literature: నిర్ణయించడానికి నీవెవరు..?

literature: నిర్ణయించడానికి నీవెవరు..?

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్):

పుస్తకాలు… సమాచార సమాహారమో, భావాల పల్లకీలో, ఆలోచనల మేళవింపో, కాల్పనిక సృజనో, ఆత్మకథో, కథో, కాకరకాయో…. ఏదో ఒకటి. అందులో నచ్చినవుంటాయ్, కొన్ని నచ్చనివీ ఉంటాయ్! ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చాలనీ లేదు. మనుషులు, వారి ఆసక్తి, ఆలోచన, భావజాలాన్ని బట్టి ఉంటుందదంతా! రాసి అమ్మే, కొని చదివే జనం అవసరం, అభిరుచి, ఆసక్తిని బట్టి రకరకాల పుస్తకాలు పుడతాయి, మార్కెట్లోకొస్తాయి. ఇష్టమైనవి కొంటాం. ఇష్టం లేనివి… చూసో, తిరగేశో, ఇతరత్రా తెలుసుకొనో వదిలేస్తాం. అది తేల్చుకునే వెసలుబాటు కోసమే పుస్తక ప్రదర్శనలు, డెమానిస్ట్రేషన్లు, వగైరా, వగైరాలు. షాప్ లో ఇదెందుకు పెట్టారు? జనానికి అదెందుకు అమ్ముతున్నారు? అని ఎవరైనా నిర్వహకులను ప్రశ్నించడం తప్పు. వాదనకు దిగడం దురహంకారం. దుష్ప్రచారానికి తలపడటం ఒకరకమైన దౌర్జన్యమే! సభ్య సమాజంలో ఆ హక్కు ఎవరికీ లేదు.

వాక్స్వాతంత్ర్యము, భావప్రకటనా స్వేచ్ఛ లాంటి బరువైన పదాలు వాడనవసరం లేకుండానే అవగాహన ఉండాల్సిన కనీస జ్ఞానమిది. ఒక పుస్తకంలో అభ్యంతరకరమైన విషయం (కంటెంట్) ఉందనిపిస్తే…. దాన్ని నిరోధించడానికి, పరిహరించడానికి చట్ట/రాజ్యాంగ పరమైన పలు మార్గాలున్నాయి. ఆ దారుల్లో రాకుండా నేరుగా ప్రశ్నించడం, నిలదీయడం, ఇబ్బంది పెట్టడం…. అంటే, రెండు విషయాలున్నాయి. ఒకటి ః చట్ట/రాజ్యంగ పరమైన పద్దతుల్లో సదరు కంటెంట్ ను పరిహరించడమో, నిషేధించడమో కుదరదని వారికి తెలుసు. అది ఆ పరిధిలోకి రాదు గనుక. రెండు ః ఉన్మాదపు మంద బలంతో ‘మోరల్ పోలీసింగ్’ చేయాలనే దురుద్దేశం. ఇంతకు మించి మరేమీ లేదిక్కడ.

కొన్ని పుస్తకాలను, కొన్ని వయసుల వారికో, ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారికో అందుబాటులో లేకుండా కట్టడి చేయడం, లేదా మొత్తానికే పుస్తకాలను నిషేధించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే! దాని మంచి చెడుల మీద కూడా విస్తృతమైన చర్చ ఉండనేవుంది.
అసలు ఏ పుస్తకాన్నీ నిషేధించకూడదనే బలమైన వాదన కూడా ఉంది. ఎవరో కొందరు… ‘నిషేధించదగిన కంటెంట్’ అనేది కూడా, తెలుసుకొని తద్వారా కొందరు తమను తాము బాగు చేసుకొని, సంస్కరించుకునేందుకు గల అవకాశాన్ని నిషేధం చంపేస్తుందనే వాదన కూడా హేతుబద్దమే! ఇక్కడ, మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చెప్పిన మాట ఒకటి స్మరించుకోతగ్గది. యాభైలలో జరిగిందిది. నెహ్రూతో చాలా సాన్నిహిత్యమున్న మరాఠా మిత్రుడొకరు ఆయన వద్దకు వచ్చి, ఒక పుస్తకం గురించి తీవ్రమైన ఫిర్యాదు చేశారు. ‘బొంబాయిలో మార్కెట్లోకొచ్చిన ఫలానా పుస్తకం దరిద్రంగా ఉంది, అందులోని కంటెంట్…. హిందు-ముస్లీం ల మధ్య గొడవలు పెంచేదిగా, మతసామరస్యాన్ని మంట కలిపేదిగా ఉంది. ఆ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి’ అంటూ నెహ్రూపై ఒత్తిడి తెచ్చాడు. ‘నో… నో…. అదెట్లా సాధ్యమౌతుంది? అట్లా చేయడం సరైన చర్య కాదు. ప్రజాస్వామ్యంలో అంత తేలిక్గా ఒక పుస్తకాన్ని ఎలా నిషేదిస్తారు? కుదరదు’ అన్నారు. ‘అదేం మాట? మత సామరస్యం మంట గలిసినా సరేనా? నువ్వేం ప్రధానివి? రాగల ప్రమాదాన్ని ఇంత సూటిగా చెప్పినా వినవు, పోనీ, నువ్వే చెప్పు… ఏంటి దీనికి పరిష్కారం?’ అన్నారట ఆ మిత్రుడు. దానికి నెహ్రూ స్పందించి ‘ఆ… ఇప్పుడు నీవు సరైన దారిలోకి వచ్చావు. పుస్తకాల్ని నిషేధించకూడదు. నువే చెబుతున్నావ్ కద, పుస్తకంలోని కంటెంట్ మనుషుల్ని, వారి ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది, మతసామరస్యం భంగం చేస్తుందని. అయితే నువ్వో పని చెయ్! ఆ పుస్తకం ఎంత దరిద్రమయిందో చెబుతూ, ఎలా మతసామరస్యాన్ని మంటగలుపుతుందో వివరిస్తూ….. నువ్వో, నీకు తెలిసిన నిపుణులెవరో ఒక మాంచి పుస్తకం రాయండి. ఏం చేస్తే మతసామరస్యం మరింత పటిష్టపడుతుందో చక్కగా అందులో వివరించండి’ అన్నారు. పైగా, ‘ఇంకో మాట, నువ్ తిడుతున్న పుస్తకం కన్నా ఓ పది పేజీలు ఎక్కువ, ఓ వంద కాపీలు ఎక్కువే అచ్చేయించి, పంపినీ చేయించండి. దెబ్బకు రోగం కుదురుతుంది’ అన్నారట!
అదీ సంగతి.

పుస్తకాలను ఏకపక్షంగా నిషేధించడం కూడా సమంజసం కానపుడు, నిషేధం పరిధిలోకి రాని, నిషేధయోగ్యం కాని పుస్తకాలను… ఎందుకు ప్రచురించారు? ఎందుకు అమ్ముతున్నారు? ఎందుకు షాప్ లో ఉంచుతున్నారు? అని మొండిగా ప్రశ్నించడం…. దాడి, దౌర్జన్యం కాక మరేమవుతుంది? ఇది ముమ్మాటికీ దాడి, దౌర్జన్యం, ఖండనార్హం!
ఈ మూక చర్యను ముక్తకంఠంతో ఖండిద్దాం.