Nancharaiah merugumala senior journalist: (ఉదయంలో కొద్ది మాసాలు, ఈనాడులో సుదీర్ఘకాలం పనిచేసినా ..‘విమోచన’ ఎడిటర్–ప్రచురణకర్తగానే హెచ్చార్కే చాలా మందికి గుర్తు!)
===============
ఎంత కాదని చెప్పినా… ఏదైనా అవార్డు ప్రకటించినప్పుడు దానికి ఎంపికైన వ్యక్తిపై కొద్ది రోజులు చర్చ నడుస్తుంది. 2023 సంవత్సరానికి మీడియా విభాగంలో జీవనకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైన ఇద్దరిలో ఒకరైన హెచ్చార్కే గారు (కొడిదెల హనుమంత రెడ్డి) ఎక్కువ మందికి కవిగా, పాత్రికేయుడిగా తెలుసు. తెలుగు కవిత్వం లోతుపాతులు పెద్దగా అర్ధంగాని నాకైతే హెచ్చార్కే జర్నలిస్టుగానే కనపడతారు. ఆయనతో నాకున్న పరిచయం చాలా తక్కువ. 1984 చివర్లో కొత్త పత్రిక ‘ఉదయం’లో హెచ్చార్కే చేరినప్పుడు ఆయనను ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని హైదరాబాద్ ‘ఉదయం’ ఆఫీసులో మొదటిసారి చూశాను. అప్పుడు నేను ట్రెయినీ సబ్ ఎడిటర్. ఎవరో మిత్రుడు పరిచయం చేస్తే కొద్డిసేపు ఆయనతో మాట్లాడాను. ఆ మాటలు కూడా ఇప్పుడు గుర్తు లేవు. హెచ్చార్కేను పరిచయం చేసిన తోటి పాత్రికేయ మిత్రుడు ఆ తర్వాత నాతో మాట్లాడుతూ, ‘సీపీఐ–ఎంఎల్ పత్రిక ‘విమోచన’ ఎడిటర్, పబ్లిషర్ గా ఉన్న హెచ్చార్కే గారు ఉదయం పత్రికలో చేరడం విశేషమే,’ అని చెప్పడం ఇంకా గుర్తుంది. నేను అదే ఏడాది పత్రిక ప్రారంభానికి మూడు రోజులు ముందు బెజవాడ ఎడిషన్ కు బదిలీ అయ్యాను. మళ్లీ ఏడాదిన్నర వరకూ హెచ్చార్కే గారిని చూడలేదు. దాదాపు పాతికేళ్లు విజయవాడకే పరిమితమైన ఆంధ్రజ్యోతి దినపత్రిక హైదరాబాద్ ఎడిషన్ కోసం తీసుకున్న విజయవాడ ఉదయం యువ జర్నలిస్టుల బృందంలో నేనూ ఉన్నాను. 1986 ఏప్రిల్ నెలాఖరులో ఆంధ్రజ్యోతిలో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చి సెక్రెటేరియట్ ముందున్న ఈ పత్రిక ఆఫీసుకు వెళ్లి పని పూర్తిచేశాను. అప్పుడే ఉదయం ఎడిటర్ గా రాజీనామా చేసి హైదరాబాద్ ఆంధ్రజ్యోతి ఎడిషన్ లో అసోసియేట్ ఎడిటర్ గా చేరడానికి సిద్దమౌతున్న ఏబీకే ప్రసాద్ గారికి అక్కడికి దగ్గరలోని నాటి హోటల్ సరోవర్ లో ఉదయం పాత్రికేయ సిబ్బంది వీడ్కోలు కార్యక్రమం ఉందంటే ఆరోజు నేను మిత్రుడు, రచయిత ఎగుమామిడి అయోధ్యారెడ్డిగారితో కలిసి వెళుతున్నా. సరోవర్ ముందున్న సెక్రెటేరియట్ బస్ స్టాప్ దగ్గర హెచ్చార్కే గారు కనిపించగానే, ఆయనకు విషయం చెప్పి పలకరించి రెండు నిమిషాలు మాట్లాడాం. అప్పటికి కొన్ని వారాల ముందు సోమాజిగూడ ‘ఈనాడు’ దిన పత్రికలో సంపాదకీయం పేజీ చూసే సీఈబీ సభ్యుడిగా హెచ్చార్కే గారు చేరారని అప్పుడు అయోధ్యారెడ్డి గారు చెబితే తెలిసింది.
