INC: ‘మహా’త్యాగం కాంగ్రెస్‌కు సాధ్యమా..?

Maharashtraelection2024:

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకి మరో అవకాశమే! అలసత్వం వల్ల హర్యానాలో చేజారిన అసెంబ్లీ గెలుపును ఒడిసిపట్టేందుకే కాకుండా కూటమిగా ‘ఇండియా’ను భవిష్యత్తులో బలోపేతం చేసేందుకు ఈ ఎన్నిక ఒక సవాల్‌. ఆ సవాల్‌ను స్వీకరించడానికి అవసరమైన గట్టి సైద్దాంతిక పునాది పార్టీకుంది. ఏఐసీసీ బెంగళూర్‌ ప్లీనరీ (2001) నుంచి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల మౌంట్‌అబూ భేటీ (2002) దాకా.. జరిగిన మేధోమధనంలో, రాజకీయ తీర్మానాల్లో, విధాన ప్రకటనల్లో చెప్పింది ఇపుడు ఆచరిస్తే చాలు! 2004 ఎన్నికల్లో సాధ్యమైంది ఇప్పుడెందుకు కాదు? జమ్మూ-కశ్మీర్లో దక్కిన గెలుపు హర్యానాలో ఎందుకు చేజారింది? పొత్తుల్లో పెద్దన్న పాత్ర పోషించే కాంగ్రెస్‌ కొంచెం త్యాగనిరతి, మిత్రపక్షాలతో ఇంకొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణి చూపితే.. సొంత రాజకీయ లబ్ది మాత్రమే కాక వచ్చే నాలుగేళ్లలో భారత రాజకీయాలను మలుపుతిప్పే చోధకశక్తి కాగలుగుతుంది. తమ గెలుపు కన్నా కూటమి విజయం, ఆ రెంటికన్నా బీజేపీని ఓడించడం లక్ష్యం అయితేనే సత్ఫలితమని ఎన్నికల చరిత్ర చెబుతోంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే సమూలంగా మార్చివేసిన భారతీయ జనతాపార్టీ ఈ ఎన్నిక కోసం ఎప్పుడో సన్నద్దమైపోయింది. నిన్న ముగిసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారానికి తెరపడ్డప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో పర్యటిస్తూ రాజకీయ ప్రసంగం చేయడం ఇందుకు నిదర్శనం. ఇలా ఎప్పుడూ ఏదో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగింపునకు రాగానే, తర్వాత ఎన్నికలు జరగాల్సి (బాకీ) ఉన్న రాష్ట్రంలో తమ అగ్రనేత-దేశ ప్రధాని పర్యటించేంత పకడ్బందీగా పార్టీ ఎన్నికల ప్రణాళిక రచించడం ఒక్క బీజేపీకే చెల్లింది. మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఇప్పుడిప్పుడే కదలిక మొదలెట్టింది. కాంగ్రెస్‌ సన్నద్దతపైన ఆ పార్టీ విజయమొక్కటే ఆధారపడి లేదు. బీజేపీకి, దాని నేతృత్వంలోని ఎన్డీయేకు సవాల్‌ విసురుతున్న ‘ఇండియా’ విపక్ష కూటమి బలం పుంజుకోవడం కూడా కాంగ్రెస్‌ మంచి-చెడుల పైనే ఆధారపడి ఉంది, ముఖ్యంగా కాంగ్రెస్‌ ప్రవర్తన మీద!

కట్టలు తెగిన రాజకీయ చైతన్యం…!

మహారాష్ట్ర, రెండు కూటములకు కూడా ఎంతో కీలకమైన రాష్ట్రం. పైపెచ్చు దేశ ఆర్థిక రాజధాని ముంబాయి కొలువుదీరిన రాష్ట్రం కావడంతో రాజకీయ విరాళాల పరంగా కూడా కూటములకు ఇది కామధేనువే! ప్రతి కూటమిలోనూ కనీసం మూడేసి ముఖ్యమైన భాగస్వామ్య పక్షాలున్నాయి. బీజేపీతో శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) లు జట్టుకట్టి ఏర్పడ్డ ‘మహాయుతి’ కూటమి ఎన్డీయే శిబిరంలో ఉంటే, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న శివసేన (ఉద్దవ్‌ థాక్రే), ఎన్సీపీ (శరద్‌ పవార్‌)ల ‘మహా వికాస్‌ ఆఘాడి-ఎమ్వీయే’ కూటమి ఇండియా శిబిరంలో ఉంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర సంక్లిష్ట రాజకీయాల్లో కూటమి విజయాలన్నవి భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తుల సాఫల్యతను బట్టి ఉంటాయి. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా… హాలివుడ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తూ, 2019 ఎన్నికల తర్వాత ఎన్నో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. కలిసి ఎన్నికల్లో పోరిన బీజేపీ, శివసేన పార్టీలు గెలిచి కూడా సర్కారు ఏర్పరిచే సఖ్యత కుదరక విడిపోయాయి. ఎన్సీపీ-కాంగ్రెస్‌ జోడీతో చేతులు కలిపి శివసేన ‘ఎమ్వీయే’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త పొత్తులతో ఏర్పడ్డ ఎమ్వీయే ప్రభుత్వం కొంత కాలానికే కుప్పకూలింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ‘చొరవ’ తీసుకొని, శివసేన చీలికవర్గం (తమదే అసలు శివసేన అంటారు) నేత ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొంత కాలం తర్వాత, ఎన్సీపీ నుంచి చీలి వచ్చిన (వీరిది అదే రాగం) అజిత్‌ పవార్‌ను ఉపముఖ్యమంత్రిని చేసి, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఈ చీలకలు మహారాష్ట్ర ప్రజలకు నచ్చినట్టు లేదు, అందుకే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాలక కూటమికి చుక్కెదురైంది. 48 లోక్‌సభ స్థానాలకు గాను మహాయుతికి 17 స్థానాలు దక్కితే ఎమ్వీయే 30 స్థానాల్లో నెగ్గి సత్తా చాటింది.

