PawanKalyan:వామనుడిలా వైసీపీని అథఃపాతాళానికి తొక్కేస్తాం: పవన్ కళ్యాణ్

TDPjanasena:

సిద్ధం… సిద్ధం… అంటున్న వైఎస్ జగన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో మరిచిపోలేని యుద్ధం ఇద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అన్నారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, వీటన్నింటికీ సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. జనసేన- తెలుగుదేశం పార్టీల పొత్తు గెలివాలి… జగన్ పోవాలని పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడులో జనసేన – తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా తెలుగు జన విజయ కేతనం “జెండా” భారీ బహిరంగ సభ నిర్వహించారు.  పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు ఈ వేదిక నుంచి నాయకులకు, శ్రేణులకు, ప్రజలకి అభివాదం చేసి ఇరు పార్టీల జెండాలను రెపరెపలాడించారు.

ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ… “మన పోరాటానికి, విజయానికి స్ఫూర్తి జెండా. 2024 సార్వత్రిక ఎన్నిల్లో ఇరు పార్టీల పొత్తు విజయానికి స్ఫూర్తిగా ఈ సభకు జెండా అని నామకరణం చేశాం. ఎలక్షన్ బూత్ ల్లో వైసీపీ రౌడీలు, గూండాలు దౌర్జన్యాలకు పాల్పడితే ఇదే జెండా కర్రతో వాళ్లకు బుద్ధి చెప్పొచ్చు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రోడ్లు అద్దాల్లా మెరిసిపోతున్నాయని, చదువులు పూర్తవ్వగానే విదేశాల్లో ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, మర్డర్లు, మానభంగాలు సినిమాల్లో తప్ప బయటెక్కడా లేవని వైసీపీ నాయకులు చెబుతున్నారు. రోడ్లు మీద ప్రయాణించాలంటే రోజుల సమయం పడుతోంది. అందుకే ఆర్థికంగా కొంచెం కష్టమైనా హెలికాఫ్టర్లు తీసుకొచ్చి తిరుగుతున్నాం. ఓజీ పారితోషికంతో రాజకీయ సభలకు వెళ్తున్నా.

ఆ ఐదుగురూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.

మాట్లాడితే క్లాస్ వార్ … క్లాస్ వార్ అని మాట్లాడే జగన్… రాష్ట్రాన్ని ఐదుగురికి తాకట్టు పెట్టాడు.  జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి… వీళ్లయిదుగురు ప్రాంతాలతో సంబంధం లేకుండా పంచాయతీలు చేస్తూ కోట్లు కొల్లగొట్టి మనల్ని తిప్పలు పెడుతున్నారు. దీనిపై ఎవరైనా మాట్లాడితే వాళ్లపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.  వైసీపీ గూండాయిజాన్ని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక నేను, రాజకీయ ఉద్ధండులు  చంద్రబాబు  ఉన్నాం. మా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలను బెదిరించినా… తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలను భయపెట్టాలని చూసినా మక్కెలు విరగొట్టి మడత మంచం మీద పడుకోబెడతాం. 

వామనుడిలా అథఃపాతాళానికి తొక్కుతాం

నేను తీసుకునే నిర్ణయాల్లో నా వ్యక్తిగత స్వార్థం ఉండదు. రాష్ట్ర, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయి. ప్రజాకంటకుడి పాలన నుంచి ప్రజలను విముక్తి చేయడానికే పొత్తు నిర్ణయం తీసుకున్నాను. రాజకీయాల్లో సహకారం, సంఘర్షణ పక్కపక్కనే ఉంటాయి. 2024 సహకరించాల్సిన సమయం.  మనం సహకారం అందించకుంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతుంది. మనలో మనం కలహించుకుంటే ప్రజాకంటకుడు మళ్లీ పీటమెక్కుతాడు. చంద్రబాబు లాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకున్నాం అంటే దానికి ఒక కారణం ఉంది. ఆయన ఒక నగరాన్ని నిర్మించిన వ్యక్తి. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను తీసుకురాగలరు. ఆయన అనుభవం రాష్ట్రానికి మేలు చేస్తుందని పొత్తు పెట్టుకున్నాం.

