Vijayawada: ‘నాకు జీవితంలో నిలబడే ధైర్యం ఇచ్చింది పుస్తకాలే. నిరాశలో ఉన్నపుడు దారి చూపింది పుస్తకాలే. 2047కు వికసిత భారత్ గా వేగంగా అడుగులు వేస్తున్న వేళ విజ్ఞానకాంతులు నిండే సమూహం అవసరం. అందుకు పుస్తకాలు దారి చూపుతాయ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అన్నారు. రేపటి యువత సాహితీ సంపదను కాపాడేలా తయారు కావాలన్నారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఓ వినూత్నమైన సాహితీయాత్రను మొదలుపెట్టబోతోందని చెప్పారు. తెలుగుభాషకు వన్నెతెచ్చిన గొప్ప సాహితీ మేధావులు, రచయితల గృహాలను, వారు నడయాడిన నేలను భవిష్యత్తు తరాలవారు అక్షర ఆలయాలుగా దర్శించేలా, అక్కడ భాషా పరిశోధన జరిగేలా ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా మైదాన్ లో నిర్వహిస్తున్న 35వ పుస్తక ప్రదర్శన మహోత్సవాన్ని గురువారం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం ఈనాడు పత్రిక మాజీ సంపాదకులు, దివంగత శ్రీ చెరుకూరి రామోజీరావు స్మారక వేదికపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘‘నాకు చిన్ననాటి నుంచే పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. 5వ తరగతి నుంచి పాఠ్యపుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలను చదివే వాడిని. నెల్లూరులో 7వ తరగతిలో ఉన్నపుడే భవానీ బుక్ సెంటర్ యజమాని రమేశ్ గారితో స్నేహం ఏర్పడి అక్కడే కూర్చొని పుస్తకాలు చదివేవాడిని. నా దగ్గరున్న కోటి రూపాయాలు ఇవ్వమన్నా ఇచ్చేస్తా కానీ.. ఒక్క పుస్తకం ఇవ్వడానికి మాత్రం చాలా సంకోచిస్తాను. కర్ణుడికి కవచ కుండలాలు ఎలాగో నాకు పుస్తకాలు అలాగే ఉండాలనిపిస్తాయి. కావాలంటే అడిగిన పుస్తకాన్ని కొని ఇస్తాను అని చెబుతాను కానీ.. నా దగ్గర ఉన్న పుస్తకం మాత్రం ఇవ్వడానికి ఇష్టపడను. నాకు పుస్తకమంటే అంతటి మమకారం. పుస్తకాలే నా వెంట లేకపోతే ఈ రోజున ఏమైపోయేవాడినో అనిపిస్తుంటుంది.
ఇంటర్ తో చదువు ఆపేసినా పఠనం ఆగలేదు
నాకు రవీంధ్రనాథ్ ఠాగూర్ ఓ స్ఫూర్తి.. ఆయన కూడా చదువు తక్కువే చదివినా ఎన్నో కావ్యాలు రాశారు. క్లాస్ రూం పుస్తకాలు చదవకున్నా, పఠనం మాత్రం నేను ఎప్పుడూ ఆపలేదని పవన్ అన్నారు. ఇంటర్ తో చదువు ఆపేసినా కూడా ప్రకృతి ప్రేమికుడిగా మారి నాకేం కావాలో తెలుసుకొని దాన్ని చదవడం ద్వారా జ్ఞానం పెంచుకున్నాను.. స్వతంత్రంగా నాకు ఏం కావాలో నేర్చుకోగలను అనే ధైర్యం వచ్చినపుడు నేను పఠనం మీద దృష్టి నిలిపి నాకు ప్రత్యేకంగా టీచర్ అవసరం లేదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఓటమిలోనూ అద్భుతమైన మానసిక శక్తిని పుస్తకాలే అందించాయని డిప్యూటీ సిఎం చెప్పుకొచ్చారు.
రైతుకు మట్టి సువాసనలా.. సాహితీప్రియుడికి పుస్తక సువాసన..
సినిమాలు విజయవంతం అయితే దాన్ని పెద్దగా పట్టించుకోను. కాని ఓ అద్భుతమైన పుస్తకం తర్వాత వచ్చే అనుభూతి నాకు గొప్పగా ఉంటుందన్నారు డిప్యూటీ సిఎం. అమృతం కురిసిన రాత్రి, విశ్వదర్శనం వంటి పుస్తకాలు మద్రాసులో చదవడం మొదలుపెట్టినపుడు ఓ రకమైన అద్భుతమైన అనుభూతిపొందేవాడిని.. కొత్త పుస్తకాలు తెచ్చుకొని వాటి సువాసన చూస్తుంటే… పొడిబారిన నేలలో కొత్త చినుకులు వచ్చి రాలితే వచ్చే సువాసన ఎలా ఉంటుందో అలా అనిపిస్తుందని స్పష్టం చేశారు. పుస్తకం చదివితే జీవితంలో ఎంత కష్టపడాలో అవగతం అవుతుందని.. తెలుగులో అద్భుతమైన సాహిత్యం ఉందని గుర్తు చేశారు. చదువుతూ వెళ్తూ ఉంటే మనసు తలుపులు తెరుచుకుంటాయని పవన్ వివరించారు.
సోషల్ మీడియా కాదు.. పుస్తకం పట్టండి..
నేటి తరం ఫేస్ బుక్, ట్విట్టర్ లోనే అధిక సమయం గడుపుతున్నట్లు పవన్ హెచ్చరించారు. సోషల్ మీడియాను వదిలి.. మానసికంగా మనల్ని బలవంతులు చేసే పుస్తకాలను ఎంచుకొని చదవండని.. దీనివల్ల మీరు మానసికంగా బలంగా మారుతారు. సమస్యలను, కష్టాలను, మనుషులను అర్ధం చేసుకునే తత్వం బోధపడుతుందని హితువు పలికారు. సోషల్ మీడియాలో గంటలకు గంటలు గడిపేకంటే పోరాటం చేసే శక్తిని నింపే పుస్తకాలను ఆయుధంగా చేసుకుని జీవితంలో గెలవాలని ఆకాంక్షించారు. తాను విపత్కర సమయంలో ఉన్నపుడు శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ వాక్యాలే తూటాలయ్యాయని.. శ్రీ బాలగంగాధర్ తిలక్ మాటలే శరములయ్యాయని గుర్తు చేసుకున్నారు.
ఓ గొప్ప రచయిత మన వెంట లేకున్నా ఆయన స్ఫూర్తి నింపిన అక్షరాలు మనల్ని తట్టి లేపుతాయని పవన్ పేర్కొన్నారు.