INCTELANGANA:
‘తనదాకా వస్తే కాని తత్వం బోధపడదం’టారు. ఆ గ్రహింపు అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ నాయకులకు రావాల్సిన అవసరముంది. సదరు అవసరాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుర్తించడమే కాదు అందరికీ నొక్కిచెప్పారు. ఏమైతేనేం, ఏడాది పాలన దాటాక ఆయన నోరు విప్పారు. ఎప్పుడో ఒకప్పుడు చెప్పక తప్పని నాలుగు మంచి మాటల్ని మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు కొందర్ని కూర్చోబెట్టుకొని చెబుతూ, వారి ద్వారా సమస్త కాంగ్రెస్ శ్రేణులకు కార్యాచరణ ప్రకటించారు. తనతో సహా అందరి ప్రోగ్రెస్ రిపోర్టులు తన వద్ద ఉన్నాయని, ఎవరి అవకాశాలకైనా వారి పనితీరే ‘ప్రామాణికం’ అని కుండబద్దలు కొట్టారు. ‘చాలు, ఇక మన హానీమూన్ ముగిసింది. అసలు సవాళ్లు ముందున్నాయి. వాటిని అధిగమించాలంటే ఫోకస్డ్గా ఉండాలి, కలిసికట్టుగా పనిచేద్దాం పదండి’ అని ముఖ్య సహచరులకు చెబుతూ, మీడియా మాధ్యమంగా అందరికీ సందేశమిచ్చారు. ఏడాది అనుభవాలు నాలుగేళ్లకు ప్రేరణ కావాలన్నారు. సరైన సమయంలో సరైన చర్య!
‘నేను మారాను, మీరు మారాలి’ ఈ మాట….. ఎప్పుడో ఎక్కడో విన్నట్టుంది కదూ! ఎస్, సీనియర్ రాజకీయవేత్త, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి పేటెంట్ రైటున్న వాక్యమిది. ఆయన తరచూ వాడుతుంటారు. ముఖ్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులనుద్దేశించి ఆయనీమాటలంటుంటారు. ‘చంద్రబాబు శిష్యుడు కనుక, ఆయన బాటలోనే ఈ మాట వాడారు’ అని ఎవరైనా అంటే, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి కోపమొస్తుంది. కొన్ని రాజకీయ పరిస్థితుల్లో బాబుతో కలిసి పనిచేసిన మాట వాస్తవమే అయినా… ‘ఇందులో శిష్యరికమేముంది? తనకు తానుగా ఎదిగిన నాయకుడి’గా రేవంత్రెడ్డికి అపారమైన ఆత్మవిశ్వాసం! కొన్ని విషయాల్లో ఆయనకు డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డితోనూ పోలిక పుంటుంది. వై.ఎస్ లాగే… క్లిష్ట సమయంలో, బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొని, పార్టీని ఒంటి చేత్తో విజయతీరాలకు నడిపారు. అలా కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మాట చెల్లుబాటయ్యే ‘ఫ్రీ హ్యాండ్’ పొందిన నాయకుడాయన. ఇదే క్రమంలో ఒకవైపు ప్రభుత్వ-పాలనా వ్యవస్థపైన, మరోవైపు పార్టీపైన పూర్తి పట్టు సాధించడం ఇప్పుడాయన ముందున్న కర్తవ్యం. అది ఆయనకు అవసరం కూడా! ఎందుకంటే, రెండు విధాలా ఆయన పూర్తి పట్టుతో అజమాయిషీ సాధించినా, పార్టీలో కొందరితో ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది. అందుకు ఆస్కారం లేకుండా పార్టీ ఏకతాటిపై నడవాలనేది ఆయన అభిలాష! ‘గ్రూపులున్నాయి, అయినా వాటినధిగమించి కలిసికట్టుగా ముందుకు సాగాల’ని హితవు పలికారు. కొత్త సంవత్సరం సందర్భంగా తనను కలిసిన కొందరు నాయకులతో మనసు విప్పి ఆయన మాట్లాడారు. తన ఇదివరకటి వైఖరికి భిన్నంగా, మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు తనే ఫోన్లు చేసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపానని, వారూ అలాగే అందరితో కలుపుగోలుగా ఉండాలని ఆయన సూచించారు.
అప్పుడే, ‘నేను మారాను, మీరూ మారండి’ అన్నారు. పార్టీ శ్రేణుల్ని నిరంతరం ప్రజల్లో ఉండమని, వారి మంచి-చెడుల్ని తెలుసుకోమని కోరారు. వందరోజుల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్దం కావాలన్నారు. గెలుపు ట్రాక్ వీడొద్దన్నారు.
సరైన సమయంలో సమీక్ష
వాస్తవిక సమాచారంతో, నిజాయితీ సమీక్షకు రాజకీయ పార్టీలు భయపడుతున్న రోజులివి. ఓ పెద్ద ఓటమి-గెలుపు తర్వాత కూడా లోతైన సమీక్ష, ఆత్మపరిశీలన పార్టీలు జరుపుకోవడం లేదు. దాంతో పనితీరు మార్చుకునే, తప్పులు సరిదిద్దుకునే అవకాశమే వారికి లభించడం లేదు. ‘తెలిసి నేనేమీ తప్పులు చేయలేదు, తెలియకుండా ఏవైనా జరిగినా… గుర్తించిన వెంటనే సరిదిద్దుకుంటున్నాన’ని రేవంత్రెడ్డి నిజాయితీగా అంగీకరించారు. ఏడాదిలో తమ ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందని, అవి సమగ్రంగా ప్రజల్లోకి వెళ్లలేదనే భావన ఉంది. అందుకే, సంక్రాంతికి ప్రకటించబోయే ప్రత్యేక కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాల్ని బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని నాయకులకు సూచించారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలని, ప్రజల అవసరాలు తీర్చాలని పిలుపిచ్చారు. పార్టీ వారికైనా, ఇతరులకైనా ప్రభుత్వ పదవులు, హోదాలు ఇచ్చే ప్రక్రియ యోగ్యతల్ని బట్టి జరగాలని, దరఖాస్తులు స్వీకరించి, అదంతా ఆన్లైన్ పద్దతిన పారదర్శకంగా ఉండాలని అభిలాషించారు. పార్టీ పదవులైనా, ఎన్నికల్లో అవకాశాలైనా…. పనితీరే ప్రామాణికంగా, 80% పైబడి దీర్ఘకాలంగా పార్టీకోసం పనిచేస్తున్న వారికే ఇవ్వాలనే భావనను కూడా సీఎం వ్యక్తపరిచారు. రాబోయే వంద రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే కోటాలో నాలుగు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పార్టీకి సవాలే! పార్టీ సీనియర్ నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానాన్ని నిలుపుకోవాల్సిన సవాల్ పార్టీ ముందుంది. కాంగ్రెస్ నాయకులకు తెలిసి రావాలనేమో… ప్రజలకు ఆశ -ఆకాంక్షలుంటాయి గనుక మొదటి సారి గెలవటం గొప్ప కాదని, తమ స్థానాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల్ని గెలిపించుకొని, ప్రజావిశ్వాసంతో తిరిగి ఎన్నికవడం గొప్పని.. సీఎం మార్గదర్శనం చేశారు.
వ్యూహాలలో పైచేయి…
జాతీయ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతూ -ప్రాంతీయ విపక్షాన్ని ఎదుర్కొంటూ కూడా… ప్రాంతీయ మనోభావాలకు సంబంధించిన కొన్ని విషయాల్లో కాంగ్రెస్ నాయకత్వం వ్యూహం సత్ఫలితాలనే ఇస్తోంది. ఇందులో తెలంగాణ వాదం ఒకటి. ఈ విషయంలో సీఎం రేవంత్రెడ్డి వేస్తున్న వ్యూహాత్మక అడుగులు విపక్ష పార్టీ బీఆర్ఎస్ ను ఇరుకున పెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సానుకూలత, పైచేయి లభించేలా చేస్తున్నాయి. విద్యాసంస్థలకు చాకలి ఐలమ్మ, సురవరం ప్రతాపరెడ్డి పేర్లు పెట్టడం, వివాధాల నడుమ కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ప్రతిష్టించడం, అందెశ్రీని ఆదరించి ‘తెలంగాణ గీతా’న్ని తెరపైకి తేవడం, తెలంగాణ కవులు -కళాకారులకు కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారాలతో పాటు ఇళ్ల స్థలాలు వంటి నిర్ణయాలతో తెలంగాణ వాదం తమతోనే ఉండేలా చేసుకోగలిగారు. కొన్ని విషయాల్లో ప్రతిపక్షంగా బీఆర్ఎస్, పాలకపక్షాన్ని విమర్శించేందుకు యత్నించినా…. పదేళ్లలో ఆయా విషయాల్లో జరిగిన అనర్ధాలు, అవినీతి, జాప్యాలను బలంగా ఎత్తి చూపుతూ ప్రత్యర్థి వాదనలు వీగిపోయేలా, వారిని ఇరుకున పెట్టేలా… కాంగ్రెస్ నాయకత్వం సమర్థంగా ఎత్తుగడలకు వెళుతోంది. దాంతో, పలు విషయాల్లో ఘాటుగా విమర్శించలేని, తిట్టి -తిట్టించుకోలేని ఇరకాట పరిస్థితి ప్రతిపక్షానికి ఎదురవుతోంది.