పొత్తులో భాగంగా 24 శాసనసభ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అని వైసీపీ వాళ్లు మాట్లాడుతున్నారు. వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే… బలి చక్రవర్తి కూడా వామనుడు మూడు అడుగులు అడిగితే ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి అథఃపాతాళానికి  తొక్కితే కాని దాని లోతు ఎంతన్నది తెలియలేదు. రేపు ఎన్నికల ఫలితాల్లో కూడా వైసీపీ వాళ్లకు మనం ఎంతన్నది తెలుస్తుంది. ఇంతింతై వటుడింతయై అన్న చందంగా వైసీపీని అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు… నా పార్టీ జనసేన పార్టీ కాదు. 

మోడీ  అప్పుడే చెప్పారు ..

జగన్ మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఎవరైనా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. ఈ ముఖ్యమంత్రి రాజధాని వికేంద్రీకరణ చేశాడు. నేను మరోసారి ఉద్ఘాటిస్తున్నాను… ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధాని. 2014లో నరేంద్రమోదీ  చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రాను స్కాం ఆంధ్రాగా మారుస్తాడని. ఈ రోజు రాష్ట్రాన్ని దోపీడీ ఆంధ్రాగా జగన్ మార్చాడు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి లేక వలసలు వెళ్లిపోతున్నారు. ఎంతసేపూ సంక్షేమం అందిస్తున్నాం… సంక్షేమం అందిస్తున్నాం అని మాట్లాడుతున్నారు. మీ తాత సంపాదించిన ముల్లె నుంచి ప్రజలకు ఇస్తున్నావు. ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టి.. మీదేదో ఇచ్చినట్లు బిల్డప్ ఎందుకు? సీపీఎస్ పేరిట ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు. ఇళ్లపట్టాల పేరుతో ప్రజలను మోసం చేశాడు. ప్రజల వద్దకే పాలన అంటూ భీమ్లా నాయక్ సినిమాకు కలెక్టర్లతో సినిమా టికెట్లు అమ్మించడం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదు. యువత కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. రూ. 10 వేలు చేతిలో పెట్టే ముఖ్యమంత్రి కావాలా? లేక మీరు రూ.లక్ష సంపాదించే మార్గం చూపించే ముఖ్యమంత్రి కావాలా? మీరే నిర్ణయించుకోండి.  మనం చిన్న ఉద్యోగం చేయాలంటే కాండాక్ట్ సర్టిఫికేట్ కావాలి. ముఖ్యమంత్రి, గుండా ఎమ్మెల్యేలకు కాండాక్ట్ సర్టిఫికేట్ అవసరం లేదా? మనల్ని పాలించే వాడు మనకంటే ఉన్నతంగా ఉండాలి. అంతే తప్ప దొంగల్ని, దోపిడీదారులను ఎన్నుకుంటే మనమే బాధపడాల్సి వస్తుంది. 

సలహాలు, సూచనలు కాదు… యుద్ధం చేసేవాళ్లు కావాలి

ముఖ్యమంత్రి జగన్ లా మన దగ్గర లక్షల కోట్ల ఆస్తులు లేవు. తెలుగుదేశం పార్టీలా అనుభవం ఉన్న వ్యవస్థలు లేవు. నియోజకవర్గానికి రూ. 50 కోట్లు ఖర్చు చేసే నాయకులు లేరు. ఇటుక ఇటుక పేర్చి ఇళ్లు కడుతున్నాం. అతి త్వరలోనే కోట కడతాం. సామాన్యుడి రాజకీయం చేస్తే వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. అధికారం ఎప్పుడు వాళ్ల కోటలోనే ఉండాలనుకుంటున్నారు. మనం వ్యూహాలు వేస్తే భరించలేకపోతున్నారు. సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో వైసీపీకి చూపిస్తాం. పొత్తులు పెట్టుకుంటాం… వైసీపీ ఫ్యాక్షన్ కోటలు బద్ధలు కొడతాం. నాకు సలహాలు సూచనలు అవసరం లేదు. యుద్ధం చేసే నాయకులు కావాలి. జగన్ దాష్టీకానికి ఎదురొడ్డి నిలబడే యువత కావాలి. నాకు సలహాలు ఇచ్చే వాళ్లకు ఒకటే చెబుతున్నాను. సొంత బాబాయ్ ని హత్య చేసినవాడు.. తోడబుట్టిన చెల్లిని గోడకేసి కొట్టినవాడితో యుద్ధం చేస్తున్నాం. మనం యుద్ధం చేస్తేనే జగన్ లాంటి దుర్మార్గుడు తగ్గుతాడు. యుద్ధం చేసి కూలగొడితేనే మూల కూర్చుంటాడని పవన్ స్పష్టం చేశారు.