Kannadamovie: అవును! అంగట్లో ఆడయంత్రాలు దొరికితే బాగుండు. కుంజి ఇవ్వగానే బొమ్మ తిరిగినట్టు, ఇవ్వమనగానే మగబిడ్డను కని మొగుడి చేతిలో పెట్టే ఆడయంత్రాలు దొరికితే ఎంత బాగుండు! మీరు దేవుళ్లని నమ్ముతారా? విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సత్యకాలపు మనుషులు. శ్రీవల్లిని కన్నారు. సుబ్రహ్మణ్యస్వామికి ఇచ్చి పెండ్లి చేశారు. మిగిలిన ఏ దేవుళ్లూ ఆడపిల్లల జోలికి పోలేదు. మేరీ గర్భవతి అయ్యి, మొదట యేసుక్రీస్తునే కన్నది కానీ ఆడబిడ్డను కనలేదు. జనం గుళ్లు కట్టి పూజించే దేవుళ్లకే ఆడపిల్లలు లేరు. ఇక మనుషుల్ని ఏమనేది? ఆడపిల్లల కని, పెంచి, సాకి సంతరించమని ఎలా చెప్పేది?
కోస్తా కర్ణాటక ప్రాంతానికి చెందిన జులేఖా మూగపిల్ల. నిరుపేద కుటుంబం. అన్నీ ఉన్న పిల్లలకే పెళ్లి చేయడం తలకు మించిన భారమైన కాలం ఇది. ఇంక మాటలు రాని ఆ పిల్లకు పెళ్లి చేయాలంటే ఇంటివారికి ఎంత కష్టం. వెతగ్గా వెతగ్గా సులేమాన్ దొరికాడు. నలుగురు అక్కాచెల్లెళ్లకు ఒక్కడే తోబుట్టువు. వాళ్ల పెళ్లిళ్లు చేసేసరికి అతని తాతలు దిగొచ్చారు. బతుకు గడిచే మార్గం లేదు. దుబాయి వెళ్లి నాలుగు రాళ్లు సంపాదిస్తేనే ఆదరువు. అందుకే తనకు కట్నంగా వీసా డబ్బు ఇవ్వాలని అత్తవారికి షరతు పెట్టాడు. ఒప్పుకున్నదే చాలు అనుకొని ఎలాగోలా ఆ డబ్బు తెచ్చిచ్చారు అత్తామామలు. జులేఖా, సులేమాన్ ఒక్కటయ్యారు. ఆరునెలలు అత్తారింట్లో గడిపి, గర్భవతి అయిన భార్యని అక్కడే వదిలి ఒంటరిగా దుబాయ్ విమానం ఎక్కాడు సులేమాన్. వెళ్లే ముందు భార్యకి గట్టిగా ఓ మాట చెప్పాడు.
‘నలుగురు అక్కాచెల్లెళ్లకు పెళ్లి చేసేసరికి నాకు చుక్కలు కనిపించాయి. ఇంక చాలు. మళ్లీ ఆ అవస్థలు పడలేను. నువ్వు పదిమందిని కన్నా సంతోషమే. కానీ ఆ పదిమందీ మగపిల్లలే కావాలి’ అన్నాడు. అతని న్యాయం అతనిది. ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడమంటే మాటలా? మూటలకు మూటల డబ్బు కావాలి. తల తాకట్టు పెట్టాలి. అనేక పర్యాయాలు తలదించుకోవాలి. ఇదంతా తన వల్ల కాదని అతని వాదన. కానీ కడుపులో బిడ్డను మోసే జులేఖాకు అది ఆడో, మగో ఎలా తెలుస్తుంది? మగబిడ్డను మాత్రమే కనే విద్యను ఎవరు కనిపెట్టారు? ఎవరి దగ్గర నేర్చుకోవాలి? తొలి ప్రసవం ఆడదానికి గండం అంటారు. కానీ మొగుడి మాటలు అంతకన్నా పెద్ద గండంగా అనిపించాయి జులేఖాకు.
నెలలు నిండాయి. ఆడపిల్ల పుట్టింది. గండం మొదలైంది. దుబాయ్‌లో ఉన్న సులేమాన్‌కు ఈ సంగతి చెప్పాలి. కానీ విన్న వెంటనే ఫోన్‌లోనే ముమ్మారు తలాఖ్ అని తెగదెంపులు చేసుకుంటే? తనకు ఆ బిడ్డ, ఆ బిడ్డను కన్న తల్లి.. ఇద్దరూ వద్దని అనేస్తే? దుబాయ్‌లో మరో నిఖా చేసుకుంటే? జులేఖా ఇంటివారి గుండె గొంతులోకి వచ్చింది. ఆ క్షణానికి గండం గడిచేదెట్టా? మొత్తానికి ఫోన్ చేశారు. బిడ్డ పుట్టిందన్నారు. ‘మగబిడ్డ పుట్టి ఉంటుంది. నాకు ముందే తెలుసు. వాడికి నా ఫేవరేట్ హీరో సల్మాన్ ఖాన్ పేరు పెట్టండి’ అని సంతోషంగా అన్నాడు సులేమాన్.
