×
In

 

నాథూరాం గాడ్సే  ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది జాతిపిత ‘మహాత్మాగాంధీ’ని హత్య చేసిన నేరస్తుడు! అసలు ఆయన ఆ హత్య ఎందుకు చేశాడు? చేయడానికి గల కారణం ? హత్యకు సంబంధించి గాడ్సే కోర్టుకి ఇచ్చిన వాంగ్మూలం ఏంటి? కోర్టు అతనికి ఉరి శిక్ష ఎందుకు వేసింది?

గాడ్సే కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం( అనువాదం)..

“నాకు కాంగ్రెస్ నాయకులతో భేదాభిప్రాయాలు ఉండేవి, ఇప్పుడూ ఉన్నాయి. ఇది నేను 28 ఫిబ్రవరి 1935న సావర్కర్ కి రాసిన ఉత్తరంలో విదితమౌతుంది.
నేడు కూడా నావి అవే అభిప్రాయాలు. గాంధీజీ తో నాకు శతృత్వం లేదు. పాకిస్తాన్ ఏర్పాటు విషయంలో ఆయన మనసు స్వచ్ఛమైనదని ప్రజలు అంటారు.
నా మనసులో దేశభక్తి తప్ప ఏమీలేదు అని చెప్పగలను. విభజన తరువాత ఏర్పడ్డ తీవ్ర భయానక పరిస్థితులు కేవలం గాంధీజీ వల్ల ఉత్పన్నం అయ్యాయని నేను భావిస్తాను. హత్య చేసిన తరువాత నాపై ప్రజలకి తీవ్రమైన వ్యతిరేక అభిప్రాయం ఏర్పడుతుందని తెలుసు. సమాజం లో నాకు ఉన్న గౌరవం అంతా తుడిచిపెట్టుకుపోతుంది, వార్తాపత్రికలు నన్ను దారుణంగా చిత్రీకరిస్తాయని కూడా తెలుసు, ఐతే నిజాన్ని భూస్థాపితం చేసేంతగా వాళ్ళు దిగజారిపోతారని ఊహించలేదు. వార్తాపత్రికలూ ఎప్పుడూ నిస్పక్షపాతంగా రాయలేదు.

వారు (దేశనాయకులు) ఒక మనిషి వ్యక్తిగత ఆలోచనలకి (గాంధీ) తక్కువ ప్రాధాన్యతనిచ్చి, దేశ శ్రేయస్సుకి గనుక ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటే, దేశ నాయకులు దేశ విభజనను మరియు పాకిస్తాన్ ఏర్పాటును ఆమోదించేవారు కాదు. వార్తాపత్రికలు కూడా నాయకుల పొరపాట్లను కప్పిపుచ్చేవి. దాని వలన దేశ విభజన సులువు ఐపోయింది. ఇలాంటి భ్రష్టు పట్టిన వార్తాపత్రికల వలన నా మనసును చలించనివ్వలేదు. పాకిస్తాన్ ఏర్పాటు కాకపోయి ఉంటే స్వతంత్రం వచ్చేది కాదు అని కొందరు వాదిస్తారు. నేను ఆ వాదనని అంగీకరించను. లీడర్లు తమ తప్పులని కప్పి పుచ్చుకోవడానికి ఈ వాదన ముందుకి తెచ్చారు. గాంధేయవాదులు తమ శక్తి తో స్వతంత్రం తెచ్చాము అంటారు. అదే నిజమైతే వారు బ్రిటిష్ వారి ‘పాకిస్తాన్ ఏర్పాటు’ ప్రతిపాదనని తమ శక్తితో ఎందుకు ఆపలేకపోయారు..?

నా దృష్టిలో గాంధీ మరియు ఆయన అనుచరులది ఒకటే వ్యూహం. ముందు వారి చెప్పినదాన్ని వ్యతిరేకించాలి, తరువాత కాస్త చర్చలు జరిపినట్టు ప్రజలకి చూపి ఆ పిదప ఒప్పుకున్నట్టు వ్యవహరించాలి. ఇలాగే పాకిస్తాన్ రూపురేఖల్ని కూడా అంగీకరించారు. 15 ఆగస్టు 1947 కపటపూర్వకముగా పాకిస్తాన్ ఏర్పాటును అంగీకరించారు. పంజాబ్, బంగాల్ మరియు సింధ్ ప్రాంతంలో నివసిస్తున్న హిందువుల గురించి ఎవరూ ఆలోచించలేదు. దేశాన్ని ముక్కలు చేసి ఒక మతపరమైన ముస్లిం దేశానికి తెరలేపారు. పాకిస్తాన్ ని వ్యతిరేకించిన వారందరిని మత మౌఢ్య శక్తులుగా అభివర్ణించారు. జిన్నామాటలు విని, మతం ఆధారంగా ఏర్పడ్డ దేశాన్ని మాత్రం గుర్తించారు.

