ఉండవల్లిని ఎన్నికల వ్యూహకర్తగా నియమిస్తే కాపు–బలిజలకు రాజ్యాధికారం ఖాయం!

Nancharaiah merugumala senior journalist: ఉండవల్లిని జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా నియమిస్తే కాపు–బలిజలకు రాజ్యాధికారం ఖాయం!

వచ్చే ఏడాది ఏప్రిల్‌–మే మాసాల్లో జరిగే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 16వ ఎన్నికల్లో కొందరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్లు నిరాకరించి, కొత్త అభ్యర్థులను నిలిపే దిశగా ఈ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏ మాత్రం అవకాశం దొరికినా ఆంధ్రా పాలిటిక్సును విశ్లేషించి, ప్రధాన ప్రాంతీయ పార్టీల నాయకులకు అడక్కుండానే సలహాలిచ్చేస్తారు రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గారు. నిర్ణీత వ్యవధిలో తనదైన మార్కుతో దేశ, రాష్ట్ర రాజకీయాలపై, ఆధునిక భారత ఉపఖండ చరిత్రపై అనర్గళంగా టీవీ చానళ్ల కెమేరాల ముందు ప్రసంగిస్తారు ఉండవల్లి. విశాఖపట్నం జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్‌ బ్రాహ్మణ మాజీ ఎంపీ దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ గారికి  రాజకీయ వారసుడిగా కనిపించే ఇలాంటి నియోగ బ్రాహ్మణ రాజకీయ–సామాజిక మేధావి తెలంగాణ రాష్ట్రానికి లేకపోవడం నిజంగా కొత్త రాష్ట్రం దురదృష్టం. జగన్‌ తన పార్టీ అభ్యర్థులను మార్చి కొత్త నాయకులను నిలిపే విషయంలో తొందర, దూకుడు వద్దని, సహనంతో ముందుకెళ్లాలని అరుణ్‌ కుమార్‌ ఇటీవల ఉచిత రీతిన విన్నవించుకున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలల్లో జరుగుతాయి కాబట్టి ఏపీలో చివరి బ్రామ్మణ ఎంపీ అయిన ఉండవల్లి– పాలకపక్షం పోకడలను నిశితంగా గమనిస్తున్నారు. ఉచిత సలహాలు విసరడం మొదలెట్టారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులైన కొందరు నాయకులు మాదిరిగానే ఆయన కొడుకు పార్టీలో చేరే అవకాశం ఉండవల్లికి లేదు. మరి ఈ లెక్కన రాయలసీమ బలిజ మాజీ ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మీనారాయణ తాను ప్రారంభించిన జై భారత్‌ నేషనల్‌ పార్టీకి ఉండవల్లిని ఎన్నికల వ్యూహకర్త (ఎలక్షన్‌ కన్సల్టెంట్‌)గా నియమించుకుని, వాడేసుకుంటే బాగుంటుంది. ఇప్పట్లో చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశాలు లేని ఈ రాజమండ్రి లోకల్‌ అపర చాణక్యుడి సేవలను ఉచితంగా వినియోగించుకోకుండా ఎంతో కొంత ఫీజు లేదా సంభావన ఆయన గారికి ఇస్తే వాసగిరి వేంకట లక్ష్మీనారాయణ గారికి, తెలుగు కాపు–బలిజ సముదాయానికి ఎంతో కొంత మేలే జరుగుతుంది. 

Related Articles

Latest Articles

Optimized by Optimole