కీడు చేయకుంటే చాలు…

ప్రతిష్ట పరంగా దేశ రాజకీయాల్లో బాగా పలుచపడిపోయిన కాంగ్రెస్‌ ఎన్నికల్లో ‘ఓట్ల సాధన’లోనూ విఫలమౌతోంది. గొప్ప విజయాలు ఎక్కడా నమోదు కావటం లేదు. కానీ, కూటమి రాజకీయాల్లో విపక్ష కేంద్రకంగా… ఉన్నంతలో మంచి ఫలితాల సాధనకు ఆ పేరు పనికొచ్చింది. ఇదివరకటిలా కాకుండా, రాహుల్‌గాంధీ రాజకీయంగా కొంత రాటుదేలుతున్నాడనే భావన ప్రజాక్షేత్రంలో వ్యక్తమౌతోంది. పొత్తుల్లో కొన్ని సార్లే కాంగ్రెస్‌ లాభపడ్డా, ఆ సానుకూల వాతావరణం వల్ల మిత్రులకు మేలు కలిగిన సందర్భాలే ఎక్కువ. 2004 తర్వాత మళ్లీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అది కొట్టచ్చినట్టు కనిపించింది. పొత్తుల్లో పట్టువిడుపులు లేకుండా కాంగ్రెస్‌ మొండికేసిన చోట, వారి వల్ల మిత్రులు నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబట్టి ఎక్కువ సీట్లు తీసుకొని, తక్కువ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ కారణంగానే, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కోల్పోయారనే భావన అత్యధికుల్లో ఉండిరది. 243 స్థానాల్లో మ్యాజిక్‌ నంబర్‌ 122 అయితే ‘మహా ఘట్‌బందన్‌’ 110 వద్ద ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు 12 సీట్లు తగ్గాయి. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ 19 చోట్ల మాత్రమే నెగ్గింది. నిన్న ఏ మాత్రం తేడా వచ్చినా జమ్మూకశ్మీర్‌లో ఒమర్‌ ఫరూక్‌ పరిస్థితి అట్లానే ఉండేది! 90 సీట్లకు, పొత్తుల్లో 51 చోట్ల పోటీ చేసి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 42 చోట్ల నెగ్గితే, 32 స్థానాలు తీసుకొని (మరో 5 చోట్ల స్నేహపూర్వక పోటీలో ఉండి) 6 చోట్ల మాత్రమే కాంగ్రెస్‌ నెగ్గింది. హర్యానాలో, ‘ఇండియా’ కూటమి పక్షమైన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి పొత్తుల్లో పది స్థానాలు (90లో) ఇవ్వడానికి వెనుకాడిన కాంగ్రెస్‌, వారు దాదాపు అంతటా పోటీ చేయడానికి పురిగొల్పింది. సమాన ఓటు వాటా (సుమారు 40 శాతం) పొందిన బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య సీట్ల తేడా 11 (48`37) మాత్రమే! కానీ, ఆప్‌ కు సుమారు 2 శాతం ఓటు వాటా లభించింది.

తగ్గితే తప్పేంటి..?

