Ayodhya: అయోధ్యలో కమలం ఎందుకు వికసించలేదు?

Ayodhya: అయోధ్యలో కమలం ఎందుకు వికసించలేదు?

సాయి వంశీ ( విశీ) : 

నిజమే! మొత్తం దేశానికి ఇదొక ప్రశ్న. రామమందిరం కట్టారు, బాలరాముణ్ని ప్రతిష్టించారు, ఊరూవాడా ఏకం చేసి సంబరాలు చేశారు. అయినా అక్కడ కమలం వికసించలేదు. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబా‌ద్‌ ఎంపీ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ 54,567 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇంత భారీ ఆధిక్యంతో విజయం సాధించడం చిన్న విషయం కాదు. అసలు ఏం జరిగింది? కమలలోచనుడు ఎందుకు కమలం మీద శీతకన్నేశాడు? నిజానికి ఇందులో ఎవరి మోసం, ద్రోహం ఏమీ లేదు. హిందువులు ఓట్లేయకుండా ఇళ్లల్లో కూర్చోలేదు. వారంతా ఓటు వేశారు. ఎటొచ్చీ కమలానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

అయోధ్యలో రామమందిరం 2.7 ఎకరాల్లో, చుట్టూ ప్రాంగణం మొత్తం 70 ఎకరాల్లో ఉంది. ఆలయ నిర్మాణం కోసం చుట్టూ ఉన్న అనేక ఇళ్లు, దుకాణాలను ప్రభుత్వం పడగొట్టింది. ఇలా చేసినప్పుడు అక్కడి వారికి పునరావాసం కల్పించడం సర్కారు బాధ్యత. కానీ చాలామందికి పునరావాసం అందలేదు. ఆలయం సమీపంలోని దుకాణాలను కూడా స్థానిక నాయకులు తమకు ఇష్టం వచ్చినవారికి కేటాయించారు. దుకాణాలు కోల్పోయినవారికి పరిహారం కూడా సరిగ్గా చెల్లించలేదు. దీనివల్ల బీసీలే కాదు, బ్రాహ్మణ, వైశ్య వర్గాలు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. వారంతా కమలానికి వ్యతిరేకంగా మారారు.

ఉత్తరప్రదేశ్‌లో యోగి అధికారంలో ఉన్నారు. కేంద్రంలో తాతయ్య(అంటే ఎవరో మీకు తెలిసిందే) తర్వాత కాబోయే ప్రధాని ఆయనేనన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనపై అసూయతో ఆయన్ని ముఖ్యమంత్రి పదవిలోనుంచి తొలగిస్తారన్న ప్రచారం జరిగింది. ఇది ప్రజల మీద ప్రభావం చూపింది. దీనికితోడు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. అందుకే గతంలో ఆ రాష్ట్రంలో 62 స్థానాలున్న కమలం ఇప్పుడు అందులో సగం సీట్లు కూడా రాని స్థితికి చేరింది.

ఫైజాబాద్ అన్ రిజర్వ్‌డ్ స్థానం. అక్కడ దళిత నాయకుడైన అవదేశ్ ప్రసాద్‌ను బరిలోకి దింపి సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎప్పుడైతే ఆ పని చేసిందో, వెంటనే దళిత, బీసీ వర్గాలు ఆ పార్టీని బలంగా నమ్మాయి. 78 ఏళ్ల అవదేశ్ ప్రసాద్‌ ఆ పార్టీలో సీనియర్ నేత. 1974 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అటువంటి వ్యక్తి తమకు ఎంపీ అవడం బాగుంటుందని అక్కడి ప్రజలు భావించారు.

ఎన్నికల ముందు అయోధ్యలో కొన్ని జాతీయ మీడియా సంస్థలు సర్వే నిర్వహించాయి. రామమందిరం నిర్మాణం తర్వాత మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని అక్కడి ప్రజలను ప్రశ్నించాయి.‌ గుడి కట్టడం ఆనందమే కానీ, మా జీవితాల్లో మాత్రం ఏ మార్పూ లేదని వారు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగం, ధరల పెరుగుదల, యోగి చేసిన బుల్డోజర్ చేష్టలు.. అన్నీ కలిసి కమలానికి వ్యతిరేకంగా మారాయి. అందుకే అయోధ్య రాముడు సైతం వారి చేజారిపోయాడు.