ఈ పరిణామం వలన చాలా కలత చెందాను. పాకిస్తాన్ ఏర్పడిన పిదప భారత కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న హిందువుల భద్రతకై తగు చర్యలు చేపట్టి ఉంటే నా మనసు శాంతించి ఉండేది. పాకిస్తాన్ లోని కోట్లాది హిందువులని, వారి భద్రతని నీళ్ళు వదిలి, వారు పాకిస్తాన్ వదిలి రాకూడదు అని కాంగ్రెస్ వారు వాదించారు. అలా అక్కడి హిందువులు ముస్లింల కబంధ హస్తాలలో ఇరుక్కుపోయి దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నారు. నాకు ఇవి గుర్తుకు వచ్చినపుడు నా రక్తం ఉడుకుతుంది. ప్రతినిత్యం అక్కడ వేలాది హిందువుల హత్యలు జరిగేవి. 15,000 సిక్కులని తూటాలతో కాల్చి చంపేశారు. వేలాది హిందూ మహిళలని వివస్త్రలని చేసి నగ్నంగా ఊరేగించారు. వారిని పశువులు అమ్మినట్టు సంతలో అమ్మేవారు. ఇది భరించలేని లక్షలాది హిందువులు ఆస్తులు ఇళ్ళు వదిలి మతం మానం రక్షించుకోడానికి పారిపోవలసి వచ్చింది. వారి సంఖ్య ఎంత ఉందంటే వారు బారులు తీరి వస్తున్న గుంపు 40 కిలోమీటర్లు పొడవు ఉంది. దీనిని నివారించడానికి భారత ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టలేదు సరికదా అలా వచ్చేవారికి ఆకాశమార్గం ద్వారా ఆహారం వెదజల్లడం మినహా ఏమీ చేయలేకపోయింది.

ఈ అత్యాచారాలు ఆపమని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కి విన్నపం చేసినా లేక మీరు అత్యాచారాలు కొనసాగిస్తే ఇక్కడ ఉన్న ముస్లింల భద్రతకి భంగం కలగవచ్చు అని బెదిరించినా ప్రయోజనం ఉండేది. ఇవేమీ భారత ప్రభుత్వం చేయలేదు. భారత ప్రభుత్వం కేవలం గాంధీజీ కనుసైగల మీద నడిచేది. పూర్తి భిన్నమైన వైఖరితో ఉండేవారు గాంధీజీ. పాకిస్తాన్‌లో ఉన్న హిందువుల అత్యాచారాలపై వాస్తవాలు రాసిన పత్రికలని హిందూ-ముస్లింల మధ్య భేదాలు సృష్టించే పత్రికగా ముద్రవేసేవారు. వారిపై చట్టపరమైన అపరాధాలు నమోదు చేసేవారు. వాటిపై ప్రెస్ ఎమర్జెన్సీ యాక్ట్ అనుగుణంగా చర్యలు చేపట్టేవారు.
నాకు కూడా బోలెడు నోటీసులు వచ్చాయి. (ఆ రోజుల్లో) 16,000 రూపాయల జామీను అడిగారు. ఇలాంటివి 900 చర్యలు చేపట్టారని మొరార్జీ దేశాయి అన్నారు. ఇంతేకాదు ప్రెస్ కౌన్సిల్ సభ్యుల మాటలు అస్సలు ఖాతరు చేయలేదు.

హిందువులపై ఇన్ని అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్నా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా లేదా ముస్లింలకి వ్యతిరేకంగా గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవన్నీ చూశాక ఇక శాంతియుతంగా గాంధీగారిని ఒప్పించగలననే ఆశ సన్నగిల్లింది. పాకిస్తాన్ లో ముస్లింల చేతుల్లో అక్కడ హిందూ జాతి హిందూ సంస్కృతి నాశనం అవ్వడానికి మూల కారణం గాంధీ. సరైన రాజకీయ చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటి హిందూ సంహారం జరిగి ఉండేది కాదు. చరిత్రలో ఎన్నడూ హిందువులు ఇంతటి ఊచకోతకి గురికాలేదు. పరిశీలించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ముస్లింల సమస్యలని పరిష్కరించే సమయంలో గాంధీజీ హిందూ ప్రజల మనోభావాలని ఎన్నడూ గౌరవించలేదు.

