Nancharaiah merugumala senior journalist:
ఇందిరా గాంధీ హయాంలో వేళ్లూనుకున్న కుహనా సోషలిజాన్ని, రాజీవ్ గాంధీ పాలనలో బలహీన పడిన కుహనా లౌకికవాదాన్ని కూకటి వేళ్లతో పీకేసి ‘హిందూ’ మహాసముద్రంలో కలిపారు పాములపర్తి వేంకట నరసింహారావు గారు. ఈ తెలుగు అపర చాణక్యుడు ప్రధాని పదవి నుంచి దిగిపోయిన 8 ఏళ్లకు అంటే–19 సంవత్సరాల క్రితం 2004 శీతాకాలంలో కన్నుమూశారు. దక్షిణాదికి చెందిన ఒకే ఒక బ్రాహ్మణ ప్రధానమంత్రిపై చరిత్ర తుది తీర్పు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఆయన పార్థివ శరీరానికి రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన అంత్యక్రియలు కూడా వివాదాస్పదం అయ్యాయి. మాజీ ప్రధాని చితికి నిప్పటించి అందరూ వెళ్లిపోయాక ఆయన శవం సగమే కాలిందని చూపిస్తూ ‘ఈనాడు’ దినపత్రిక ఫోటోలతో వార్త ప్రచురించింది. ఆయన జీవిత చరిత్ర రాసిన వినయ్ సీతాపతి కూడా ఈ విషయం తన పుస్తకంలో ప్రస్తావించారు. పీవీకి అసలు సిసలు కాంగ్రెస్ వారసుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ విషయంలో ఆయనే స్వయంగా చెప్పినట్టు చరిత్ర ‘దయ’తో ఆయన పాలనను చక్కగా విశ్లేషించే అవకాశం ఉంది. కాని, నరసింహారావు గారి ఐదేళ్ల పాలనకు అయోధ్యలో నిర్మాణం పూర్తవుతున్న ‘భవ్య రామమందిరం’ మాత్రమే స్మృతి చిహ్నంగా మిగిలిపోతుందేమో మరి. ఇక తెలంగాణ వరకూ చూస్తే– నరసింహారావు గారిని నాలుగుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపించి, ముఖ్యమంత్రిగా ఏడాదిన్నర (1971 సెప్టెంబర్–1973 జనవరి) పదవిలో ఉండే అవకాశం ఇచ్చింది మంథని అసెంబ్లీ నియోజకవర్గం. ప్రస్తుత మంథని కాంగ్రెస్ బ్రాహ్మణ ఎమ్మెల్యే, పౌరసరఫరాలు, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబును తెలంగాణ ప్రజలు మరో పదిహేనేళ్ళకైనా (69 ఏళ్ల వయసులో) ముఖ్యమంత్రి పీఠమెక్కిస్తే పీవీ నరసింహారావు, మంథని మరో మాజీ ఎమ్మెల్యే, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దెళ్ల శ్రీపాదరావుల ఆత్మలు శాంతిస్తాయి.