ఈనాడు ఎడిట్ పేజీలో తన సొంత పేరుతో, మానస లేదా సమత వంటి పేర్లతో హెచ్చార్కే గారు సమకాలీన అంశాలపై రాసిన మంచి వ్యాసాలు క్రమం తప్పకుండా చదివేవాణ్ని. అయితే, విమోచన ఎడిటర్ గా ఉన్న హెచ్చార్కే గారు ఉదయంలో చేరడమేంటి అనే మిత్రుడి మాటలు ఆయన వ్యాసాలు చదివినప్పుడల్లా గుర్తొచ్చేవి గాని ఎక్కువ మంది పాఠకులు చదివే పత్రికలో ఆయన బాధ్యతగల పదవిలో ఉండడం బాగుండేది. ఆ తర్వాత తొమ్మిదేళ్లకు హైదరాబాద్ వచ్చి కొత్తగా రానున్న ‘వార్త’ దినపత్రికలో 1995 ఆరంభంలో చేరాను. అప్పట్లో సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఇంకా ప్రెస్ క్లబ్ వంటి చోట్ల జరిగే రాజకీయ, సాహిత్య సదస్సులకు హాజరయ్యే అలవాటు ఉండేది. ఆ ఏడాది మార్చి నెలలో అనుకుంటా..సిటీ సెంట్రల్ లైబ్రరీలో కవి, అధ్యాపకుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారి కవితా సంకలనం ఆవిష్కరణ సందర్భంగా జరిగిన సమావేశానికి నేను ఎవరితోనో కలిసి వెళ్లాను. సీపీఐ ఎంల్ (పీపుల్స్ వార్) మాజీ సహ స్థాపకుడు, ప్రసిద్ధ కవి కేజీ సత్యమూర్తి గారు మాట్లాడిన తర్వాతో ముందో తెలీదుగాని హెచ్చార్కే గారు కూడా కొత్త పుస్తకం (తొవ్వ–పూర్తి పేరు గుర్తు లేదు)గురించి ప్రసంగించారు. ఆయన ఉపన్యాసంలోని మిగిలిన విషయాలు ఏమీ గుర్తులేవు, అయితే, సుంకిరెడ్డి గారి కవిత్వంలోని అభివ్యక్తి గురించి హెచ్చార్కే గారు చెప్పిన మూడు ముక్కలు నేను మర్చిపోలేదు. ‘ కోడి గుడ్డు పెట్టేదప్పుడు గుద్దలో నొప్పి ఏంటో దానికే తెలుస్తుంది గాని మనకు తెలయదు రా’ అని మా కర్నూలు జిల్లా ఊళ్లలో జనం అనుకునే విషయం మా నాయన ఓ రోజు చెప్పాడు,’ అని హెచ్చార్కే తన ప్రసంగంలో అన్న వాక్యాలు అప్పుడప్పుడూ కళ్ల ముందు కనిపిస్తుంటాయి. తర్వాత హెచ్కార్కే గారిని కలిసి మాట్లాడడం అసలు జరగలేదనే చెప్పాలి. కొద్ది మాసాలుగా ఫేస్ బుక్ లో మాత్రం మేం అప్పుడప్పుడూ కామెంట్ల ద్వారా ఇంటరాక్ట్ అవుతన్నాం. ఈ అక్టోబర్ మొదటి వారంలోనే పుట్టినరోజు జరుపుకున్న హెచ్చార్కే గారికి ఇలాంటి అవార్డు రావడం ఆయన రచనలపై తెలుగు పాఠకుల్లో ఆసక్తి పెంచడానికి దారితీస్తుందని అనుకుంటున్నా. జర్నలిస్టుగా, రచయితగా ఇప్పటికే మంచి పేరున్న హనుమంతరెడ్డి గారికి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం నికర విలువ లేదా నెట్ వర్త్ పెరిగిందంటే అతిశయోక్తి కాదు.