అప్పటికే అహింస అనే ముసుగులో ఎంత రక్తపాతం జరిగిందంటే పాకిస్తాన్ పక్షాన ఇక ఏది వినడానికి కూడా భారత ప్రజలు సిద్ధంగా లేరు. ఎప్పటి వరకైతే పాకిస్తాన్ లో మత అహంకార పాలన కొనసాగుతుందో అప్పటివరకు భారత్ లో అశాంతి నెలకొని ఉంటుందన్నది స్పష్టం ఐపోయింది. అయినా గాంధీ ముస్లిం లీగ్ నేతల పట్ల పక్షపాత ధోరణితో పాకిస్తాన్ ని వెనకేసుకుని వచ్చేవారు. ఇలాంటి పరిస్థితులలో ఆయన పూర్తిగా ముస్లిం అనుకూల, హిందూ వ్యతిరేక షరతులతో ఆమరణ నిరాహార దీక్షకి దిగారు. ఆ షరతులు ఏమిటంటే, పాకిస్తాన్ నుండి తరిమివేయబడి, ఢిల్లీలో మసీదులలో ఆశ్రయం పొందిన హిందువులను తక్షణం ఖాళీ చేయించడం… ఈ షరతులతో నిరాహారదీక్ష పేరిట బెదిరించి ప్రభుత్వాన్ని ఒప్పించారు.

ఈ సంఘటనలు జరిగినప్పుడు ఢిల్లీలో ఉన్నాను నేను. అవి చలికాలం రోజులు, భారీ వర్షం పడుతుంది. పాకిస్తాన్ నుండి తరిమివేయబడ్డ వారు కట్టుబట్టలతో వచ్చారు, నిలువ నీడ లేదు, ఐనా ఆ వర్షం లో తీవ్రమైన చలిలో పసిపిల్లలతో సహా మసీదులు ఖాళీ చేయించారు. గాంధీ తన నిరాహారదీక్ష ద్వారా మంకుపట్టు పట్టి పంతం నెగ్గించుకున్నాడు. వారికి మరో ఆశ్రయం చూపే ప్రయత్నము చేయలేదు. వారిలో కొందరు గాంధీ నివాసం ఉన్న విలాసవంతమైన బిర్లా హౌస్ చేరి, తమకి ఆశ్రయం కల్పించమని కోరినా గాంధీ మనసు చలించలేదు. ఎంతటి కఠొరమైన వ్యక్తి మనసైనా ఇది చూస్తే మనసు కరిగిపోతుంది.
ఇది కళ్ళారా చూసిన నేను తట్టుకోలేకపోయాను. నా మనసు కకావికలం అయిపోయింది. ఈ శరణార్ధులు విలాసాల కోసం మసీదులలో ఉంటున్నారా?

నాయకులు చేసిన తప్పిదాలకి తమ ఇల్లు వాకిలి చెట్టు పుట్ట వదిలేసి ప్రాణమానాలు దక్కించుకోవడానికి వచ్చిన వారికి ఈ దుస్థితా అనిపించింది. విభజన కారణంగా సంభవించిన ఈ వాస్తవాలపై గాంధికి పూర్తి అవగాహన ఉంది. ఆదేసమయంలో అటు పాకిస్తాన్ లో ఒక్క గుడి గానీ ఒక్క గురుద్వారా గానీ సురక్షితంగా లేదు. తమ తమ ప్రార్ధన స్థలాలని ఎలా అపవిత్రం చేశారో శరణార్ధులు కళ్ళారా చూశారు. ఢిల్లీ కి వచ్చిన శరణార్ధులకి నిలువ నీడ లేనపుడు, వ్యర్ధంగా ఉన్న మసీదులలో ఉంటే తప్పు ఏమిటి? ఈ పరిస్థితులని కల్పించినది ఎవరు, దీనికి బాధ్యులు ఎవరు?

మానవతా దృక్పధం తో కూడా నిరుపయోగం గా ఉన్న మసీదులు వాడుకోకూడదు అని నిబంధనలు పెడితే ఎలా ? మంకు పట్టుపట్టి మసీదులు ఖాళీ చేయించిన గాంధీ మరో ప్రత్యామ్నాయం ఎందుకు చూపలేదు. గడ్డగట్టె చలిలో చెట్ల కింద జీవనం సాగించాల్సిన అవసరం వారికెందుకు. పాకిస్తాన్ లో ఉన్న దేవాలయాలు హిందువులకి అప్పగించాలని ఎందుకు గాంధీ కోరలేదు? దీనిని బట్టి గాంధీ అహింసావాదం ఒట్టి బూటకం అని తేలిపోయింది. తన నిరాహార దీక్ష విరమించడానికి పాకిస్తాన్ లో ఉన్న హిందువుల సంరక్షణకి ఎటువంటి షరతు విధించలేదు. ఒకవేళ షరతు విధించినా అక్కడ పాకిస్తాన్ లో ఉన్న ముస్లింలు ఖాతరు చేయరనీ, ఆయన చనిపోయినా వెంట్రుక పోయినంత బాధ కూడా వారికి ఉండదని ప్రపంచానికి తెలిసిపోయేది.

