Indira Gandhi: మంత్రగత్తెను రాళ్లతో కొట్టి చంపినట్టే.. ఇందిరను బులెట్లతో నింపారు..!

Nancharaiah merugumala senior journalist:

మంత్రగత్తె ముద్రేసి రాళ్లతో కొట్టి చంపినట్టే ఢిల్లీలో ప్రధాని ఇందిరను 40 ఏళ్ల క్రితం బులెట్లతో నింపారు

ప్రథమ భారత ప్రధాని ఏకైక బిడ్డ ఇందిరాగాంధీ 1966 శీతాకాలంలో ప్రధానమంత్రి పదవి చేపట్టే నాటికి పదేళ్ల నిండడానికి దగ్గర్లో ఉన్న మా తరం తెలుగోళ్లు చాలా మందికి ఆమె ఇప్పటికీ చిక్కుముడిగానే కనిపిస్తోంది. 1971 లోక్‌సభ ఎన్నికల నాటికి టీనేజీ పిల్లలమైన మాకు అప్పుడు ఇందిరాగాంధీ గెలవాలని అనిపించింది. నాలుగేళ్ల తర్వాత ఆమె భారతదేశాన్ని అంతర్గత శత్రువుల నుంచి కాపాడానికి భారత రాజ్యాంగాన్ని టెంపరవరీగా పాతరేశారు. ఎమర్జెన్సీ కాలంలో కాలేజీల్లో మేం నోరుతెరిస్తే తోటి విద్యార్ధులు, ‘ఎడాపెడా మాట్టాడొద్దురా. ఇది ఎమర్జెన్సీ. తన్ని బొక్కలో తోస్తారు,’ అనే వాళ్లు. దాంతో రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బిచ్చమేసి ఆకట్టుకోవడం…ఇలాంటి ‘ప్రగతిశీల చర్యలన్నీ’ మాకు కనిపించకుండా పోయాయి. ఇక ఇందిర అంటే భారత ప్రజల శత్రువు, రాజ్యంగాన్ని పనిచేయకుండా చేసిన రాక్షసి అనే భావన మాలో బలపడింది. దీనికి తోడు మేం పుట్టినప్పటి నుంచీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పరిపాలనే సాగడం, 1952 నుంచీ కేంద్రంలోనూ 1977 మార్చి వరకూ నిరాటంకంగా కాంగ్రెస్‌ ఏలుబడే ఉండడంతో ఇందిరను, కాంగ్రెస్‌ను ఒకే గాటనకట్టి ద్వేషించడం మాకు చాలా ఇష్టమైన వ్యాపకంగా మారిపోయింది.

