Nancharaiah merugumala senior journalist: (తెలంగాణ బీసీలకు ‘ఎక్కువ’ టికెట్లు హైదరాబాద్ పాత బస్తీలో ఇస్తుంటే..ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల్లోనే ఇవ్వడం ‘చక్కటి వ్యూహం’!)
=≠====≠========
పెద్దలు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్ ఇదివరకే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ తన మొదటి జాబితాలోని 12 మంది ఓబీసీల్లో ఐదుగురికి హైదరాబాద్ పాత నగరంలోని అసెంబ్లీ స్థానాల టికెట్లు కేటాయించి చేతులు దులిపేసుకుంది. 55 మంది అభ్యర్థుల తొలి లిస్టులో బీసీలకు డజను సీట్లు కేటాయించామని కాంగ్రెస్ బడా నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కాని, వాటిలో ఐదు పాత బస్తీలోనివే అంటే తెలంగాణ బీసీల తలల్లో మెదళ్లే లేవని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించిందని భావించక తప్పదు. అయినా, గెలవాలనే గట్టి పట్టుదల లేని తెలంగాణ కాంగ్రెస్ నేతల మానసిక స్థితి, వారి స్వార్ధ ప్రయోజనాలపై ఉన్న శ్రద్ధను పరిగణనలోకి తీసుకుంటే బీసీ నేతలకు టికెట్లు ఇచ్చే వ్యవహారం ఇలాగే ఉంటుంది. అదీగాక ఒకప్పుడు ‘సమరశీల’ రాజకీయ నేపథ్యం ఉన్న తెలంగాణ ఓబీసీలు అనేక ఆర్థిక, సామాజిక కారణాల వల్ల (చైతన్యరాహిత్యం) కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని గట్టిగా నిలదీసే శక్తిని కోల్పోయారు. కొన్నేళ్లయినా, కొన్ని సందర్భాల్లోనైనా, రంగారెడ్డి వంటి కొన్ని జిల్లాల్లోనైనా తూళ్ల దేవేందర్ గౌడ్ వంటి బలిసిన బీసీ నాయకుల వ్యూహాల కారణంగా– తెలంగాణ బీసీలకు అనుకూలమైన పార్టీగా కనిపించింది తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ అంతర్దానం కావడం కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆరెస్ ల రెడ్డి నాయకత్వాలను మరింత బలోపేతం చేసింది. కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ బీఎస్సీ అధ్యక్షుడు డా.ఆరెస్ ప్రవీణ్ కుమార్ వంటి దళిత నేతలు, ప్రజలకు పెద్దగా తెలియని మరో రాజకీయ పార్టీ నాయకుడైన ఎస్సీ నేత ఇటీవల పాదయాత్రలు చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్న విషయం కూడా తెలిసిందే. అలాంటి చలన శీలత, చైతన్యం ఉన్న బీసీ నేతలెవరూ తెలంగాణలో లేకపోవడం ఇక్కడి వెనుకబడిన వర్గాల దురదృష్టం.
ఉత్తరాంధ్రలో జనాభాలో మూడొంతులు ఓబీసీలే కాబట్టి అక్కడ వారికే టికెట్లు!
పూర్వపు ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల్లోని (విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం)లో బెస్తలు, గొల్లలు, గౌడలు, పద్మశాలీలు వంటి వృత్తిపరమైన బీసీలతో పోల్చితే ప్రాంతీయ వెనుకబాటుతనం వల్ల ఓబీసీ హోదా దక్కించుకున్న తూర్పు కాపు, కొప్పుల వెలమ, పొలినాటి వెలమ, కాళింగ, రెడ్డిక వంటి వ్యవసాయాధారిత బీసీల జనాభాయే చాలా ఎక్కువ. మొత్తం జనాభాలో ఈ ప్రాంతీయ ఓబీసీల జనాభా మూడొంతులు ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన రాజకీయపక్షాలూ ఈ మూడు జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాల్లోని ఓబీసీలకు అత్యధికంగా టిక్కెట్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నాయి. ఈ బాగోతం గత 50 ఏళ్లుగా నడుస్తున్నదే. ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ (కాళింగ), మంత్రులు బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు), ధర్మాన కృష్ణ దాస్ (పొలినాటి వెలమ), బూడి ముత్యాల నాయుడు (కొప్పుల వెలమ)–వీరంతా పైన చెప్పినట్టు ప్రాంతీయ వెనుకబాటుతనం వల్ల బీసీల జాబితాలో చేరిన ఆధిపత్య కులాల నేతలే. ఈ నలుగురితోపాటు ఈ ప్రాంతీయ ఓబీసీ కులాలకు చెందిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ లెక్కన ఈ మూడు ఉమ్మడి జిల్లాల అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక బీసీలకు టికెట్లు ఇచ్చేసి, ఏపీలో మొత్తంగా ఇంత మంది బీసీలకు శాసనసభ టికెట్లు ఇచ్చామని చెప్పే ధోరణి ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఇది బహిరంగ రహస్యమే. ఇలా ఏపీలో గెలిచే అవకాశాలున్న ఉత్తరాంధ్రలో పేరుకే బీసీలైన కులాల నేతలకు అక్కడి పార్టీలు టికెట్లు ఇచ్చి లెక్కలు చెబుతుంటే, అసలు హిందూ బీసీలకు విజయావకాశాలే లేని హైదరాబాద్ పాత నగరం సీట్లను ఓబీసీలకు ఇచ్చామని తెలంగాణ పార్టీలు ఘనంగా ప్రకటించుకుంటున్నాయి. ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయినా కొన్ని సామాజిక వర్గాల రాజకీయ ధోరణలు, ఎత్తుగడలూ రెండు చోట్లా ఒకేలా ఉండడంలో విశేషమేమీ లేదు.