Nancharaiah merugumala senior journalist:
ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్య వంటి జాతి రత్నాలు అవసరం లేని స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎగిసిపడుతున్న కాపోత్సవం!
అటు చూస్తే కాపు ‘జాతి’ నాయకుడు, తూర్పు గోదావరికి చెందిన ముద్రగడ పద్మనాభం (71) గారు గురువారం జనసేన నేత కొణిదెల పవన్ కల్యాణ్ గారిపై లేఖాస్త్రం సంధించారు. ఇటు చూస్తే కాపు జాతి రాజకీయ రత్నంగా పరిగణించే చేగొండి హరిరామ జోగయ్య గారు (ఏప్రిల్ వస్తే వయసు 87) తన సలహాలు తీసుకోకపోతే కమ్మ–కాపు రాజకీయ అలయన్స్ లో (తెలుగుదేశం–జనసేన కూటమి) కాపుల పరిస్థితి అధోగతే అంటూ పవర్ స్టార్ కు గడువులతో కూడిన హెచ్చరికలు జారీచేస్తున్నారు. మరో వైపు కాపు, కమ్మ కులాల ముద్దుబిడ్డ వంగవీటి రాధాకృష్ణ గారిని తెలుగుదేశం తరఫున ఎన్నికల్లో పోటీచేయనీయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి మచిలీపట్నం నుంచి భారత పార్లమెంటు కొత్త భవనం మెట్లెక్కించి లోపలికి పంపడానికి సొంత జాతితో బలమైన అనుబంధం లేని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ఉరఫ్ నాని తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. కొద్ది మాసాల క్రితం వంగవీటి రాధాకృష్ణను కాశీ తీసుకుపోయి ఆయన తండ్రికి పిండాలు కూడా దగ్గరుండి పెట్టించిన కొడాలి నాని కమ్మ–కాపు కులాల వారధిగా నిరూపించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు (ఇదంతా గుడివాడలో తన గెలుపు కోసం కాదా?). ఇంకో పక్క గుంటూరు నుంచి వైఎస్సార్సీపీ తరఫున లోక్ సభకు పోటీచేసే అభ్యర్థి మరో కాపు కురువృద్ధుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (88) కొడుకు వెంకట రమణ కాకపోవచ్చని, ఆయన అల్లుడు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యను అక్కడ నిలబెట్టే అవకాశముందని కూడా వార్తలొస్తున్నాయి. 1952 నుంచీ ఏలూరులో మాదిరిగానే గుంటూరులో కూడా కాపు అభ్యర్థి ఎవరూ లోక్ సభకు ఎన్నికైన సందర్భం లేదు. మళ్లీ పవన్ కల్యాణ్ విషయానికి వస్తే అన్ని రాజకీయపార్టీల్లో పనిచేసిన గొప్ప అనుభవం ఉన్న కాపు జాతీయ నాయకులు ముద్రగడ, చేగొండి హరిరామజోగయ్యలు అసలు జనసేనాని మేలు కోరుకుంటున్నారా? లేక తమ మాదిరిగా కల్యాణ్ బాబు కూడా చివరికి కాపు జాతి నాయకుడిగా మిగిలిపోవాలని కుట్రలు పన్నుతున్నారా? అనే అనుమానం ఉభయ గోదావరి జిల్లాలు సహా కోస్తా జిల్లాలకు చెందిన కాపు యువకులను చాలా గట్టిగా పీడిస్తోంది.
‘కాపు జాతి’ అనే మాటను తొలిసారి వాడిన ముద్రగడను పట్టించుకునే నాథుడే లే డు..!
కాని, తూ.గోదావరి జిల్లా ఆలమూరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి తర్వాత కాపులను కులం పేరుతో సమీకరించి వారిలో చైతన్యం మండించిన ముద్రగడ పద్మనాభం గారు తనకు, తన కొడుక్కీ అసెంబ్లీ టికెట్ల కోసం రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రాంతీయపక్షాల నేతలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రాధేయపడడం– కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల వారికి కొంత బాధ కలిగిస్తోంది. అయితే, ఈ పరిణామాలు కాపు జాతిలో వచ్చిన వినూత్న మార్పులకు, ఈ జాతికి ఆంధ్రా పాలిటిక్సులో పెరుగుతున్న ప్రాధాన్యానికి అద్దంపడుతున్నాయి. ఏ రాజకీయ సిద్ధాంతాన్ని, రాజకీయపక్షాన్ని నమ్మకుండా కేవలం సొంత జాతిపై భరోసా పెట్టుకున్న ముద్రగడ గారు చివరికి ఎవరికీ కాకుండా పోయారు. పాత సొంత అసెంబ్లీ నియోజకవర్గం ప్రత్తిపాడులో యాదవులు సహా అనేక బీసీ కులాల జనానికి ఆయన ఈ కాపు గోలతో శాశ్వతంగా దూరమయ్యారు. అలాగే వయసు రీత్యా డాక్టర్ ఉమ్మారెడ్డి గారి తర్వాత రెండో కాపు కురువృద్ధుడైన చేగొండి హరిరామజోగయ్య గారు ఎనిమిదిన్నర పదులు దాటాక కూడా సకల కాపు కులాల సాధికారతకు, సంక్షేమానికి సలహాలిస్తానంటే ఈరోజున పట్టించునే నాథుడే లేడు. తమ నర్సాపురం–పాలకొల్లు కాపు బెల్టులో కుటుంబ మూలాలున్న పవన్ కల్యాణ్ కూడా జోగయ్య గారి మాటలను పెడచెవినబెట్టి, తనకు, తన పార్టీకి ఎవరి సలహాలతో పని లేదనీ, కాపులకు ద్రోణాచార్యుడు, వశిష్ఠుడు వంటి రాజగురువుల అవసరం లేదన్నట్టు మాట్లాడడం కాపు రాజ్యాధికార రాజకీయాలు 2008–2011 నాటి కొణిదెల చిరంజీవి, పీఆర్పీల ఎత్తుగడలను, ప్రమాణాలను, పోకడలను దాటి చాలా చాలా ముందుకొచ్చేశాయని స్పష్టమౌతోంది.