Appolitics:
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల ప్రభంజనం..
జగన్ జనబలాన్ని ఓట్లుగా మలిచే నేతలు కరువు..
ఖర్చుకు వెనకాడిన స్థానిక నాయకులు.. బలమైన అభ్యర్థుల ఎంపికలోనూ వైఫల్యం
వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ.. ఓటమి కారణాలపై పార్టీలో అంతర్గత చర్చ…
newsminute24/ pavan vootkur ✍🏽
ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసినప్పటికీ ఆ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని జగన్ పదేపదే చేసిన విమర్శలను ఓటర్లు పట్టించుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు పట్టం కట్టారు. వైసీపీని ఘోరంగా ఓడించారు.
కూటమిదే ఆధిపత్యం..
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయి. రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లకు గాను 12 కార్పొరేషన్లలో కూటమి పార్టీలు విజయం సాధించగా, వైసీపీకి కేవలం ఒక్క కార్పొరేషన్ మాత్రమే దక్కింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ కూటమి పార్టీలు 97 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకున్నాయి. వైసీపీ కేవలం మూడు మున్సిపాలిటీలకే పరిమితమైంది. చివరకు జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలోనూ వైసీపీకి పరాజయం తప్పలేదు. సొంత జిల్లా కడపలో సైతం ఆ పార్టీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఈ ఫలితాలు వైసీపీ నేతలు, కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేశాయి.
బలాన్ని ఓట్లుగా మార్చలేకపోయారా?
ప్రాంతీయ పార్టీలకు అధినేతే ప్రధాన బలం. జగన్ ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసినప్పటికీ ఆ బలాన్ని ఓట్లుగా మలచడంలో స్థానిక నాయకత్వం విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన ద్వితీయ శ్రేణి నాయకులు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గట్టి పోటీ ఉన్న స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడంలో పార్టీ విఫలమైందని తెలుస్తోంది. గెలుపు అవకాశాలున్న చోట కూడా సరైన అభ్యర్థుల ఎంపిక జరగకపోవడం పార్టీకి నష్టం కలిగించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఖర్చుకు వెనకాడిన స్థానిక నేతలు!
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు ఆర్థిక వనరులు, స్థానిక నాయకుల సహకారం కీలకం. అయితే కొన్ని ప్రాంతాల్లో వైసీపీ స్థానిక నాయకులు ఎన్నికల ఖర్చుకు వెనకాడినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించకపోవడం, ప్రచారంలో చురుగ్గా పాల్గొనకపోవడం, డబ్బుల పంపిణీ విషయంలో వెనుకంజ వేయడం వంటి అంశాలు పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీశాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బలమైన పోటీ ఉన్న స్థానాల్లోనూ సరైన వ్యూహంతో ముందుకు వెళ్లకపోవడం ఓటమికి మరో కారణంగా చెబుతున్నారు.
2024 ఎన్నికల నాటి పరిస్థితులే పునరావృతం!
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ ద్వితీయ శ్రేణి క్యాడర్ వ్యవహరించిన తీరు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పునరావృతమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేత ప్రచారం చేసినా క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయకపోవడం పార్టీకి నష్టం కలిగించిందని నేతలు చర్చించుకుంటున్నారు. అధినేత ఇచ్చిన పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లి, ఓటర్లను సమీకరించాల్సిన బాధ్యతను స్థానిక నాయకులు సరిగా నిర్వర్తించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకే ఒక్కడు సరిపోడు..
ప్రాంతీయ పార్టీలకు అధినేత ప్రధాన బలం అయినప్పటికీ, ఎన్నికల్లో విజయం సాధించాలంటే బలమైన స్థానిక నాయకత్వం, కార్యకర్తల సమన్వయం, ప్రజలతో నిరంతర సంబంధాలు అవసరం. పార్టీ జెండా పట్టిన కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరూ పార్టీ విజయానికి కృషి చేయాల్సి ఉంటుంది. అయితే నాయకత్వం, ద్వితీయ శ్రేణి నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తల మధ్య సమన్వయ లోపం వైసీపీకి ప్రతికూలంగా మారిందనే చర్చ సాగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వైసీపీకి భవిష్యత్తుపై ఆలోచించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈలోగా పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఓటమికి గల కారణాలను సమీక్షించుకోవడం, నాయకుల మధ్య సమన్వయాన్ని పెంచడం, బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడం, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపడం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాబోయే ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
