గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ దే!
జిహెచ్ఎంసి కొత్త పాలక వర్గం గురువారం కొలువుదిరింది. కొత్తగా ఎన్నికైన 149 మంది కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి (హైదరాబాద్ కలెక్టర్)శ్వేతా మహంతి నాల్గు భాషల్లో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్ ఎన్నిక నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ నుంచి బంజారాహిల్స్ కార్పొరేటర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా తార్నాక కార్పొరేటర్గా గెలిచిన మోతె శ్రీలత ఎన్నికయ్యారు. కాగా మేయర్ ఎన్నికకు టీఆరెస్ నుంచి విజయలక్ష్మి, బీజేపీ నుంచి రాధ పోటీపడ్డారు. మేయర్ కి కావాల్సిన సీట్లు(ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి) తక్కువగా ఉండడంతో ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంది. మేయర్ ఎన్నిక కోవిడ్ నిబంధనలు దృష్ట్యా కార్పొరేటర్లు చేతులెత్తే విధానంలో జరిగింది. ప్రిసైడింగ్ అధికారి మేయర్ అభ్యర్థిని ప్రతి పాదించిన వెంటనే కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా చేతులెత్తి మద్దతు తెలిపారు.
ఎవరి విజయలక్ష్మి..?
మేయర్ గా ఎన్నికైన విజయ లక్ష్మి రాజ్యసభ సభ్యుడు కేశవరావు కూతురు. బంజారాహిల్స్ నుంచి రెండోసారి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఆమె జర్నలిజం లో డిగ్రీ చేశారు. 18 ఏళ్ళు అమెరికాలో ఉన్న ఆమె డ్యూక్ వర్శిటీలో సహాయ పరిశోధకురాలిగా ఆమె పనిచేశారు. అనంతరం 2007 లో అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసుకున్నారు.