Nancharaiah merugumala senior journalist :(పోలింగ్ ముందు పార్టీ అభ్యర్థులకు రహస్యగా కోట్లాది రూపాయలు పంపే ఈ రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే బీ–ఫాంతోపాటు రూ.40 లక్షల చెక్కులు పింపిణీ చేసిన కేసీఆర్ నిజంగా కొత్త చరిత్ర రాసేశారా?)
=====================
పార్టీ అభ్యర్థులకు బీ–ఫాం ఇచ్చిన కొన్ని రోజులకు గుట్టుచప్పుడు కాకుండా, అత్యంత రహస్యంగా పది కోట్ల వరకూ పంపించే నేతలున్న దేశంలో… బీఆరెస్ అసెంబ్లీ కాండిడేట్లకు ప్రతి ఒక్కరికీ బీ–పారంతోపాటు రూ.40 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఏకైక ‘జాతీయపక్షం’ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారేనేమో! తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (తెరాస) పుట్టిన 20 ఏళ్ల తర్వాత భారత్ రాష్ట్ర సమితి (భారాస) గా మారడం వల్లే ఇంత మార్పు వచ్చిందా? ఒక్కొక్క అసెంబ్లీ అభ్యర్థి తరఫున కోట్లాది రూపాయలు ఖర్చు చేసే పాలకపక్షాలు కేసీఆర్ దారిలో కేవలం లక్షలకే..అదీ 40 లక్షలు మాత్రమే ఎన్నికల వ్యయం చేస్తే..ఎంత బాగుంటుంది? రేపు భారతదేశం ఏమి ఆలోచిస్తుందో..నేడు తెలంగాణం అదే అలోచిస్తుందంటే ఇదేనేమో మరి. ధనిక రాష్ట్రం తెలంగాణను దాదాపు తొమ్మిదిన్నరేళ్లు నిరాటంకంగా పరిపాలించిన పాలకపక్షం ఇలా పార్టీ అభ్యర్థులు 51 మందికి బీ–ఫారంతోపాటు రూ.40 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వడం ప్రపంచ పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలోనే బంగారం అక్షరాలతో రాయాల్సిన మంచి రోజు. తెలంగాణ జాతిపిత, తెలునాట పెద్ద పద్మనాయకుడు కేసీఆర్ గారికి తెలంగాణ శాసనసభ మూడో ఎన్నికల్లో వరుసగా మూడో విజయాన్ని ఏ రేవంత రెడ్డో, మరో కోమటిరెడ్డో లేదా తుమ్మల నాగేశ్వరరావో, జూపల్లి కృష్ణారావో తప్పించలేరనిపిస్తోంది. బతుకమ్మ పండగ తర్వాత వచ్చిన ఈ ఆదివారం తెలంగాణ చరిత్రను కొత్త మలుపు తిప్పుతోందంటే…ఇంకా కాదనేవారు ఉన్నారా? 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా టీఆరెస్ అభ్యర్థులు అందరికీ రూ.28 లక్షల చొప్పున బీఫామ్ తోపాటు చెక్కులు కేసీఆర్ ఇచ్చినా..అప్పుడు ఎందుకనో..ఈ విషయానికి పెద్ద ప్రచారం రాలేదు. అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిమితి రూ.40 లక్షలకు పెంచడంతో…చెక్కు సొమ్ము చాలా పెద్దగా కనిపిస్తోంది సగటు మానవులకు.