Indianconstitution: భారత రాజ్యాంగాన్ని ఇందిరమ్మ 1977లో గుర్తుచేస్తే..ఇప్పుడు మోదీ ఆ పని చేస్తున్నారు!

Nancharaiah merugumala senior journalist:

“భారత రాజ్యాంగాన్ని మొదట ఇందిరమ్మ 1977లో గుర్తుచేస్తే..ఇప్పుడు మోదీ ఆ పని చేస్తున్నారు! “

ఇందిరా గాంధీ 11 సంవత్సరాల పాలన తర్వాత, 21 నెలల (కొందరు 19 మాసాలని లెక్కిస్తారు) ఎమర్జెన్సీ అనంతరం…1977 మార్చ్ నెలలో నాటి ప్రతిపక్ష పార్టీలకు భారత రాజ్యాంగం, అందులోని ప్రాథమిక హక్కుల విలువ ఏమిటో అర్థమైంది. ఇందిరమ్మ పార్టీ నేత కాకపోయినా.. అమె అడుగుజాడలనే ఆదర్శంగా ఎంచుకున్న నరేంద్ర మోదీ దశాబ్ద పరిపాలన అనంతరం ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీకి, ఇతర ప్రతిపక్షాల నాయకులకు 2024 లోక్ సభ ఎన్నికలయ్యాక భారత రాజ్యాంగం ఎంతటి గొప్పదో పూర్తి అవగాహన కలిగినట్టు కనిపిస్తోంది. తన అయ్యమ్మ 1975 జూన్ – 1977 ఫిబ్రవరి మధ్య కాళ్ల కింద పడేసి తొక్కిన భారత రాజ్యంగ ప్రతిని రక్షణ కవచంలా చేతబూని రాహుల్ తిరగడం చూడచక్కని దృశ్యం నేడు. ఇందిర కడుపున మూడో కొడుకుగా పుట్టాల్సిన నరేంద్రభాయ్.. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 74 సంవత్సరాలకు భారత సంవిధానం ప్రాధాన్యం ప్రజలందరికీ తెలిసేలా చేయడం ఈ గుజరాతీ తేలీ ప్రధాని సాధించిన చిరు విజయం అనుకోక తప్పదు.

Optimized by Optimole