విశాఖపట్నమే ఇక రాజధాని అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చే విధంగా నీలి, కూలీ మీడియా ఛానెళ్ళు వార్త కథనాలు వండి వార్చి ప్రసారం చేయడం పట్ల నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడు రాజధానుల వ్యవహారంలో.. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట అని ఓ నీలి మీడియా టీవీ ఛానల్ వార్త కథనం ప్రసారం చేయగానే.. మిగతా నీలి చానళ్ల న్నీ, అదే తరహా కథనాలు ప్రసారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై, సుప్రీం కోర్ట్ ఎటువంటి తీర్పును వెలువరించక ముందే, స్టే ఇచ్చినట్టుగా తప్పుడు వార్త కథనాలను నీలి మీడియా ఛానళ్లు ప్రసారం చేయడం దారుణమని ఆగ్రహాం వ్యక్తం చేశారు. గతంలో తాను జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు తీర్పు వెలువరించక ముందే, సాక్షి దినపత్రికలో రఘురామ పిటిషన్ కొట్టివేత అంటూ వార్తా కథనాన్ని రాశారన్నారు. వారం రోజుల అనంతరం సాక్షి దినపత్రిక వార్తా కథనం నిజమయ్యే విధంగా న్యాయమూర్తి తీర్పు వెలువడిందని తెలిపారు. రాజధాని వ్యవహారంలో కూడా ఇప్పుడు అదే కుట్ర జరుగుతోందా? అనే అనుమానం కలిగే విధంగా నీలి, కూలీ మీడియా కుట్రలు చేస్తోందని రఘురామకృష్ణం రాజు ధ్వజమెత్తారు.
అన్ని వర్గాలకు బడ్జెట్ అనుకూలం..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఉందని రఘురామకృష్ణం రాజు కితాబునిచ్చారు. రాష్ట్రంలో నత్తనడకన సాగుతున్న జగనన్న గృహాలు, కేంద్ర బడ్జెట్ కేటాయింపుల తోనైనా వేగం పుంజు కుంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రైతులు, పేదలు, మధ్యతరగతి వర్గాలతో పాటు, ఎగువ మధ్యతరగతి వర్గాలకు కూడా మేలు చేసే నిర్ణయాలను బడ్జెట్లో తీసుకోవడం జరిగిందన్నారు.