కాంగ్రెస్ నేత ఎంపీ మనీశ్ తివారీ రాసిన ఓ పుస్తకం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. 2008 ముంబయి ఉగ్ర దాడుల సమయంలో యూపీఏ ప్రభుత్వం దీటుగా స్పందించలేదంటు.. మనీష్ ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని అధికార బీజేపీ నేతలు.. అప్పటి యూపీఏ ప్రభుత్వానిది అసమర్థ, బలహీన పాలన అని మరోసారి స్పష్టమైందంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇంతకూ పుస్తకంలో ఏముంది..?
’10 ఫ్లాష్ పాయింట్స్.. 20 ఇయర్స్’ పేరిట ఎంపీ మనీష్ తివారీ ఓ పుస్తకాన్ని రాశారు. ఇది డిసెంబర్ 2న విడుదలకానుందని ఆయన ఇటీవల ట్విట్టర్ వేదికగా తెలిపారు. గడిచిన రెండు దశాబ్దాల్లో దేశ భద్రతకు ఎదురైన సవాళ్లను ఆధారంగా తీసుకొని ఈ పుస్తకాన్ని రాశారు. ఇందులో భాగంగానే యావత్ దేశాన్ని వణికించిన ముంబయి దాడుల పరిస్థితులను ప్రస్తావించారు.
ఇక ఈ విషయాలను ఆధారంగా చేసుకొని.. అధికార బీజేపీ నేతలు.. యూపీఎ పాలనపై విమర్శలు చేస్తున్నారు. యూపీఏ పాలనలో అరాచకాలను ఆపార్టీ నేతలే వెల్లడించడం చూస్తుంటే..రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని బీజేపీ నేతలు ఎద్దేవ చేస్తున్నారు. ఎన్డీఏ పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని.. అందుకు నిదర్శనం దేశంలో.. గడిచిన ఏడున్నర ఏళ్లలో అలాంటి ఒక్క ఘటన జరగలేదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు.