ఐపీఎల్ తాజా సీజన్లో ముంబై ఇండియన్స్ తొలి ఓటమిని చవిచూసింది. మంగళవారం దిల్లీ తో జరిగిన పోరులో ముంబై 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(44; 30 బంతుల్లో 3×4, 3×6) పరుగులతో రాణించాడు. చివర్లో ఇషాన్ కిషన్(26; 28 బంతుల్లో 1×4, 1×6), జయంత్ యాదవ్(23; 22 బంతుల్లో 1×4) ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో స్పిన్నర్ అమిత్ మిశ్రా (4/24)అద్భుత ప్రదర్శనతో ముంబయిని కట్టడి చేశాడు. మిగతా బౌలర్లలో అవేశ్ ఖాన్ రెండు.. స్టోయినిస్, రబాడ, లలిత్ ఒక్కో వికెట్ తీశారు. ముంబయి నిర్దేశించిన 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్(45; 42 బంతుల్లో 5×4, 1×6), స్టీవ్‌స్మిత్(33; 29 బంతుల్లో 4×4) లలిత్(22 నాటౌట్; 25 బంతుల్లో 1×4)రాణించడంతో దిల్లీ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ముంబయి బౌలర్లలో జయంత్, బుమ్రా, చాహర్, పొలార్డ్ తలా ఓ వికెట్ పడగొట్టారు.