గాంధీ దీక్ష జిన్నాపై ఎటువంటి ప్రభావం చూపదని ఇదివరకే అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నారు. ముస్లిం లీగ్ వారు ఆయన్ని లెక్కచేయరని కూడా తెలుసు. (ఆఖరికి గాంధీ అస్థికల్ని భారత్ సహా పలు దేశాల్లోని వివిధ నదులలో కలిపినా, వారి కోసం పలుమార్లు నిరాహార దీక్ష చేసి హిందువుల మెడలు వంచిన పాకిస్తాన్ మాత్రం సింధునదిలో వాటిని కలపడానికి ఎంత ప్రాధేయపడినా అంగీకరించలేదు)

ఇక పాకిస్తాన్ కి ఇండియా ఇవ్వాల్సిన 55 కోట్ల పరిహారం, గాంధీ మంకుపట్టు విషయానికి వద్దాం… సర్దార్ పటేల్ మాటల్లోనే ఆయన ఏమన్నారో విందాం. ‘‘ఏ ప్రభుత్వాన్ని ఐనా వారి నిర్ణయం మార్చుకోమనడం చాలా కష్టం. కానీ భారత ప్రభుత్వం మాత్రం కాశ్మీర్ ని కుట్రపూరితంగా ఆక్రమించినందుకు పాకిస్తాన్ కి ఇవ్వాల్సిన 55 కోట్ల పరిహారం నిలిపివేసిన నిర్ణయాన్నిగాంధీ నిరాహార దీక్ష వలన మార్చుకోవలసి వచ్చింది. పాకిస్తాన్ కాశ్మీర్ పై దురాక్రమణ చేసి చాలా భూభాగాన్ని ఆక్రమించినందున 55 కోట్ల పరిహారం ఆపివేయాలని ప్రభుత్వం భారత ప్రజల ప్రతినిధిగా తీసుకున్న నిర్ణయం. ఆ భూభాగం భారత ప్రజలది, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి..’’ ఐతే కేవలం ఒక వ్యక్తి… ఒకే ఒక వ్యక్తి దీక్ష చేస్తాను అని మంకుపట్టు పట్టి బ్లాక్ మెయిల్ చేసినందువలన ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది ఇండియా. అపుడు నాకు అనిపించింది గాంధీ పాకిస్తాన్ పక్షపాతం ముందు భారత దేశ ప్రజల మనోభావాలకి విలువలేదు. ఎప్పుడూ గాంధీ పాకిస్తాన్ పక్షాన మాట్లాడేవారు. ఆయన్ని ఆపే శక్తి దేశంలో లేకపోయింది. ఇటువంటి పరిస్థితిలో హిందువులని ముస్లింల అత్యాచారాల నుండి కాపాడటానికి ఒకే ఉపాయం మిగిలిపోయింది. గాంధీని అంతమొందించడం మినహా మార్గం లేదు. గాంధీని ‘రాష్ట్రపిత’ అంటారు. కానీ ఆయన తండ్రి పాత్ర పోషించడంలో దారుణంగా విఫలం అయ్యారు. దయా దాక్షిణ్యం లేకుండా దేశాన్ని రెండు ముక్కలు చేసేసారు. ఆయన మనస్పూర్తిగా విభజనకి వ్యతిరేకంగా నిలబడినట్లైతే ముస్లిం లీగ్ గానీ బ్రిటిష్ వారు గానీ తలొగ్గక మరో మార్గం ఉండేది కాదు. దేశంలో చాలా శాతం విభజనకి వ్యతిరేకమే అయినా గాంధీ మాత్రం ఈదేశాన్ని మోసం చేశారు. అలా ఆయన పాకిస్తాన్ కి జన్మనిచ్చిన రాష్ట్రపిత అవుతారు గానీ యుగాలుగా ఉన్న భారత్ కు కాదు. ఆ విధంగా రాష్ట్రపిత అని పిలిపించుకుంటూ నా భారత్ ని ముక్కలు చేసిన వ్యక్తిని హత్య చేయడం ఈదేశ పుత్రుడిగా నా కర్తవ్యంగా భావించి గాంధీ హత్యకి పూనుకున్నాను….’’

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all
Optimized by Optimole