ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్):
ప్రజాస్వామ్యం చిన్నబోతోంది. ‘ఓస్ ఇంతేనా ప్రజాస్వామ్యమంటే!’ అనే అభిప్రాయం కలిగేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని అరిష్టాల నడుమ కూడా రాజరికమైనా, కడకు నియంతృత్వమైనా నయమేమో అనిపించేంత అద్వాన్న పరిస్థితులు దాపురిస్తున్నాయి. 146 మంది విపక్ష సభ్యుల్ని సస్పెన్షన్‌తో బయటకు పంపి, దేశానికి కీలకమయ్యే చట్టాల బిల్లులను పార్లమెంటులో ప్రభుత్వం ఏకపక్షంగా ఓకే చేయించుకుంది. వాటిపై సమగ్ర పరిశీలన లేదు, అభ్యంతరాలు లేవు, చర్చ లేదు. నూటా యాబై సంవత్సరాలుగా దేశంలో అమలవుతున్న ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ వంటి కీలక చట్టాలను రద్దు చేశారు. వాటి స్థానే… మరో వందేళ్ల పాటు మనుగడలో ఉండే మూడు కొత్త చట్టాలకు ఈ సంధి కాలంలోనే సభ ఊపిరిపోసింది. ఓ 62 గంటలు సాగిన పార్లమెంటు సమావేశాల్లో 18 బిల్లులను సభ ఆమోదించింది. పాతిక, ముప్ఫై శాతం దేశ ప్రజలకు సభలో ప్రాతినిధ్యమే లేనపుడు ఈ పరిణామాలు జరిగాయి. దీన్ని 74 శాతం సక్కెస్‌గా జబ్బలు చరుచుకుంటున్నారు. ఎందుకీ దుర్గతి…..? ఒకసారి పరిశీలిద్దాం.
చిన్నదో, పెద్దదో పార్లమెంటుపై దాడి జరిగింది. అది నిజం. 22 ఏళ్లకింద విద్రోహులు పార్లమెంటుపై దాడి జరిపి రక్తం కళ్లచూడటమే కాక ప్రాణాలు బలిగొన్నదుర్ఘటన మనకింకా గుర్తుంది. అదే రోజున మళ్లీ దాడి జరుపుతాం, అని ముందే ప్రకటించిన తర్వాత ఇది జరిగింది. ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఇద్దరు ఆగంతకులు సభా మందిరంలోకి దూకి పొగబాంబులు వేశారు. దేశంలో అత్యున్నత విధాన నిర్ణాయక సభ సభ్యులు భయంతో చెల్లా చెదురయ్యారు. ఈ దాడికి పాల్పడ్డదెవరు? ప్రకటన చేసిన ఖలిస్తాన్ ఉగ్రవాదులకు వీరికి సంబంధమేంటి? లోగడ దాడి చేసిన ఇస్లామిక్ ఉగ్రమూకలతో వీరికేమైనా సబంధముందా? ముందస్తు హెచ్చరికల తర్వాత పార్లమెంటు భద్రత ఏమైంది? స్మోక్‌టిన్స్ స్థానే దుండగుల చేతుల్లో మారణాయుధాలుంటే… ప్రమాదం ఏ స్థాయిలో ఉండేది? ఇటువంటి ప్రశ్నలు సహజం. పార్లమెంటు సభ్యులుగా, దేశ ప్రజల ప్రతినిధులుగా… ప్రభుత్వాన్ని ప్రకటన చేయమనడం వారి హక్కు, అంతకు మించి బాధ్యత. దానికి తగిన సమాధానం ఇవ్వటం ప్రభుత్వ, పాలకపక్ష బాధ్యత. అంతకు మించి కర్తవ్యం. కానీ, మేం చర్చించం, ఏ ప్రస్తావనను అనుమతించం, ప్రకటన చేయం, ఏం చేసుకుంటారో చేసుకోండి, నిరసన అంటూ మొండికేస్తే, ఈడ్చి అవతల పారేస్తాం! అంటే, ఇదేం ప్రజాస్వామ్యం?
