు తమకు అనుకూలిస్తుందని బీజేపీ భావిస్తుంటే, బీఆర్‌ఎస్‌ నిర్ణయాలపై చేపట్టిన విచారణలు తమకు అనుకూలిస్తాయని కాంగ్రెస్‌ భావిస్తోంది. తన ప్రభుత్వానికి లోక్‌సభ ఎన్నికలు రిఫరెండం అని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలను సవాలుగా తీసుకున్నారు.

తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఈ రాష్ట్రాల్లో వీలైనన్ని అధిక స్థానాలు పొందడానికి ప్రయత్నిస్తోంది. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. రాష్ట్రంలో సంస్థాగతంగా బలహీనంగా ఉన్న విషయాన్ని గమనించి బీజేపీ అధిష్టానం టీడీపీ`జనసేనతో పెట్టుకొని ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తు పుణ్యమా వీటిలో సగం సీట్లు సాధించినా ఆ పార్టీకి బోనసే. 

 తమిళనాడులో గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో జతకట్టిన బీజేపీ ఇప్పుడు అన్నామలై నేతృత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటుంది. అన్నామలై పాదయాత్రకు, మోదీ ర్యాలీలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతుండంతో బీజేపీ రాష్ట్రంపై గంపెడాశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో 3.6 శాతం ఓట్లనే సాధించిన బీజేపీ ఈసారి ఎవరూ ఊహించని విధంగా సీట్లు సాధిస్తామనే దీమాతో ఉంది.  ద్రావిడ రాష్ట్రంలో సంప్రదాయక పార్టీగా పేరు పొందిన బీజేపీ ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

సగం మైనార్టీల జనాభా ఉన్న కేరళలో పాగా కోసం బీజేపీ కొన్ని సంవత్సరాలుగా విఫలయత్నం చేస్తోంది.  సంప్రదాయంగా ఇక్కడ కాంగ్రెస్‌, వామపక్షాల పట్టే కొనసాగుతోంది. ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్‌తో పాటు కీలక పాత్ర పోషిస్తున్న కమ్యూనిస్టులు రాష్ట్రంలో మాత్రం పరస్పరం తలపడుతున్నారు. ఇక్కడ ప్రత్యర్థులైన ఈ రెండు పార్టీలు ఢిల్లీలో దోస్తానా చేస్తున్నాయంటూ మోదీ కేరళలో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ 2019 ఎన్నికల్లో 13 శాతం ఓట్లు సాధించినా ఒక్క సీటు కూడా రాలేదు. ఓట్ల శాతాన్ని సీట్లుగా మల్చుకోలేకపోతున్న బీజేపీ ఈ సారి ఆర్‌ఎస్‌ఎస్‌ సహకారంతో కేరళలో కూడా మెరుగైన ఫలితాలను సాధిస్తామనే విశ్వాసంతో ఉండగా, ముస్లిం, క్రిస్టియన్లు నిర్ణయాత్మకంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ విజయవంతం కావడం సులభం కాదు.

 ఇప్పటికే బలంగా ఉన్న రాష్ట్రాల్లో లక్ష్యసాధన పూర్తి చేసుకున్న బీజేపీ తన టార్గెట్‌ను విజయవంతంగా పూర్తిచేయాలంటే బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధిస్తేనే సాధ్యం. హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన బీజేపీ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది. 370 స్థానాలు టార్గెట్‌ అంటూ ప్రచారం చేస్తున్న బీజేపీ 272 మ్యాజిక్‌ ఫిగర్‌ను సులభంగా అధిగమించి అధికారంలోకి రావడం ఖాయమనే వాతావరణాన్ని సృష్టించి ప్రత్యర్థి పార్టీలను ప్రధానంగా కాంగ్రెస్‌ను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది.

================

– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,