1977 పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ భారత ప్రజలు కాంగ్రెస్‌ను, ఇందిర–సంజయ్‌ గాంధీలను వారి నియోజకవర్గాల్లో ఓడించినా తెలుగు ప్రాంతాలు 42కు 41 లోక్‌సభ సీట్లలో గెలిపించడం, 1978 శాసనసభ ఎన్నికల్లో తొలిసారి హస్తం గుర్తుతో బరిలోకి దిగిన కాంగ్రెస్‌–ఐని గెలిపించడంతో ఆమెలో తెలుగోళ్లు కాంగ్రెస్‌ పార్టీకి బానిసలు అనే భావన బలపడింది. అందుకే 1983 జనవరి మొదటి వారం పోలింగ్‌ జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆరో ఎన్నికల ప్రచారంలో ఇందిరమ్మ నాటి తెలుగుదేశం స్థాపకుడు, సినీ హీరో ఎన్‌ టీ రామారావు గారి పేరు కూడా ఒక్కసారీ ఉచ్చరించకుండా అందర్నీ ఆశ్చర్యపరిచారు. నెహ్రూ గారమ్మాయిలో అహంభావం లేదా బలుపు ఏ స్థాయిలో అప్పుడు ఉందంటే…‘‘ ముఖానికి రంగులేసుకోవడమే వృత్తిగా పెట్టుకున్నవాళ్లు మిమ్మల్ని ఓట్లడగడానికి వచ్చి ఏపీ అంతటా తిరుగుతున్నారు. వారి మాటలకు మోసపోకండి,’’ అని ఒక ఎన్నికల సభలో ప్రధాని హోదాలో ఇందిర మాట్లాడింది. దాంతో ఆ ఎన్నికల్లో తిరుపతితోపాటు అప్పట్లో తన సొంతూరు నిమ్మకూరు అంతర్భాగంగా ఉన్న గుడివాడ నుంచి కూడా పోటీచేసిన ఎన్టీఆర్‌ 1982 డిసెంబర్‌ 29 ఎన్నికల బహిరంగసభలో మాట్లాడుతూ, ‘‘ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు నా పేరు ప్రస్తావించకుండా నన్ను ముఖానికి రంగులేసుకునేవాడు అన్నారు. అయితే, ఆమె మొకాన్ని, నా ముఖాన్ని పక్కపక్కనబెట్టి చూస్తే…ఎవరి ముఖానికి ఎంత ఎక్కువ రంగు పూసి ఉందో మీకు తెలిసిపోతుంది, ’’ అని జనాన్ని ఊర్రూతలూగించే రీతిలో ప్రసంగించారు. ఆ సభకు వెళ్లిన నా వంటి అనేక మందికి ఎన్టీఆర్‌ మాటలు ఇంకా చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. ఇందిర పగబడితే ఎంతటి ప్రమాదికారో తెలియని రాజకీయ అమాయకుడు ఎన్టీఆర్‌. అందుకే 1983 జనవరి 9న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన దగ్గర్నుంచీ ఆయన తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడానికి ఇతర ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ఉత్తరాదిన తరచు ప్రతిపక్షాల సదస్సులు నిర్వహించేవారు. ఈ క్రమంలో ఒక రోజు హైదరాబాద్‌ నుంచి విమానంలో ఢిల్లీ పోతుండగా తనతో పాటు ప్రయాణిస్తున్న మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారికి నమస్కారం చేసి పలకరించారు రామారావు. వెంటనే, ‘‘రామారావ్, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే పనిని నువ్వు ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది. ఆమె సంగతి నీకు తెలీదు. పగబడితే, అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది,’’ అని నీలం రెడ్డి హెచ్చరించారు. దానికి ఎన్టీఆర్, ‘‘ నా ప్రయత్నాలు, పంథా మార్చుకోను. ఇందిరకు భయపడను. దేనికైనా సిద్ధమే, రెడ్డి గారూ,’’ అన్నారు. తెలుగు రెడ్డి ముఖ్యమంత్రుల్లో రెడ్డితనం నరనరానా నింపుకున్న నీలం చెప్పినట్టే 1984 ఆగస్టులో మెజారిటీ ఉన్నా ఎన్టీఆర్‌ సర్కారును ఇందిర బర్తరఫ్‌ చేయించారు. ఎన్టీఆర్‌ అప్పుడు జనం, రాజ్యాంగం మద్దతుతో మళ్లీ సీఎం అయిన సంగతి తెలిసిందే.

ఇది జరిగిన రెండు నెలల లోపే 1984 అక్టోబర్‌ 31 తన అధికార నివాసంలో ఇందిరాగాంధీ తన సిక్కు అంగరక్షకుల మర తుపాకుల నుంచి వచ్చిన బులెట్లకు ప్రాణం కోల్పోయారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో అప్పట్లో నచ్చని మహిళలను మంత్రగత్తె అని మద్ర వేసి చంపినట్టే 16 సంవత్సరాలు భారత ప్రధానిగా పనిచేసిన ఇందిరమ్మను ఒక మైనారిటీ ధర్మాన్ని నమ్మే కొందరు చంపేశారా? అనే అనుమానం మాలాంటి ఎందరికో వచ్చింది. ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా నాకు గుర్తుకొచ్చిన విషయాలివి.