ఎన్ని మాటలు చెప్పినా ప్రజస్వామ్యమే భూగోళమ్మీద అత్యధికుల ఆమోదమున్నపాలనా విధానం. కానీ, దాన్ని వక్రీకరిస్తున్నారు. మొత్తంగా ఒక్కసారి కాకుండా రోజు రోజు, దారప్పోగు ఒక్కొక్కటిగా తెంపుతూ ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తున్నారు. పౌరుల హక్కుల్ని కాలరాస్తున్నారు. వారి డబ్బుతో, వారిచ్చిన అధికారంతో, వారి పేరు చెప్పి…. వారికే వంచన తలపెడుతున్నారు. వారిని రోజు రోజుకు అశక్తుల్ని చేస్తున్నారు. వారిపైనే స్వారీ చేస్తూ కర్కషంగా పాలిస్తున్నారు. దీన్నే ప్రజాస్వామ్యం అనుకోండి అంటున్నారు. ప్రజాస్వామ్యమంటేనే ఈసడించుకునేలా చేస్తున్నారు. దీన్ని అనుమతిస్తే ఎలా ?
ప్రభుత్వమంటే ప్రజలకు జవాబుదారు. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. కనుక ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల నుంచి అది ఏర్పడుతుంది. మెజారిటీ సభ్యులున్న పార్టీ సర్కారు ఏర్పరచినా… ప్రభుత్వంగా అందరు సభ్యులదీ ఉమ్మడి బాధ్యత. మనది భాగస్వామ్య ప్రజాస్వామ్యం కూడా కనుక, అది ఏ పక్షం నుంచైనా , ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులంతా ప్రభుత్వంగా ప్రజలకు సమిష్టి బాధ్యత వహించాలి. అప్పుడే ప్రజలు స్వయంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాన్ని విస్మరించి, పాలకపక్షం ఇష్టమొచ్చింది చేయొచ్చు, విపక్షానికి తావే లేదు… అన్నట్టు వ్యవహరించడం దారుణం. అభివృద్ది చెందిన కొన్ని సమాజాల్లో విపక్షానికీ కొన్న సబ్జెక్టులు, శాఖల వారిగా నిర్వహణకు కొన్ని నిధులు, చట్ట సభల్లో కొన్ని ప్రత్యేక రోజులు, కొన్ని ప్రత్యేక సెషన్లు ఉంటాయి. హౌజ్ ఆఫ్ కామన్స్ దీనికి ప్రతీక! పార్లమెంటు సజావుగా జరుపుకోవడం ప్రభుత్వ బాధ్యత అన్న బ్రిటీష్ వలసవాద పాలనా విధానాన్ని మూసపద్దతిలో మనం ఇప్పటికీ పాటిస్తున్నాం. నిజమైన స్ఫూర్తి లేదు, ఏ సంస్కరణలూ రావు. చీఫ్ విప్, ఇతర విప్‌ల వ్యవస్థను కుప్పకూల్చారు. సభలో ఏదైనా ప్రతిష్టంభన ఏర్పడ్డపుడు… పరస్పర సంప్రదింపులతో పాలక-విపక్షాల మధ్య సయోధ్యకు ఓ ప్రయత్నం జరగాలి. అది పూర్తిగా కనుమరుగవుతోంది. ఫ్లోర్-కోఆర్డినేషన్ అన్న మాటే మరుగుపడింది. పాలక-విపక్షాలు పరస్పరం శత్రువులను చూసుకున్నట్టే!
ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో సాగడం. విభేదిస్తే విపక్షం నిరసన తెలుపడం, దానికి శిక్షగా వారిని సస్పెండ్ చేయడం, అయితే సర్కారువారి ఏకపక్ష నిర్ణయాలు, లేదా సభ ప్రతిష్టంభన…. ఇదే జరుగుతోంది. లక్షల కోట్ల ప్రజాధనం వృధా అవుతోంది. నాయకులకు, పార్టీలకొచ్చిన నష్టమేమీ లేదు. అంతిమంగా ప్రజలు నష్టపోతున్నారు. ప్రజాస్వామ్యం పరిహాసమవుతోంది. తొందరగా దీనికొక పరిష్కారం కనుక్కోవాలి. లేకుంటే…. ప్రజలకు నిరవధిక వంచన తప్పదు, విధిలేని పరిస్థితుల్లో వారు తిరగబడే రోజొకటొస్తుంది, తస్మాత్ జాగ్రత్త!