అరుదైన రికార్డు సొంతం చేసుకున్న కెప్టెన్ మిథాలీ రాజ్..

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఆరు వరల్డ్ కప్ లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు సచిన్‌ టెండూల్కర్‌, జావెద్‌ మియాందాద్‌ మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. కాగా ఆమె ఇప్పటికే 2000, 2005, 2009, 2013, 2017 వరల్డ్‌కప్‌లలో ఆడింది. ప్రస్తుతం నేడు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఆమె.. ఆరు వరల్డ్‌కప్‌ల అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
 ఇక వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ మొత్తం 31 మ్యాచ్‌ల్లో 54.23 సగటుతో 1139 పరుగులు చేసింది. రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో జట్టుకు నాయకత్వం వహించిన ఏకైక మహిళా క్రీడాకారిణిగా మిథాలి నిలిచింది. ఆమె సారథ్యంలోని భారత జట్టు 2005, 2017 సంవత్సరాల్లో రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ కప్‌లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత మొదటి క్రికెట్ ప్లేయర్గా.. ప్రపంచంలో ఐదవ క్రీడాకారిణిగా మిథాలీ నిలిచింది.

మొత్తానికి చివరి వరల్డ్‌కప్‌ ఆడుతున్న మిథాలీ.. ట్రోఫీ గెలవాలన్న ఆకాంక్ష మాత్రం ఇంకా నెరవేరలేదు. ఈ సారైనా ట్రోఫీ గెలిచి ఆమె వీడ్కోలు ఇవ్వాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది.