Religion: మతం ఉంది. దానితో చాలామందికి పేచీ లేదు. కానీ అందులోని ఆచారాలు మనుషుల హక్కులను లాగేస్తున్నప్పుడు, నిస్సహాయులను చేస్తున్నప్పుడు అందరికీ పేచీ ఉంటుంది. ఉండాలి! ఏడో శతాబ్దంలో ఆవిర్భవించిన ఇస్లాం మతంలో అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అనేక ఆచారాలు రూపొందాయనేది అందరికీ తెలిసిందే.
ఇస్లాంలో భార్య తన భర్త నుంచి విడిపోయేందుకు ‘ఖులా’ ఉంది. భర్త తన భార్య నుంచి విడిపోవాలంటే మనందరికీ తెలిసిన ‘తలాఖ్’ ఉంది. ఒకవేళ అలా విడిపోయిన భార్యాభర్తలు మళ్లీ కలవాలంటే? అక్కడ వచ్చింది చిక్కు. భర్త నుంచి విడిపోయిన స్త్రీ తిరిగి అతణ్ని చేసుకోవాలంటే, మధ్యలో మరొకరిని పెళ్ళి చేసుకోవాలి. అతనితో ఒక రోజైనా పరిపూర్ణ వివాహ జీవితం గడిపిన తర్వాతే విడాకులిచ్చి ముందు భర్తను మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. ఈ నియమం పురుషులకు లేదు. దీన్ని ‘నిఖా హలాలా'(Nikaah Halala) అంటారు. ప్రవక్త ఆదేశాల మేరకు ఇది ధర్మవిరుద్ధమైనా అనేక దేశాలు ఈ ఆచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి.
2011లో K. P. Suveeran అనే దర్శకుడు బ్యారీ భాషలో ‘బ్యారీ’ అనే సినిమా తీశారు. దక్షిణ కర్ణాటక, కేరళ సరిహద్దులో మాట్లాడే ఆ భాషకు లిపి లేదు. ఆ భాషలో వచ్చిన తొలి సినిమా ఇది. ‘నిఖా హలాలా’ వల్ల మహిళలు పడుతున్న మానసిక ఇబ్బందుల గురించి చెప్పే కథ. నటి మల్లిక(‘నా ఆటోగ్రాఫ్’ సినిమాలో విమల పాత్ర చేసిన నటి) ఇందులో నాదిరా అనే ముస్లిం మహిళ పాత్ర పోషించారు. ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు చూసి జాతీయ చలనచిత్ర పురస్కారాల కమిటీ జ్యూరీ ప్రత్యేక పురస్కారం అందించింది.
భర్తకు, తండ్రికి జరిగిన గొడవ కారణంగా తన ప్రమేయం లేకుండానే భర్త చేత విడాకులు పొందిన నాదిరా అప్పటికే ఓ బిడ్డ తల్లి. కొన్నేళ్ల తర్వాత తండ్రి తన తప్పు తెలుసుకుని కూతుర్ని, అల్లుడినీ కలపాలని చూస్తే మతాచారాలు అపేశాయి. మతం ప్రకారం అన్ని విధులూ చేపడితేనే మళ్లీ వాళ్లు కలిసేది. లేకపోతే లేదు. ఒక బిడ్డ తల్లిని పెళ్లి చేసుకుని, రెండ్రోజులు ఉండి తలాఖ్ చెప్పి వెళ్లిపోయేది ఎవరు? ఎక్కడ దొరుకుతారు? డబ్బులిస్తే వస్తారా? ఒక ఆడదాని జీవితం అంటే ఇంత చులకనా? అంతా మగవాళ్ల ఇష్టమా? మతాచారాలన్నీ మగవాళ్ల కోసమేనా? అక్కడ ప్రశ్న మొదలవుతుంది. నాదిరా ఆలోచన మారుతుంది.
నాదిరాను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోతే చివరకు ఆమె చిన్ననాటి స్నేహితుడు పెళ్లి చేసుకుంటాడు. అందరూ తృప్తిపడతారు. లాంఛనానికి తొలిరాత్రి పడగ్గది ఏర్పాటు చేస్తారు ‘ఇదంతా కేవలం ఆచారం కోసమే! నిన్ను నేను ముట్టుకోను. రేపు నువ్వు నీ భర్తను పెళ్లి చేసుకోవచ్చు’ అని ఆమెతో అంటాడతను. ఆమె నవ్వుతుంది. ‘మనం ఈ తతంగాలు చేసి మనుషుల కళ్లు కప్పగలమేమో కానీ దేవుడి కళ్లు కాదు. ఆయన దృష్టిలో మనిద్దరం భార్యాభర్తలం. మన బంధం పరిపూర్ణమయ్యాకే మనం తీసుకునే విడాకులకు ఆయన దృష్టిలో విలువ’ అంటుంది. అతను భయపడతాడు. ఆమె అతణ్ణి గట్టిగా పట్టుకుంటుంది. ఈ ముగింపు నన్ను భయపెట్టింది. ఒకానొక స్థితిలో స్త్రీలు ఆచారాల మీద, మగవారి మీద నిరసనను ఎంత ధైర్యంగా వ్యక్తం చేస్తారో చూసి వణికాను.
ఈ సినిమా కథ తాను రాసిందే అని, తన నవల ‘చంద్రగిరియ తీరదల్లి’ ఆధారంగా ఈ సినిమా తీశారని కన్నడ రచయిత్రి డా.సారా అబూబకర్ కోర్టులో కేసు వేయడం అప్పట్లో సంచలనమైంది. ఆ నవలను ‘నాదిరా’ పేరుతో చూపు కాత్యాయని గారు తెలుగులోకి అనువదించారు. ఈ సినిమా నెట్‌తో దొరకదు. ఎప్పుడైనా దూరదర్శన్‌లో వేస్తే చూడాల్సిందే!