ముంబై క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసు.. రోజుకో ట్విస్టులు, పూటకో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే టార్గెట్‌గా ట్వీట్లు, ఆరోపణలు గుప్పిస్తున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌పై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి తర్వాత బాంబు పేల్చుతానని ముందే చెప్పిన ఫడ్నవీస్.. అనుకున్నట్టే మాలిక్‌కు దావూద్ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దావూద్ అనుచరుల నుంచి మాలిక్ చౌకగా ఆస్తులు కొన్నారని, ఆయనకు అండర్ వరల్డ్‌తో ఉన్న సంబంధాలపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని ఫడ్నవీస్ తెలిపారు.
సాక్షాత్తూ మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్.. నవాబ్ మాలిక్‌పై దావూద్ గ్యాంగ్ లింకులు ఉన్నాయని ఆరోపించడం ఇప్పుడు ముంబై డ్రగ్స్ కేసు మరో కొత్త మలుపు తీసుకుంది.
ఇటు.. ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే కూడా దూకుడు పెంచారు. నవాబ్ మాలిక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తన మరదలికి డ్రగ్స్ వ్యాపారాలతో సంబంధం ఉందని మంత్రి చేసిన ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టారు. ఇద్దరు పిల్లలు, కుటుంబం ఉన్న మహిళ పేరును మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ప్రస్తావించడం సరైనదేనా అంటూ ఎన్సీబీ అధికారి ప్రశ్నించారు. మాలిక్ చెప్పినట్టు 2008లో తాను ఇంకా సర్వీసులోకే రాలేదని.. నాటి కేసులో తనకెలాంటి సంబంధం లేదని సమీర్ వాంఖడే తెలిపారు.
ఇప్పటికే నవాబ్ మాలిక్‌పై సమీర్ వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్ బాంబే హైకోర్టులో 1.25 కోట్ల పరువునష్టం దావా వేశారు. దీంతో పాటు మాలిక్ చేసిన ఆరోపణలను కూడా వెనక్కి తీసుకోవాలని ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు మంత్రి నవాబ్ మాలిక్‌పై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. మొత్తానికి ముంబై క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసు ఊహించని మలుపులు, రాజకీయ రగడతో ప్రకంపనలు రేపుతోంది.