Hyderabad: సినిమా రంగం తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad:

హైదరాబాద్ పరిసర ప్రాంతమైన కోకాపేటలో దేశంలోని అతిపెద్ద డోల్బీ థియేటర్‌గా నిర్మితమైన ‘అల్లు సినిమాస్’ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్  కుటుంబం నిర్మించిన ఈ అత్యాధునిక థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం సినీ, రాజకీయ రంగ ప్రముఖుల సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… మాట్లాడుతూ సినిమా రంగం కూడా ఒక గొప్ప పరిశ్రమగా ఎదిగి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమను ప్రత్యేకంగా గుర్తించడంతో పాటు దాని అభివృద్ధికి అవసరమైన అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల తరహాలో సినిమా రంగం కూడా పెద్ద స్థాయిలో ఎదగాలని సీఎం అభిలాష వ్యక్తం చేశారు. సినిమాలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, జీవితంలో నిర్ణయాలు తీసుకోవడంలోనూ, సామాజిక దృక్పథాన్ని తీర్చిదిద్దడంలోనూ సినిమాల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.

హాలీవుడ్ సినిమాలను కేవలం చూడటం మాత్రమే కాకుండా, వాటికి పోటీగా నిలిచే స్థాయిలో మనం సినిమాలు నిర్మించగలగాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణలో సినిమా రంగం ఒక నాలెడ్జ్ హబ్‌గా ఎదగాల్సిన అవసరం ఉందని, అలా నాలెడ్జ్ హబ్ ఏర్పడినప్పుడే ప్రపంచ స్థాయి సినిమాలను రూపొందించగలమని పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ పాన్ ఇండియా స్థాయిని దాటి హాలీవుడ్‌తో పోటీ పడే స్థాయికి చేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

అల్లు అరవింద్ కుటుంబం ఎంతో అభిరుచితో నిర్మించిన ఈ అత్యాధునిక డోల్బీ థియేటర్ తెలంగాణకు మంచి పేరు తీసుకువస్తుందని సీఎం రేవంత్ రెడ్డి  అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ,ఎమ్మెల్యే కుందూరు జయవీర్, గీతా ఆర్ట్స్ అధినేత మరియు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ , తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు , ప్రముఖ నటుడు అల్లు అర్జున్ తదితర సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.

Optimized by Optimole