Kangana: ‘ఫ్యాషన్’ సినిమా.. కంగనా నటన.. ర్యాంప్ వాక్‌లో తప్పిదం..!

Kangana: ‘ఫ్యాషన్’ సినిమా.. కంగనా నటన.. ర్యాంప్ వాక్‌లో తప్పిదం..!

సాయి వంశీ ( విశీ) :

 2008లో విడుదలైన హిందీ సినిమా ‘ఫ్యాషన్’ చాలామందే చూసి ఉంటారు. మోడల్స్ జీవితంలోని పార్శ్వాలను అద్భుతంగా చూపించిన చిత్రం అది‌. ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ పోటాపోటీగా నటించారు. ఉత్తమ నటిగా, ఉత్తమ సహాయనటిగా ఇద్దరికీ జాతీయ పురస్కారాలు రావడం విశేషం.

ఆ సినిమాలో ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై నడుస్తున్న మోడల్ షోనాలి(కంగనా రనౌత్) వేసుకున్న బట్టలు ఉన్నట్టుండి తెగిపోతాయి‌‌. ఒక్క క్షణం ఆమె గుండె భాగం అంతా అక్కడున్న అందరికీ కనిపిస్తుంది (సినిమాలో ఆ సీన్ బ్లర్ చేశారు. ఇబ్బంది లేకుండా చూడొచ్చు). అయినా ఆమె బెదిరిపోకుండా, తడబడకుండా తన చేత్తో డ్రెస్‌ని గుండెకు అడ్డుపెట్టి, అలాగే ముందు వరకూ వెళ్లి, ఫొటోలకు ఫోజు ఇచ్చి తిరిగి బ్యాక్ స్టేజీకి వెళ్తుంది. ఆ తర్వాత విపరీతంగా ఏడుస్తుంది. కంగనా ఎంత గొప్పగా చేసిందో ఆ సీన్! ఇది నిజజీవితంలో జరిగిన ఘటన.

2006లో ముంబయిలో ‘లక్మే ఫ్యాషన్ వీక్’ సందర్భంగా కారల్ గ్రేసియాస్ అనే మోడల్ ర్యాంప్ వాక్ చేస్తుండగా ఉన్నట్టుండి ఆమె డ్రెస్ తెగిపోయింది. ఆమె గుండె భాగం అంతా కనిపించడంతో ఒక్క క్షణం అందరూ షాక్ తిన్నారు. అయితే కారల్ భయపడకుండా అలాగే డ్రెస్‌ని చేతులతో పట్టుకుని, గుండె భాగాన్ని కవర్ చేస్తూ వాక్ పూర్తి చేసింది. ఆ తర్వాత బ్యాక్ స్టేజీకి వెళ్లిపోయింది. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. సెన్సేషన్ కోసం కావాలనే నిర్వాహకులు ఈ పని చేశారని చాలామంది ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సైతం ఈ అంశం గురించి చర్చ జరిగింది. ప్రకాశ్ రాజ్‌దేవ్ అనే సోషల్ యాక్టివిస్టు ఈ విషయంపై కోర్టులో కేసు కూడా వేశారు. ఆ కార్యక్రమంలో జరిగిన ఘటనలో నిజానిజాలు తేల్చాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

ఈ ఘటన తర్వాత ర్యాంప్ వాక్ చేస్తున్న మోడల్స్ భద్రత గురించి నిర్వాహకులు తప్పక శ్రద్ధ తీసుకోవాలనే రూల్ వచ్చింది. ఇలాంటి అనుచితమైన విషయం జరిగితే వెంటనే లైట్లు ఆపేయాలని కూడా రూల్ తెచ్చారు. మోడల్స్ కూడా తమ దుస్తుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టారు. 2008లో ఇదే ఘటనను దర్శకుడు మాధుర్ భండార్కర్ తన ‘ఫ్యాషన్’ సినిమాలో చూపించారు.