తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నల్లగొండ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలని సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల పేరిట దూకుడును ప్రదర్శిస్తుంటే.. పక్కలో బళ్లెంలా సొంత పార్టీ నేతలే టికెట్ రేసులో మేమున్నామంటూ సేవా కార్యక్రమాల పేరుతో గ్రామగ్రామాన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక ప్రతిపక్ష బీజేపీ ,కాంగ్రెస్ పార్టీ నేతలు తామేమి తక్కువ కాదన్న తరహాలో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బిఆర్ఎస్ లో గ్రూపు తగాదాలు…
అధికార బిఆర్ ఎస్ లో అధిపత్య పోరు నడుస్తోంది. ఇటు సీనియర్లు.. అటు జూనియర్లు ఎవరికి వారు సీటు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఉద్యమకారులు చకిలం అనిల్ కుమార్, చాడ కిషన్ రెడ్డి , యువనేత పిల్లి రామరాజు.. సేవా కార్యక్రమాలు, సమావేశాల పేరిట ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇటీవల తెలంగాణ ఉద్యమకారుల పేరిట సీనియర్ నేత చకిలం అనిల్ కుమార్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నట్లువంటి ఉద్యమకారులు హాజరయ్యారు.వీరితో పాటు పార్టీ పై అసంతృప్తంగా నేతలు సైతం సమావేశానికి హాజరై.. తమ ఆవేదనను పంచుకున్నట్లు తెలిసింది. మరోనేత చాడ కిషన్ రెడ్డి సైతం ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారని పేరు వినిపిస్తున్నా.. ఆయనకు టికెట్ కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక మరోనేత పట్టణంలోని 8 వార్డు కౌన్సిలర్ పిల్లిరామరాజు. ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గ్రామం , పట్టణం తేడా లేకుండా ఏచిన్న కార్యమైనా హాజరై ఆర్థిక సహాయం చేస్తున్నారు. బిసి వర్గానికి చెందిన నేత కావడం..యువతలో మంచి పేరుండటం.. మంత్రి జగదీష్ రెడ్డి అండదండలు ఉండటం రామరాజుకు కలిసొచ్చే అంశాలు. ఒకవేళ టికెట్ రాని పరిస్థితుల్లో..మరో పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటిచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే..ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి.. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు విస్తృత్తంగా పర్యటిస్తు.. ప్రజలతో మమేకమవుతున్నారు. అయితే ఆయనపై ఉన్నటువంటి ఆరోపణలు ఆయనకు మైనస్ గా జనాలు చర్చించుకుంటున్నారు. దందాలు , సెటిల్ మెంట్లు, భూకబ్జా వంటి వాటిల్లో ఆరితేరారని ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరోసారి అధిష్టానం టికెట్ ఇస్తే విజయం కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రతిపక్ష పార్టీల పరిస్థితి..
ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ విషయానికొస్తే..కమలం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న మాదగోని శ్రీనివాస్ గౌడ్ నిత్యం కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలకు హాజరవుతున్నారు.యువతలో మంచి పేరున్నప్పటికి.. ఎమ్మెల్యేగా పోటిచేస్తే గెలుపు కష్టమనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం.
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఎమ్మెల్యేగా పోటిచేసే విషయంపై ఇప్పటికే క్లారీటి ఇచ్చాడు. జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తల సాక్షిగా .. నల్లగొండ నుంచి పోటిచేయడం ఖాయమని కుండ బద్దలు కొట్టారు. అయితే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయన సైతం పార్టీ మారతారన్న ప్రచారం జరిగింది. కానీ అవి అసత్య ప్రచారాలే అంటూ కొట్టిపారేశారు. ఇప్పటికి స్తబ్ధుగా వ్యవహరిస్తున్న వెంకట్ రెడ్డి.. జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తే మాత్రం ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఆస్కారం లేకపోలేదన్నది అనుచర వర్గం వాదనగా వినిపిస్తుంది.