కీలక నిర్ణయాలూ జరగాలి..
పాలకపక్షంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పనితీరు మరింత సమన్వయపడాల్సిన అవసరం ఉంది. ఇకపై తాను పార్టీకి కొంత సమయం ప్రత్యేకంగా వెచ్చిస్తానని ముఖ్యమంత్రే స్వయంగా పేర్కొన్నారు కనుక ఈ దిశలో చర్యలు చేపట్టచ్చు. యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ వంటి అనుబంధ సంఘాలు స్తబ్దుగానే ఉన్నాయి. టీపీసీసీ పీఠం మీదకి కొత్త నేతగా మహేష్ కుమార్ గౌడ్ వచ్చి నూరు రోజులు దాటినా పీసీసీ కార్యవర్గమే ఏర్పడలేదు. ముంచుకొస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీ సీరియస్గా పనిచేస్తోందనే భావన కలిగించాల్సిన అవసరం నాయకత్వానికుంది. నిర్దిష్ట చర్యలు, కార్యక్రమాల ద్వారా మహేష్ కుమార్ గౌడ్ తనదైన ముద్రవేసుకోవాలి. సభ ఏర్పడి ఏడాది అయినా సీఎల్పీ కార్యవర్గం ఇంకా రూపుదిద్దుకోలేదు. ఆ లోటు ఇటీవలి అసంబ్లీ సమావేశాల సందర్భంగా కొట్టచ్చినట్టు కనిపించింది. ‘విప్’ల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం, శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి కొందరు మినహా మంత్రులు పెద్దగా చొరవ తీసుకోకపోవడం, ముందుగా తగినంత కసరత్తు జరుగకపోవడం… సభా నిర్వహణలో సమన్వయలోపాన్ని ఎత్తిచూపుతోంది. రాబోయే బడ్జెట్ సమావేశాల నాటికి ఇటువంటివన్నీ సర్దుబాటు అయితే తప్ప పాలకపక్షం నిశ్చింతగా ఉండలేదు. విపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకొస్తే, ఎదుర్కోవడానికి పూర్తి సన్నద్దత అవసరం. ప్రభుత్వమేదైనా… ప్రతి మంత్రివర్గ విస్తరణా పరీక్షే! ప్రాంతీయపార్టీ ప్రభుత్వాల్లోనూ ఆ సమయంలో అసమ్మతి, అసంతృప్తి తప్పని తతంగమే! మంత్రివర్గ విస్తరణలో జరిగే అసాధారణ జాప్యం ప్రతికూలమే! కీలక స్థానాల్లో ఇంకా పాత ప్రభుత్వం, ప్రాధాన్యతతో తెచ్చుకున్న అధికారులే ఉన్నారని, కార్పొరషన్లు, ఇతర హోదాల్లోనూ ఇంకా అటువంటివారే ఉన్నారని పార్టీవర్గాలు ఆరోపిస్తున్నాయి. వీలయినంత తొందగా పార్టీ నాయకత్వం వాటిపై దృష్టిపెట్టాలి.
వరుసగా వేర్వేరు రాష్ట్రాల్లో పార్టీ ఓటమి, ‘ఇండియా కూటమి’ పొత్తుల భాగస్వాముల్లో అసంతృప్తి.. వెరసి, ఇప్పుడు కాంగ్రేస్ ఢిల్లీ నాయకత్వం ఒకింత బలహీనంగానే ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ అయిన పార్టీ ప్రధానకార్యదర్శి దీప్దాస్ మున్షీ పనితీరుపై కూడా రాష్ట్ర పార్టీలో అసంతృప్తి ఉంది. సమయం, సందర్భం, అవసరం బట్టి వస్తుండాలే తప్ప… నెలకు ఇరవై రోజులు ఇక్కడే తిష్టవేసి ఉండటాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ వాతావరణంలో సీఎంతో పార్టీ అధిష్టానం సంబంధాలు ఇప్పటికైతే బాగున్నాయి. ఏమో? రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. కేంద్ర స్థాయి నాయకత్వంతో సయోధ్య నెరపుతూనే రాష్ట్రంలో ప్రభుత్వంపైన – పార్టీపై పట్టు సాధించడం సీఎం కు ఒక రాజకీయ అవసరం.