‘చెన్నై’ ధమాకా !

  • బెంగుళూరు పై 68 పరుగులు తో విజయం
  • ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన జడేజా
  • టోర్నీలో బెంగుళూరుకి తొలి ఓటమి

ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఐదు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. గత సీజన్లో పేలవమైన ఆట తీరుతో టోర్నీ నుంచి నిష్క్రమించి అభిమానులను నిరాశపరిచిన సూపర్ కింగ్స్ ఈ సారి దుమ్మురేపుతోంది. తాజాగా ఆదివారం బెంగుళూరుతో జరిగిన పోరులో ఆ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో 69 పరుగులుతో ఘన విజయం సాధించింది. తొలుత  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(33; 25 బంతుల్లో 4×4, 1×6), డుప్లెసిస్‌(50; 41 బంతుల్లో 5×4, 1×6) అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఆతర్వాత వచ్చిన సురేశ్‌ రైనా(24; 18 బంతుల్లో 1×4, 3×6), రవీంద్ర జడేజా(62*; 28 బంతుల్లో 4×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా ఆల్ రౌండర్ జడేజా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హర్షిత్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో జడ్డూ  ఐదు సిక్సులు, ఒక బౌండరీ తో కలిపి మొత్తం 37 పరుగులు రాబట్టాడు. దీంతో చెన్నై భారీ టార్గెట్ ను ప్రత్యర్థి ముందుచుంది. బెంగుళూరు బౌలర్లలో హర్షల్‌ మూడు వికెట్లు తీయగా చాహల్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులకు పరిమితమైంది.  ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌(34; 15 బంతుల్లో 4×4, 2×6), మాక్స్‌వెల్‌(22; 15 బంతుల్లో 3×4) మినహ.. మిగతా బ్యాట్స్‌మెన్‌ వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. దీంతో బెంగుళూరు తొలి పరాజయాన్ని చవిచూసింది. చెన్నై బౌలర్లలో జడేజా 3, ఇమ్రాన్‌ తాహిర్‌ 2, సామ్‌కరన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో వికెట్‌ తీశారు.