అతని ఆనందం ముందు వారి గొంతు మూగబోయింది. ఈ క్షణానికి ప్రమాదం తప్పింది అనుకున్నారు. పుట్టింది ఆడపిల్ల కాబట్టి ‘సల్మాన్’లోని మొదటి రెండు అక్షరాలు తీసుకొని ‘సల్మా’ అని పేరు పెట్టారు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కాలం ఊరికే ఉంటుందా? ముందుకు పరుగెడుతూనే ఉంటుంది. పిల్ల పెరిగి పెద్దదయ్యింది. ఐదేళ్ల తర్వాత తండ్రికి ఊరికి రాబోతున్న వార్త తెలిసి గంతులేసింది. కానీ ఇంట్లోవారికి హడల్. ఇన్నేళ్లు దాచిన నిజం ఇప్పుడెట్లా చెప్పేది? చెప్తే ఏం జరుగుతుంది? జులేఖా బతుకు ఏమవుతుంది? ఇంట్లో వారితోపాటు చుట్టుపక్కలవారికీ భయమే. ఆలోచించగా.. ఆలోచించగా ఉపాయం తట్టింది. ఐదేళ్ల సల్మాకు జుట్టు కత్తిరించి, లాగు చొక్కా వేసి ‘సల్మాన్’గా మార్చారు. తండ్రి ముందు అసలు పేరు చెప్పొద్దని, అతనున్నంత కాలం లాగు, చొక్కాలే వేసుకోవాలని ఒప్పించారు. ఆ అమాయక పిల్ల సంతోషంగా సరేనంది.
సులేమాన్ ఊళ్లోకి దిగాడు. రాగానే బిడ్డను చూడాలని అతని ఆరాటం. తనకు పుట్టిన కొడుకు కోసం దుబాయ్ నుంచి ఏమేమో తీసుకొచ్చాడు. కొడుకు రూపంలో ఉన్న కూతుర్ని ఎత్తుకొని, ముద్దాడి తనివితీరా ఆనందపడ్డాడు. కొత్త లాగు, చొక్కాలు వేయించాడు. ‘సల్మాన్..సల్మాన్’ అంటూ భుజాల మీదకెత్తుకుని ఊరంతా షికార్లు చేశాడు. ఇంట్లోవారికి రోజుకొక గండంలా ఉంది. ఎప్పుడు నిజం కనిపెట్టేస్తాడోనని భయంభయంగా ఉంది. సల్మాన్‌కు సున్తీ చేయించాలని తండ్రి పట్టుబట్టాడు. నిజం తేలిపోయే సమయం వచ్చేసింది. తనకు పుట్టింది ‘సల్మాన్’ కాదు ‘సల్మా’ అని గుర్తించే సమయం ఆసన్నమైంది. గుర్తిస్తే జులేఖా పరిస్థితి ఏమిటి? ఆడపిల్లలు మగపిల్లల్లా చెలామణీ అవుతూ బతకాల్సిన బతుకులకు అంతం ఎప్పుడు? అసలీ ఆడామగా తేడాలు పెట్టిన భగవంతుడికి ఆడపిల్లలెందరు?
కన్నడ వచన సాహిత్యంలో ముస్లిం జీవిత వైవిధ్యాలను తొలిసారి ప్రవేశపెట్టిన రచయిత బోల్వర్ మహ్మద్ కున్హి. పుట్టింది దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు. సిండికేట్ బ్యాంకు చీఫ్ మేనేజర్‌గా 38 ఏళ్లు పనిచేసి రిటైరయ్యారు. ఇది ఆయన వృత్తిజీవితం. రచనా జీవితం చాలా విస్తృతమైనది. మహమ్మద్ ప్రవక్త జీవితంపై ‘ఒదిరి’ పేరిట కన్నడలో చారిత్రక నవల రాశారు. ప్రవక్త భార్య ఆయిషా జీవితం గురించి ‘ఉమ్మ’ అనే నవల రాశారు. లెక్కలు మిక్కిలి కథల్ని రచించారు. 1110 పేజీల ఉద్గ్రంథం ‘స్వతంత్రద ఓట’ రాశారు. 12 బాలనాటికలు ఎడిట్ చేశారు. ‘పాపు గాంధీ గాంధీ బాపు ఆద కథె’ పేరుతో మహ్మాత్మాగాంధీ జీవితాన్ని పిల్లల భాషలో రాసి ప్రశంసలు పొందారు. రెండుసార్లు కేంద్ర సాహిత్య అకాడమీ, మూడు సార్లు కర్ణాటక సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. ఆయన రాసిన కథ ఆధారంగా 2021లో కన్నడ ప్రసిద్ధ దర్శకుడు పి.శేషాద్రి ‘బేటీ’ అనే సినిమా తీశారు. ఈ చిత్రానికి కథ అందించడంతోపాటు మాటలు, పాటలు రాశారు బోల్వర్ మహ్మద్.
ఆడపిల్ల పుడితే వడ్లగింజలు వేసి చంపే కాలం నుంచి ఆపరేషన్ సిందూర్‌కు మహిళలే నాయకత్వం కాలం దాకా ఎదిగాం. కానీ ఇంకా ‘గుండెల మీద కుంపటి’ నానుడి పోలేదు. ఇప్పట్లో పోయేలా లేదు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తల్లిదండ్రుల్ని చూసి జాలిపడే సమాజం, సమూహం ఇంకా మన చుట్టూనే ఉంది. రాజస్థాన్‌లో ఆడపిల్ల పుట్టిన ఇంట్లో శోకదినాలు పాటిస్తారట. ఆ దినాలు కొన్నేళ్లకు పోవచ్చు. కానీ ‘ఆడపిల్లలుగా ఎందుకు పుట్టామురా భగవంతుడా?’ అని ఏడ్చే రోజులు మాత్రం ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ శోకానికి ఎప్పుడు వీడ్కోలు పలికేది?
PS: ఈ సినిమా English Subtitlesతో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
– విశీ