క్షేత్రంలోని వాస్తవిక బలం తెలుసుకొని, పొత్తుల్లో కొంచెం తగ్గితే వచ్చే నష్టమేంటి? ఈ సంస్కృతి కాంగ్రెస్‌ మరచిపోతోంది. ఇటువంటి పరిస్థితే లోగడ తలెత్తినపుడు… సోనియాగాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వెనుకంజకు సిద్దపడిరది. ‘బీజేపీని, దాని నేతృత్వపు ఎన్డీయేను గద్దె దించడానికి ప్రతి యుద్దం ప్రకటించాలి, ప్రతి పోరూ సాగించాలి, ఏ త్యాగానికైనా సిద్దపడాలి’ అని బెంగళూర్‌ (2001) లో జరిగిన ప్లీనరీలో నిర్ణయించారు. ఆ మేరకు రాజకీయ తీర్మానం ఆమోదించారు. 2002 మౌంట్‌అబూ లో జరిగిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల కాంక్లెవ్‌లో, ఈ పంథాకు సోనియాగాంధీ మరింత స్పష్టత ఇచ్చారు. ‘‘చాంధసవాదుల్ని గద్దె దించడానికి లౌకిక శక్తుల్ని ఏకం చేయాలి……. మన లక్ష్యం to సొంతంగా ప్రభుత్వం ఏర్పరచడమే, కానీ, అవసరమైతే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకూ మనం సంసిద్దంగా ఉండాలి’’ అని ఆమె ఉద్బోదించారు. నేను స్వయంగా విని, రిపోర్ట్‌ చేసిన, 1997 కలకత్తా ప్లీనరీలో సీతారాం కేసరి అధ్యక్షోపన్యాసం… ‘‘ఇది సంకీర్ణాల శకం అనుకోనవసరం లేదు. కాంగ్రెసే ఓ విజయవంతమైన సంకీర్ణం. మనకు ఏ పార్టీలతో పనిలేదు. సొంతంగా సర్కారు ఏర్పరిచే సత్తా మనకుంది….’’ అన్న ఆలోచనాసరళి దిశనే సోనియాగాంధీ పూర్తిగా మార్చేశారు. దీనికి, 1999 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ కొత్త పాఠాలు నేర్చుకోవడమే కారణం. వివిధ రాజకీయ పార్టీల్లో నెలకొన్న ‘కాంగ్రెస్‌ వ్యతిరేక ధోరణి’ తారాస్థాయికి చేరి, అప్పుడు తేలిక్గా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ‘‘పొత్తులతో మాత్రమే కాంగ్రెస్‌ గెలువగలదు…’’ అని ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ 2003 డిసెంబరులో ఇచ్చిన నివేదికతో సోనియా ఈ దిశలో మరింత క్రియాశీలమయ్యారు. 2004 ఎన్నికల్లో దాన్ని పక్కాగా అమలుపరచి, ఎన్నికలు గెలిచి, కాంగ్రెస్‌ నేతృత్వంలో విజయవంతంగా ‘ఐక్య ప్రగతిశీల Ravi కూటమి’ (యూపీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ‘త్యాగాలు’ అనే మాట ఊరకే రాలేదు. తన భర్త రాజీవ్‌గాంధీ హత్యలో భాగముందని కాంగ్రెసే స్వయంగా విమర్శించిన డీఎంకే తో తమిళనాడులో, ఆమె జాతీయతనే ప్రశ్నించి కాంగ్రెస్‌ను చీల్చిన శరద్‌పవార్‌ నేతృత్వపు ఎన్సీపీతో మహారాష్ట్రలో ఆమె పొత్తులకు సిద్దమయారు. బీజేపీ తన పంథామార్చి, సఖ్యతకు తలుపులు తెరచిన కమ్యూనిస్టులతో జతకట్టి యూపీయేను విజయతీరాలకు చేర్చారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో చేతులు కలిపి ఎన్నికలు పోరి గెలిచారు. ఈ పంథాయే ఇప్పుడు కాంగ్రెస్‌కు శరణ్యం.

‘చేయి’ చాపొచ్చు…స్నేహాలకు.

2029 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పట్నుంచే రాజకీయ పునరేకీకరణలకు కాంగ్రెస్‌ వ్యూహరచన చేయొచ్చు. బీజేపీతో ముఖాముఖి తలపడే రాజస్తాన్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖాండ్‌ వంటి రాష్ట్రాలు సరేసరి! మహారాష్ట్ర, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌, జార్ఖండ్‌, కేరళ వంటి రాష్ట్రాల్లో మరింత వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ కూటములను బలోపేతం చేసుకోవచ్చు. ఇతర ‘ఇండియా’ పక్షాలు లేని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిషా వంటి రాష్ట్రాల్లో కొత్త మిత్రుల్ని వెతుక్కోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన బీజేపీ పంచన చేరిన పరిస్థితుల్లో మాజీముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో, 40 శాతం స్థిరమైన ఓటుబ్యాంకులతో ఉన్న వైఎస్సార్సీపీని కాంగ్రెస్‌ మచ్ఛిక చేసుకునే అవకాశం ఉంది. అక్కడక్కడ ప్రాంతీయ శక్తుల చేవతగ్గి, సంకీర్ణ శకం`ద్విదృవ రాజకీయాలు బలపడుతున్న పరిస్థితుల్లో …. కాంగ్రెస్‌ స్నేహ ‘హస్తం’చాచడం వారికే మంచిది. అయితే, వారే పేర్కొన్నట్టు ‘త్యాగాల’కు సిద్దమైతే తప్ప పొత్తు ధర్మం పొద్దు పొడవదు, రాజకీయ ఫలం సిద్దించదు!

============

dilip reddy

దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ ఎనలిస్ట్‌, డైరెక్టర్‌ పీపుల్స్‌పల్స్‌, సర్వే రీసెర్చ్‌ సంస్థ